దారి తప్పిన కార్తీక వనభోజనాలు

దారి తప్పిన కార్తీక వనభోజనాలు... Kartika Vanabhojanala celebrations are being misused

Update: 2022-11-16 18:30 GMT

కార్తీక మాసం వచ్చిందంటే దక్షిణ భారతదేశంలో హడావుడి, సందడి మొదలవుతుంది. నదీ స్నానాలు, ఉసిరి చెట్ల కింద వన భోజనాలు చేయడం జరుగుతుంది. కార్తీక మాసంలో వర్షాకాలం పోయిన తరువాత ఇటు వానలు లేకుండా, అటు చలి ఎక్కువ లేకుండా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున నైమిశారణ్యంలో మునులందరూ సూత మహర్షి సమక్షంలో శ్రీహరి ప్రతిమను ప్రతిష్టించి ఉసిరికాయలతో పూజించి భోజనాలు చేయడంతో ఈ ఆచారం ప్రారంభమైంది. ఒకప్పుడు బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు అందరూ కలిసి దగ్గరలోని అటవీ ప్రాంతంలో కి వెళ్లి ఉసిరి చెట్ల కింద కార్తీక భోజనాలు చేసేవారు. ఇంటి నుంచి రకరకాల పిండి వంటలు, తీపి పదార్థాలు తెచ్చుకోవడమో లేదా అక్కడే అందరూ కలిసి వండుకొని తినడమో చేసేవారు.

దీంతో మానవ సంబంధాలు, మమతానురాగాలు మరింతగా బలపడేవి. నేడు ఆర్థిక సంబంధాలు, కుల సంబంధాలు పెరిగిపోయాయి. కుల సంఘాల పేరుతోనే కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈ వన భోజనాలలో రాజకీయ నాయకులు పాల్గొనడం వలన అవి రాజకీయ వేదికలుగా మారిపోతున్నాయి. ప్రజల మనసులలో కుల, రాజకీయ భావజాలం నాటుకొని విద్వేషాలు పెరుగుతున్నాయి. ఈ కుల సంఘాల కార్తీక వన భోజనాలలో 'కులం కత్తి లాంటిది, మతం మత్తు లాంటిది' అనే వామపక్షవాదులు కూడా పాల్గొనడం విచిత్రం. రోజూ పనుల ఒత్తిడి, ఆవేశపూరిత జీవితం నుంచి తాత్కాలిక ఉపశమనం కొరకే ఈ వన భోజనాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని గుర్తించాలి. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి జరుపుకునే ఒక వేడుకగా భావించాలి. అంతే తప్ప కుల, రాజకీయ విభేదాలకు తావు ఇవ్వకూడదు.


ఆళవందార్ వేణుమాధవ్

హైదరాబాద్

86860 51752

Tags:    

Similar News