కథా సంవేదన: పాత నోట్ బుక్

Katha samvedana

Update: 2023-07-22 23:30 GMT

మధ్య ఇంట్లో పుస్తకాలు సర్దుతుంటే ఓ పాత నోట్‌బుక్, కొన్ని డైరీలు కన్పించాయి .1974వ సంవత్సరంలో వివిధ పత్రికల్లో వస్తున్న పజిల్స్‌ని, ముఖ్య విషయాలని రాసుకున్న పుస్తకం నోట్ బుక్ అది. నా చేతివ్రాత, చిన్న చిన్న బొమ్మలు చూస్తూ అలాగే ఉండిపోయాను. ఆ నోట్ బుక్ నిండా పజిల్స్, ప్రశ్నలు వాటి జవాబులు. కాలేజీలో కన్పించిన పుస్తకం నుంచో, పత్రికల్లో వచ్చిన వాటి ఆధారంగా తయారు చేసిన పుస్తకం అది.. పజిల్స్‌ని పూర్తి చేయడం అప్పుడు ఆసక్తికరంగా ఉండేదేమో.. దాని చివర్లో ఏదో కవిత కన్పించింది. నేను రాసిందే. ఇంకా తిరగేస్తే ఏవో కొన్ని కొటేషన్స్ కన్పించాయి. అప్పటి అభిరుచి అనుకుంటాను. ఒక్క సాహిత్యం మాత్రమే వెంట వచ్చింది. మిగతావి కాలంలో కరిగిపోయాయి.

నేను రాసుకున్న చేతిరాతని, చిన్నచిన్న బొమ్మలని చూస్తూ అలాగే ఎక్కడికో వెళ్లిపోయాను. ఆ నోట్‌బుక్ నాకు టైమ్‌మిషన్‌లా కన్పించింది. మనస్సు 1974వ సంవత్సరంలోకి వెళ్లిపోయింది. సైకిల్ తొక్కుతూ నాలుగు కిలోమీటర్లు వున్న కాలేజీకీ వెళ్లడం, కరీంనగర్ రోడ్ల మీద నలుగురం మిత్రులం కలిసి ఎలాంటి అవాంతరాలు లేకుండా నడవడం లాంటివి ఎన్నో గుర్తుకు వచ్చాయి.

నా చేతిరాత చూస్తుంటే నా చిన్నప్పటి క్లాస్‌మేట్స్ గుర్తుకొచ్చారు. మరెంతో మంది చేతి రాతలు గుర్తుకు వచ్చాయి. చేతిరాతకు సంబంధించి గుర్తుకొచ్చే వ్యక్తులు ప్రధానంగా ముగ్గురు. వాళ్లు మా గుణక్కకి, నాకు క్లాస్‌మేట్స్. వాళ్ల పేర్లు రాజ్యం, భాను. వాళ్ల చేతిరాత డబ్బాడబ్బాలుగా వుండేది. చాలా ఆకర్షణీయంగా వుండేది. వాళ్లిద్దరూ స్కూల్లో క్లాస్ మేట్స్. యాభై సంవత్సరాలు గడిచినా వాళ్ల చేతిరాత నా కళ్ల ముందు కదలాడింది. మూడో వ్యక్తి డిగ్రీ లోని క్లాస్ మేట్ ఖలీల్. అతని అక్షరాలు అందంగా వుండేవి. మా రఘుపతన్న స్నేహితుడు డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా నుంచి రాసిన ఉత్తరాల్లోని అక్షరాలు గుర్తుకొచ్చాయి. ఆయన అక్షరాలు ప్రింట్ చేసినట్టుగా వుండేవి.

కాసేపటి తర్వాత డైరీలను తిరగేసాను. డైరీలను తిరగేస్తుంటే ఏవో లెక్కలు కన్పించాయి. ఎన్నో లెక్కలు కనిపించాయి. అప్పటి జీవన స్థితిగతులు బోధ పడినాయి. అందులో బస్సు ఛార్జీల లెక్కలు కూడా వున్నాయి. అప్పుడు మా వేములవాడకి కరీంనగర్‌కి వున్న బస్సు టిక్కెట్ ధర ఒక్క రూపాయి. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా. ఈ రఫ్ నోట్‌బుక్ తిరగేస్తుంటే ఏదో పాతడైరీ కన్పించింది. అందులో ఇంటి ఖర్చులు కన్పించాయి. అప్పటి ధరలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆలోచనల్లో పడేశాయి. మొన్న ఓసారి తిరగేస్తుంటే నా జీతం వివరాలు రాసి వున్న పుస్తకం కన్పించింది. ప్రతి నెలా నా జీతం వివరాలని, డి.ఏ. తదితర వివరాలని అందులో పొందుపరిచేవారు. నేను మున్సిఫ్ మేజిస్ట్రేట్‌గా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నా జీతం బేసిక్ 1150 రూపాయలు. మరి ఇప్పుడు...

