కళ్లముందే కనుమరుగవుతున్న రైతు

kadaisi vivasayi movie review

Update: 2023-11-11 00:45 GMT

ఇటీవలి కాలంలో వ్యవసాయం, రైతుల సమస్యను ప్రతిపాదిస్తూ తమిళ సినిమాలు అనేకం వచ్చాయి. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న రైతు సంఘం ఉన్న గ్రామంలో మిగిలిపోయిన చివరి రైతు గురించిన కథ 'చివరి రైతు' (కడసీ వ్యవసాయి, తమిళం). ఈ చిత్రం రైతు మల్లయ్య చుట్టూ తిరుగుతుంది. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, నీటి వనరులు తగ్గిపోవడం ఆధునిక పని అవకాశాలతో, గ్రామంలో వ్యవసాయం అంతరించిపోయే దశకు చేరుకుంది. గతంలో విస్తారమైన భూముల్లో వ్యవసాయం చేసిన మరికొందరు భారీ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొని వదులుకున్నారు. వారు తమ పొలాలను భూములపై కన్నేసిన సొరచేపలకు విక్రయించారు. అంతేకాకుండా సులభమైన ఆదాయం కోసం తక్కువ అర్ధవంతమైన వ్యాపారాలలో స్థిరపడ్డారు. ఏదేమైనా, గ్రామంలో వ్యవసాయానికి ఎదురవుతున్న విధ్వంసం రైతు జీవితానికి అతి పెద్ద సవాలు విసురుతోంది. విరుచుకుపడుతున్న డైనోసార్ వ్యవసాయ జీవితాన్ని ఎలా కబళిస్తుందో హృద్యంగా చెప్పిన సినిమా కడైసి వ్యవసాయి. వ్యవసాయమే ఏకైక జీవన శైలిగా కలిగి వున్న వృద్ధ రైతు మల్లయ్య తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని మార్పులకు గురికాకుండా జీవించగలిగాడు. కానీ పరిస్థితులు ఒక్కటొక్కటే ఎదురు తిరుగుతున్నప్పుడు తన జీవితం ఏమైంది అనేది ఈ చిత్ర కథ. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన 69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ తమిళ చిత్రంగా క‌డ‌సీ వ్య‌వ‌సాయి పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్న‌ది. విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ త‌మిళ సినిమాకు ఎం.మ‌ణికంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సోనీలివ్ ఓటీటీలో ఈ త‌మిళ మూవీ తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. వ్య‌వ‌సాయ రంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్ని నిజాయితీగా చిత్రించిన సినిమా ఇది.

కథేమిటంటే...

అడ‌వికి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఒక ప‌ల్లెటూరు అయ్య‌న్న‌పాలెం. వ‌ర్షాలు ప‌డ‌క‌ ఆ ఊరిలో క‌రువు ప‌రిస్థితులు నెల‌కొన్నప్పుడు. రైతులు త‌మ భూముల్ని అమ్ముకుంటాడు. మ‌ల్ల‌య్య అనే వృద్దుడు మాత్రం తాత‌ముత్తాత‌ల నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన భూమినే న‌మ్ముకుంటూ బ‌తుకుంటాడు. వ్యాపారుల‌కు త‌న భూమిని అమ్మ‌డానికి ఒప్పుకోడు. ఈ పరిస్థితుల్లో ఊరిలో క‌రువుకాట‌కాలు పోవాలంటే ఊరి గ్రామ‌దేవ‌త‌కు జాత‌ర చేయాల‌ని ప్ర‌జ‌లంద‌రూ నిర్ణ‌యించుకుంటారు. గ్రామ దేవ‌త‌కు వ‌రిధాన్యం పండించి మొక్కుగా ఇవ్వాల్సి వ‌స్తుంది. మ‌ల్ల‌య్య బావిలో త‌ప్ప ఊళ్లో ఎక్క‌డార నీళ్లు లేక‌పోవ‌డంతో అత‌డి పొలంలోనే దేవుడి మొక్కు తాలూకు వ‌డ్లు పండించాల‌ని ఊరివాళ్లంద‌రూ మ‌ల్ల‌య్య‌ను ప్రాధేయ‌ప‌డ‌తారు. అందుకు ఒప్పుకున్న మ‌ల్ల‌య్య త‌న పొలంలో వ‌రి పంట వేస్తాడు. మ‌ల్ల‌య్య పొలంలో నెమ‌ళ్లు చ‌నిపోవ‌డంతో వాటిని అత‌డే చంపాడ‌ని పోలీసులు కేసు పెడ‌తారు. ఆ కేసు నుంచి మ‌ల్ల‌య్య ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు అత‌డు జైలుకు వెళ్ల‌డంతో దేవుడి కోసం మ‌ల్ల‌య్య వేసిన వ‌రిపంట బాధ్య‌త‌ను పోలీసులు ఎందుకు చూసుకోవాల్సివ‌చ్చింది మ‌ల్ల‌య్య‌ను నిర్ధోషిగా నిరూపించేందుకు ఊరివాళ్లంద‌రూ ఏం చేశారు దేవుడికి మాన్యంగా వ‌డ్లు ఇవ్వాల‌నే మ‌ల్ల‌య్య క‌ల తీరిందా చ‌నిపోయిన త‌న మామ‌ కూతురును త‌లుచుకుంటూ బ‌తికే రామ‌య్య -విజ‌య్ సేతుప‌తి- క‌థేమిటి అన్న‌దే 'చివరి రైతు' (క‌డ‌సీ వ్య‌వ‌సాయి) క‌థ‌.

