నేటి బాల్యమే..రేపటి భారతం

నెహ్రూ, అభివృద్ధి చెందిన భారత్‌గా మనం ఎదగాలని బాలలను, యువకులను కుల, మతాలకతీతంగా అందరికీ సమాన విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు

Update: 2024-11-14 00:30 GMT

నెహ్రూ, అభివృద్ధి చెందిన భారత్‌గా మనం ఎదగాలని బాలలను, యువకులను కుల, మతాలకతీతంగా అందరికీ సమాన విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు కల్పించేలా ఎంతో కృషి చేశారు. "నేటి బాలలే రేపటి పౌరులు" అంటూ చాచా నెహ్రూగా మన త్రివర్ణ పతాకం సాక్షిగా నేటికీ స్ఫూర్తినిస్తూనే వున్నారు. ఐఐటీ, ఎయిమ్స్, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల స్థాపనలో, విఖ్యాత భారతీయ శాస్త్రవేత్తలు సి వి రామన్, విక్రమ్ సారాభాయ్, హోమీ జహంగీర్ బాబా వంటి ప్రముఖులతో కలిసి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా వుండాలనే సంకల్పంతో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకొని దేశాన్ని ముందుకు నడిపారు. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు పునాది వేశారు. 

నెహ్రూది సుసంపన్న కుటుంబం, ఉన్నత విద్యాభ్యాసం నేపథ్యం వున్నప్పటికీ, స్వాతంత్ర్య సమరంలో జైలు జీవితాన్ని ఆనందంగా గడుపుతూ, "మహర్షి వంటి వాడైన మా ప్రియతమ నాయకుడు గాంధీజీకి శిక్ష విధించిన తర్వాత జైలు మాకు స్వర్గమైంది. పవిత్రమైన యాత్రాస్థలమైంది" అంటూ తన జీవితాన్ని మన దేశం కోసమే త్యాగం చేసిన విశ్వ శాంతి కాముకుడు, జవహర్ లాల్ నెహ్రూ.

విద్య అంతరిక్షపు తార అయిందా?

నిజాయితీగా మాట్లాడుకుంటే ఎన్నో రాజకీయ పార్టీలు, నాయకులు 78 సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూనే వున్నా పేదరికపు చావులు, బాలకార్మిక వ్యవస్థలు ఇంకా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అందరికీ సమాన విద్యావకాశాలు అందడం లేదు. చాలా వరకు సామాన్య ప్రజలు మొదలుకొని రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సైతం ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి చూపి స్తున్న ఆసక్తిని తమ పిల్లలను ప్రభుత్వ బడులు, కళాశాలల్లో చేర్పించడంలో కనపడటం లేదు. దీనిపై మేధావులు, విద్యావేత్తలు, సామాన్య ప్రజలు దేశ స్థాయిలో చర్చలు జరిపి లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం వుంది. విద్యలో పెరుగుతున్న అంతరాలను తగ్గించి, మార్పులను స్వాగతించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కొన్ని కోట్ల మంది పిల్లలకు అవకాశాలే లేక ఐఐటి, మెడిసిన్, ఐఏఎస్ వంటివి అందని అంతరిక్షపు తారలయ్యాయి. అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, పరిశోధనలు మనదేశంలో పెద్దగా కనిపించడం లేదని ఎన్నో రీసెర్చ్ సంస్థల గణాంకాలే చెబుతున్నాయి. నెహ్రూ కలలు గన్న భవిష్యత్ భారతపు బాల్యం సమస్యల వలయంలోనే కొట్టుమిట్టాడుతుందనే చెప్పవచ్చు.

దేశ భవిష్యత్తు పార్లమెంట్‌లో కాదు...

నెహ్రూ మొదటి ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం పాటు కొనసాగటంతో పాటు, వారి కుటుంబ వారసత్వం కూడా దేశాన్ని పాలించడంలో నేడు ఎన్నో విభిన్న అభిప్రాయాలు మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ ప్రజా స్వామ్య లౌకిక భారతంలో భవిష్యత్తు తరాలకు గుణాత్మక విద్య, ఉన్నత స్థాయి వైద్యం, బ్రతకడానికి భద్రత అందించాల్సిన బాధ్యత నేటితరపు రాజకీయ నాయకులు, పార్టీలపై వుంది. ముఖ్యంగా బాలలు, యువతకు గ్లోబలైజేషన్ ప్రపంచంలో ఆధ్యాత్మిక నైతిక విలువలను వెలికితీసే విద్యను అందిస్తూ మానవత్వపు మంత్రంతో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా దూసుకెళ్లేలా చూడాలి. కర్బన ఉద్గారాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రకృతి తల్లడిల్లుతున్న ఈ గ్లోబల్ వార్మింగ్‌లో అడవులను నరకడం ఆపి, చెట్లను పెంచుతూ కాలుష్య రహిత సమాజంలో నేటి బాలలు కీలకం కావాలి. బస్టాండ్‌ల్లో, పరిశ్రమల్లో, హోటళ్లలో, యుద్ధాలలో తదితర ప్రాంతాల్లో "బాల్యం" బందీగా మారకుండా చూడాలి. తల్లిదండ్రులు కూడా తమ ఆశలు, ఆశయాల పేరిట, పరువు పేరిట బరువును మోపి సంప్రదాయాల పేరిట పిల్లలను ఒత్తిడికి గురి చేయకుండా జాగ్రత్త వహించాలి. పావన నవజీవన బృందావన నిర్మాతలు- రాబోవు యుగానికి దూతలు అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు, ఈ దేశ భవిష్యత్తు పార్లమెంటులో కాదు పాఠశాలల్లోనే నిర్మించబడుతుందనే దార్శనికతను ప్రదర్శించిన గాంధీజీ, అంబేద్కర్ ఆలోచనలు నిజం కావాలి. నెహ్రూ శాంతి సౌధం నేటి యుద్ధం ప్రపంచానికి పాఠం కావాలి..!

(నేడు బాలల దినోత్సవం) 

ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Tags:    

Similar News