కొన్ని డైరీలు, నోట్‌బుక్స్ అప్పుడప్పుడు కన్పించి మనలని ఎక్కడికో తీసుకెళ్తాయి. చేతి రాతల వెనక ఉన్న ఆసక్తితోపాటూ నా చేతిరాతను కూడా చూస్తూ వుండిపోయాను. ఇప్పటి తరం రాయడం తగ్గించి వేశారు. దేన్నైనా వాళ్లు టైప్ చేస్తున్నారు. వాళ్లకి తమ రఫ్ నోట్‌బుక్స్ దొరకడం కష్టమే.

ఇంట్లో పుస్తకాలు డైరీలు ఎక్కువ అయిపోతున్నాయని బయట పడేస్తూంటాం. కానీ వీటిల్లో ఒక్క జ్ఞాపకాలే కాదు, వినోదం వుంది. విజ్ఞానం వుంది. జీవన స్థితిగతులూ వున్నాయి .అన్నింటికీ మించి గొప్ప ఆకర్షణ వుంది. చదివితే ఎంతో జీవితం వుంది. ఆలోచిస్తే వేదాంతం వుంది. నా అభిప్రాయాలు గుర్తుకొచ్చాయి. చిన్ననాటి మిత్రులు గుర్తుకొచ్చారు. డిగ్రీలో నాతోపాటు చదువుకున్న మిత్రులు ఎందరో గుర్తుకొచ్చారు. ఇద్దరు ముగ్గురు మిత్రులు తప్ప మిగతా వాళ్లు ఎవరూ నాకు టచ్‌లో లేరు. ఎప్పుడో అకస్మాత్తుగా ఎక్కడో బస్టాండ్‌లో ఎవరో ఒకరు కన్పించేవారు. బస్టాండుకు వెళ్లడం తగ్గిపోవడంతో, ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిల్లో ఎవరన్నా దొరుకుతారో చూడాలి.

డిగ్రీలో రాసుకున్న పుస్తకం నన్ను యుక్త వయస్సులోని కాలేజీలోకే కాదు చిన్నప్పటి స్కూల్ వైపు కూడా ప్రయాణం చేయించింది. నోట్ పుస్తకమే కాదు. ఫొటోలు, ఉత్తరాలు, అప్పటి వారపత్రికలు, చందమామ, బాలమిత్రలు మనల్ని వెనక్కి తీసుకొని వెళ్తాయి. టైమ్ మిషన్‌లా పని చేస్తాయి. సినిమాల్లోని టైమ్ మిషన్ మాదిరిగా మనం ఆ జీవితాన్ని తిరిగి పొందలేం. అప్పుడు చేసిన తప్పులని సరిదిద్దుకోలేం. కానీ ఆ జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోగలం. మననం చేసుకోగలం. మళ్లీ పొందలేం. కానీ.. ఆ అనుభూతి ఆస్వాదించగలం. టైమ్ మిషన్ దొరకాలని కోరుకోని వ్యక్తులు ఎంతమంది.. బహుశా ఎవరూ ఉండరేమో.

అప్పటి నోట్ బుక్స్ చేతివ్రాతలు, డైరీలు అప్పటి పరిస్థితులని ఎన్నింటినో మన కళ్ల ముందు వుంచుతాయి. అవి మన కళ్ల ముందు కదలాడుతాయి. పాత వాటిని చింపివేసే ముందు, బయటపడేసే ముందు ఒక్క సారి ఆలోచించాలని అనిపించింది. ఏదైనా కొంతకాలం గడిస్తే కానీ బోధపడదు. అవి రఫ్ పుస్తకాలే కావాల్సిన అవసరం లేదు. అవి ఏవైనా కావొచ్చు. వాటి విలువ, పాత నోట్ పుస్తకాల విలువ, డైరీల విలువ ఇప్పుడు అర్థం కాదు. గడిచిన తరువాతే అర్థమవుతుంది. వాటి విలువే కాదు. మనుషుల విలువ కూడా అంతే !!

మంగారి రాజేందర్ జింబో

94404 83001

Tags:    

Similar News