రైతు కనిపించకుండా పోతే...

క‌డ‌సీ వ్య‌వ‌సాయి అర్థ‌వంత‌మైన సందేశంతో కూడిన భావోద్వేగపూరితమైన నాటకీయ సినిమా. ఆధునిక‌త కార‌ణంగా వ్య‌వ‌సాయ రంగంలో వ‌చ్చిన మార్పుల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో చూపించారు. ఒక‌ప్పుడు రైతులు సంప్ర‌దాయ ప‌ద్ద‌తుల్లో నాగ‌లి, ఎడ్ల‌తోనే వ్య‌వ‌సాయం చేసేవారు. పురుగు మందులు అవ‌స‌రం లేకుండా సేంద్రియ విధానంలోనే ఎరువులు త‌యారు చేసుకుంటూ పంట‌ల్ని సాగుచేశారు. త‌మ‌కు కావాల్సిన విత్త‌నాల్ని తామే పండించుకోవ‌డం త‌ప్పితే కొన‌డ‌మే తెలియ‌దు. కానీ యంత్రాల రాక‌తో సంప్ర‌దాయ విధానాల్ని అంద‌రూ మ‌ర్చిపోతున్నార‌ని, పురుగు మందుల వాడ‌కంతో ప‌ర్యావ‌ర‌ణం క‌లుషితం అవుతూ ప్ర‌కృతికి ఎంతో న‌ష్టం వాటిల్లుతుంద‌ని, క‌రువు కాట‌కాలు సంభ‌విస్తున్నాయ‌ని ద‌ర్శ‌కుడు చెప్పిన మెసేజ్‌ చాలాబాగుంది. వ్య‌వ‌సాయ రంగాన్ని విస్మ‌రిస్తే రానున్న త‌రాల‌కు పంట‌ల సాగు కూడా తెలియ‌కుండా పోతుంద‌ని, రైతు అనే వాడు క‌నిపించ‌డ‌ని సినిమాలో చ‌ర్చించిన విధానం ఆలోచ‌న‌ క‌లిగిస్తుంది. వ్య‌వ‌సాయం త‌ప్ప మ‌రో వృత్తి తెలియ‌ని రైతులు క‌రువు కాట‌కాలు వ‌చ్చిన‌పుడు ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణ‌ను, భూమికి దూర‌మై ప‌డే ఆవేద‌న‌ను హృద్యంగా ఈ సినిమాలో చూపించారు. వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డిన కుమ్మ‌రి, క‌మ్మ‌రి వంటి కుల‌వృత్తులు ఎలా క‌నుమ‌రుగైపోయాయ‌న్న‌ది ద‌ర్శ‌కుడు మ‌న‌సుల్ని క‌దిలించేలా సినిమాలో చ‌ర్చించారు.

వృద్ధులతో సినిమానే ఓ సాహసం

రెగ్యుల‌ర్ సినిమాల్లో మాదిరిగా ఇందులో హీరోహీరోయిన్లు, కామెడీ, పాట‌లు లేవి ఉండ‌దు. ప్ర‌ధాన పాత్ర‌ల్లో వృద్ధులే ఎక్కువ‌గా క‌నిపిస్తారు. విజ‌య్ సేతుప‌తి, యోగిబాబు మిన‌హా పేరున్న స్టార్స్ ఎవ‌రూ సినిమాలో లేరు. నిజంగానే ఓ ప‌ల్లెజీవితాన్ని, రైతుల వ్య‌థ‌ల్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా వాస్త‌విక కోణంలో ఈ సినిమాలో చూపించారు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చ‌నిపోయినా...ఆమె బ‌తికే ఉంద‌ని భ్ర‌మ‌ప‌డే యువ‌కుడిగా విజ‌య్ సేతుప‌తి ఈ సినిమాలో క‌నిపిస్తారు. క‌నిపించేది కొద్ది సేపే అయినా త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడు. యోగిబాబు చిన్న గెస్ట్ అప్పీరియ‌న్స్ మాత్ర‌మే. మ‌ల్ల‌య్యతో పాటు మిగిలిన ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌ది న‌ట‌న అన్న ఫీలింగ్ ఎక్క‌డా క‌ల‌గ‌దు. త‌మ పాత్ర‌ల్లో పూర్తిగా ఒదిగిపోయారు. కాకా ముట్టై, ఆండవన్ కట్టలై సినిమాల్లోలాగే, మణికందన్ తన సందేశాన్ని అత్యంత సున్నితమైన పద్ధతిలో చివరి వ్యవసాయదారుడు చిత్రంలో అందించాడు. ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేకుండా సంపూర్ణంగా ఆర్ట్ ఫిల్మ్ మాదిరిగా సాగే ఈ సినిమాను, కాస్త ఓపిక‌తో చూస్తే మాత్రం చ‌క్క‌టి అనుభూతి క‌లుగుతుంది. ఇది మన రైతుకుటుంబాల్లోని పెద్దల జీవిత కథ అని మర్చిపోవద్దు. ఎవరి జీవితాల గురించి మనం శ్రద్ధ వహించాలో చాటి చెప్పిన చిత్రం ఇది.

కె. రాజశేఖరరాజు

73964 94557

Tags:    

Similar News