కథా సంవేదన: భవిష్యత్తు

katha samvedana

Update: 2023-08-27 00:30 GMT

చాలామందికి తమ భవిష్యత్తు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. అదేవిధంగా ముహూర్తాల పిచ్చి. అందరి మనస్సుల్లో ఇవి చాలా బలంగా నాటుకుపోయాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే కూడా కొంతమంది మంచి సమయం కోసం చూస్తూంటారు. ఉద్యోగంలో చేరేటప్పుడు, చార్జి తీసుకునేటప్పుడు కూడా రోజులను, సమయాలను ఎక్కువగా పట్టించుకుంటారు.

1989 లో నేను మేజిస్ట్రేట్‌గా సెలక్ట్ అయ్యాను. మా బ్యాచి వాళ్లందరినీ మే 1 వ తేదీన జాయిన్ అవ్వమని హైకోర్టు ఉత్తర్వులని జారీ చేసింది. అందుకు మా బ్యాచ్ వాళ్లకి మంచి రోజు చూసుకునే అవకాశం చిక్కలేదు. ఆ రోజులో మంచి సమయాన్ని ఎంపిక చేసుకున్న మిత్రులు కొంతమంది ఉండవచ్చు. నేను ఆ విషయాలేవీ పట్టించుకోలేదు. కాలం అలా గడిచిపోయింది హాయిగా. ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందీ కూడా రాలేదు. భవిష్యత్తు తెలుసుకోవాలన్న కోరిక కూడా నాకు ఎప్పుడూ ఉండేది కాదు. అందుకని ఆ పని ఎప్పుడూ చేయలేదు. రేఖలను బట్టి, గ్రహాలను బట్టి భవిష్యత్తు తెలుస్తుందా ఏమి?

నాకు మాత్రం ఏమీ తెలియదు. భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటే మంచిదే. అదేవిధంగా ఉండాలని కోరుకోవడం కూడా మంచిదే. కానీ, భవిష్యత్తు తెలిస్తే మజా పుడుతుందా ఆతృత, ఆనందం ఉంటుందా? మిత్రుడు నందిగం క్రిష్ణారావుతో మాట్లాడుతున్నప్పుడు టేప్‌రికార్డర్ గురించి మా సంభాషణ కొనసాగింది.

మా చిన్నప్పుడు రేడియో ఉంది కానీ టేప్‌రికార్డర్ లేదు. రేడియోలో పాటలు వచ్చేవి. ఏ పాట తరువాత ఏ పాట వస్తుందో తెలియదు. నచ్చిన పాట, ఇష్టమైన పాట వస్తే మనస్సు గాలిలో తేలిపోయినట్టు అనిపించేది. కేసెట్‌లో ఎంపిక చేసుకున్న పాటలని రికార్డు చేయించేవాళ్లం. మొదటి పాట తరువాత రెండవ పాట ఏమిటో తెలిసిపోయేది. రెండు మూడు సార్లు విన్న తరువాత ఏ పాట తరువాత ఏ పాట వస్తుందో ఇలా తెలిసిపోయేది. ఎంతో ఇష్టమైన పాటలు, మంచి పాటలు ఉన్నా అవి అంత హాయిని ఇవ్వలేకపోయేవి. కారణం ఏ పాట వస్తుందో తెలియడం వల్ల. రేడియోలో అలా కాదు. అనుకోకుండా మనకు నచ్చిన పాట వచ్చేది. ఉత్సాహంగా అనిపించేది. ఆనందంగా ఉండేది. భవిష్యత్తు కూడా అంతే! తెలిస్తే మజా ఏం ఉండదు. ఈ చిన్న విషయం తెలుసుకుంటే భవిష్యత్తు తెలుసుకోవాలన్న ఉత్సాహం చాలామందిలో తగ్గుతుంది. అదీ నిజంగా భవిష్యత్తు చెప్పేవాళ్లుంటే. భవిష్యత్తు తెలుసుకోవడం అవసరమా..!

మంగారి రాజేందర్ జింబో

94404 83001

Tags:    

Similar News