నిగ్గుతేలేది ‘మొగ్గు’ను బట్టే!
నిగ్గుతేలేది ‘మొగ్గు’ను బట్టే!... Karnataka Elections 2023: survey Report On Who Will Win Karnataka elections
ఇప్పటికింకా తటస్థంగా, గుంభనంగా ఉన్న నాలుగు శాతం ఓటర్లు ఎటు మొగ్గుతారన్నదాన్ని బట్టి కర్ణాటకలో రాజకీయాల రంగు తేలనుంది. పలు సర్వేలు విపక్ష కాంగ్రెస్‌కి కొంత ఆధిక్యాన్నిస్తున్నాయి. స్వల్ప మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని కొన్ని సర్వేలు చెబితే, మరికొన్ని సర్వేలు మాత్రం, అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుందే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఎవరికీ రాకపోవచ్చంటున్నాయి. సర్వే అంచనాలు వెలువడిన తర్వాతి నుంచి కాంగ్రెస్ గ్రాఫ్ పైపైకి పోతుంటే, అధికార బీజేపీ గ్రాఫ్ అడుక్కుపోతోంది. ఇందుకు వేర్వేరు కారణాలున్నాయి. మూడు వారాల్లో జరుగనున్న పోలింగ్ నాటికి ఇంకెన్నెన్ని పరిణామాలు చోటుచేసుకోనున్నాయో! ఈ వాతావరణం ఇలాగే సాగితే.... ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలు కాంగ్రెస్‌కు దక్కినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దాచినా దాగని చిచ్చు
టిక్కెట్ల ప్రక్రియ మొదలైన నుంచి రెండు పార్టీల్లోనూ అసంతృప్తి సెగలు రేగాయి. ముందు కాంగ్రెస్‌లో ఈ లొల్లి వీధుల్లోకి రాగా తాజాగా ఇప్పుడు బీజేపీలో అసంతృప్తి బజారుకెక్కింది. సొంత పార్టీ అసంతృప్తి రాగాల్ని తక్కువ చేసి చూస్తున్న ప్రధాన పార్టీలు, ప్రత్యర్థి పార్టీలోని అసమ్మతి సెగలు తమకెంత కలిసివస్తాయోననే ఆశావహ దృక్పథంతో ఉన్నాయి. బలమైన అసంతృప్తులను చేరదీసి, ప్రత్యర్థుల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. గుజరాత్, ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో అనుసరించిన పద్దతే అంటూ... బీజేపీ నాయకత్వం చేపట్టిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తేనెతెట్టెను కదిలించినట్టయింది. ఎక్కడికక్కడ స్థానికుల అభిప్రాయాన్ని బట్టి, ‘గెలిచే వారికే టిక్కెట్టు’ అంటూ జరిపిన కసరత్తు వికటించినట్టే కనిపిస్తోంది. 51 మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు నిరాకరించడం పార్టీలో పెద్ద కుదుపే! ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చిన సుమారు పది, పన్నెండు మందిని అభ్యర్థులు చేయటాన్ని టిక్కెట్టు దక్కని పార్టీ నాయకులు జీర్ణించుకోవడం లేదు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ వంటి వారూ పార్టీని వీడుతున్నారు. 20 మంది తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. ఇంకొంత మంది అసహనంతో పార్టీ మారుతున్నారు. బుజ్జగింపు చర్యలు పెద్దగా ఫలితాలివ్వటం లేదు. దాంతో బెదిరింపు పర్వం మొదలైంది. ‘ఆలోచించుకోండి, ఒకసారి పార్టీ వీడితే... 20 ఏళ్ల వరకు పార్టీలోకి తిరిగి తీసుకునేది లేద’ని నాయకత్వం హెచ్చరికలు జారీ చేసింది.
తటస్థుల నిర్ణయమే కీలకం
ఇక్కడ ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుంది అన్న ప్రశ్నకు ‘పీపుల్స్‌పల్స్’ సర్వే సంస్థ ‘సౌత్ ఫస్ట్’ మీడియాతో కలిసి జరిపిన సర్వేలో భిన్నమైన అభిప్రాయాలు వెలువడ్డాయి. మార్చి 25-ఏప్రిల్ 10 తేదీల మధ్య జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుందని 26 శాతం మంది చెబితే, బీజేపీ ఏర్పాటు చేస్తుందని 24 శాతం మంది, జేడీ(ఎస్) ఏర్పరస్తుందని 15 శాతం మంది చెప్పారు. ఏ ఒక్కరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని 31 శాతం మంది చెప్పగా 4 శాతం మంది మాత్రం ఏమో ఏమీ చెప్పలేమన్నారు. సరిగ్గా ఓటింగ్ తేదీ నాటికి వీరు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటివరకున్న పరిస్థితిని బట్టి వివిధ సర్వే సంస్థలు వేర్వేరు అంచనాలను వెలువరించాయి. సీ-ఓటరు కాంగ్రెస్ (115-127) కి మెజారిటీ అవకాశం ఉందని చెబితే, మాట్రైజ్ మాత్రం బీజేపీ (96-106)కి మెజారిటీ రాకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పింది. పీపుల్స్‌పల్స్ మాత్రం బీజేపీకి 92 (90-100) స్థానాలు, కాంగ్రెస్‌కు 98 (95-105) స్థానాలు లభించే అవకాశం ఉందని, జేడీ(ఎస్) 27 (25-30) స్థానాలు దక్కించుకోవచ్చని అంచనా వేసింది.
ఓట్లను సీట్లుగా మలిస్తేనే!
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుస ఎన్నికల్లో ప్రజాదరణ ఉండి, ఎక్కువ శాతం ఓట్లు పొందీ, తగినన్ని సీట్లు తెచ్చుకోలేకపోతోంది. 2004 నుంచి వరుస ఎన్నికల్లో (2008, 2013, 2018) పొందిన ఓట్ల శాతం పరంగా చూసినపుడు కాంగ్రెస్‌కే అధిక ప్రజాదరణ ఉండింది. కానీ, 2013లో తప్ప మిగతా అన్ని ఎన్నికల్లో ఓట్లకు తగ్గ నిష్పత్తిలో సీట్లు పొందలేకపోయింది. బీజేపీలా వ్యూహాత్మకంగా ఎన్నికల్ని ఎదుర్కోనందున, ఓట్లను సీట్లుగా మలచుకునే తెలివిడి కాంగ్రెస్‌లో లోపిస్తోంది. ముక్కోణపు పోటీ జరిగినపుడు మూడో వంతుకు మించి ఓట్లు తెచ్చుకున్న పార్టీ సహజంగానే మెజారిటీ సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నది ఒక సెఫలాజికల్ లెక్క! కానీ, జేడీ(ఎస్)కి దక్షిణ కర్ణాటక (ఓల్డ్ మైసూర్)లో పట్టు ఉన్నట్టే బీజేపీ కూడా ముంబయ్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకలో మాత్రమే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కువ స్థానాలు గెలుస్తోంది. కాంగ్రెస్ మాత్రం అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాల్లోనూ ఉంటూ, రాష్ట్రవ్యాప్తంగా ఉనికిని నిలుపుకుంటూ మెజారిటీ ఓట్లు పొందుతున్నా, మెజారిటీ సీట్లు దక్కటం లేదు. అక్కడ వెనుకబడుతోంది.
ఈ సారి అనుకూలతలే ఎక్కువ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోవడమే కాకుండా ఇతరేతర అంశాలు కూడా ఈసారి వారికి అనుకూలిస్తున్నాయి. ఇంటింటి యజమానురాలికి డబ్బులిచ్చే ‘గృహలక్ష్మీ’ ఉచిత విద్యుత్తు అందించే ‘గృహజ్యోతి’ పేదలకు బియ్యమిచ్చే ‘అన్న భాగ్య’ నిరుద్యోగులకు భృతి కల్పించే ‘యువనిధి’ పథకాల ప్రకటనలకు మంచి స్పందన, ఆదరణ లభిస్తోంది. భౌగోళికంగా, సామాజికవర్గాల వారిగా కాంగ్రెస్ భూమిక మరింత విస్తరించడమే కాకుండా బలపడినట్టు పలు సర్వేల్లో తేలింది. ఓట్లు సీట్లుగా మారడం ఈసారి ప్రభావవంతంగా ఉండొచ్చని ఒక అంచనా! సీఎస్డీఎస్-లోక్‌నీతి సర్వే ప్రకారం, 2018 ఎన్నికల్లోనే ఎక్కువ సామాజికవర్గాల్లో కాంగ్రెస్‌కు సానుకూలత లభించింది. దళితుల్లో 51 శాతం, ముస్లీంలలో 67 శాతం, ఆదివాసీల్లో 42 శాతం, క్రిస్టియన్లలో 50 శాతం, ఇతర బీసీల్లో 36 శాతం, ఓసీల్లో 35 శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు ఆ సర్వే తెలిపింది. తక్కువగా అంటే వక్కలింగలలో 28 శాతం, బీజేపీకి 60 శాతం ఓట్లు దక్కిన లింగాయత్‌లలో 21 శాతం మాత్రమే కాంగ్రెస్‌కు లభించాయి.
పెరిగిన నిత్యావసరాల ధరలు, నిరుద్యోగిత, బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ముఖ్యమంత్రిగా బొమ్మై సామర్థ్యలేమి వంటివి జనంలోకి బాగా వెళ్లటం కాంగ్రెస్‌కు లాభిస్తోంది. రాహుల్ జరిపిన భారత్‌జోడో యాత్ర ప్రభావం, మల్లిఖార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ అఖిలభారత అధ్యక్షుడు కావడం వంటివి మరింత దన్నుగా ఉండొచ్చని కాంగ్రెస్ ఆశిస్తోంది. బీజేపీ మాత్రం, మనసు మార్చుకున్న యడ్యూరప్ప సహకారం, అంతకు మించి ప్రధాని మోదీ కరిష్మాని ఎక్కువగా నమ్ముకుంటోంది.
-దిలీప్‌రెడ్డి,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్‌సంస్థ,
9949099802
dileepreddy.ic@gmail.com
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672