దుర్బరంగా జర్నలిస్టుల జీవితాలు

Journalists lives are miserable

Update: 2024-04-27 01:00 GMT

మీడియా రంగంలో పనిచేసే జర్నలిస్టుల జీవనం ప్రస్తుతం ఇంట్లో ఈగల మోత -బయట పల్లకీ మోతగా ఉంది. దేశంలో ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలోని మీడియా సంస్థలలో పని చేస్తున్న వివిధ వర్గాల వారు అనుభవిస్తున్న కష్టాలు వర్ణనాతీతం.

మీడియా సంస్థలలో వివిధ హోదాలలో పనిచేస్తున్న వారు తమ ఆరోగ్యాలు సైతం లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు తమ జీవితాలు అర్పిస్తున్నారు. కానీ మీడియా సంస్థలలో పని చేస్తున్న వారిలో 90 శాతం పైగా దుర్లభమైన జీవితాన్ని అనుభవిస్తుండడం దురదృష్టకరం.

చాలీ చాలని జీతాలతో, పిల్లలను సరైన చదువులు చదివించుకోలేక, స్వంత ఇళ్ళు లేక, ఇంటి బాడుగలు కట్టలేక, అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం చేస్తే తగిన వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక, ఉద్యోగ రక్షణ లేక అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు. వారు అకస్మాత్తుగా అకాల మరణం చెందుతుండడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మా సమస్యలను పరిష్కరించమని అనేక సంవత్సరాలుగా జర్నలిస్ట్ యూనియన్లు అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. అయినా అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి.

ఆశలు అడియాసలైన వేళ..!

తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రాష్ట్రంలోని జర్నలిస్టులు ప్రధాన పాత్ర పోషించారని కచ్చితంగా చెప్పవచ్చు. తెలంగాణా నూతన రాష్ట్రం ఏర్పడితే ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు తీరుతాయని జర్నలిస్టులు అనేక ఆశలు పెట్టుకొని ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన కొద్దిరోజులకే జర్నలిస్టుల ఆశలు అడియాశలు అయ్యాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో జర్నలిస్టులు గత పది సంవత్సరాలుగా ఒక విధంగా నిరాధారణకు గురి అయ్యారనే చెప్పాలి.

2014 లో నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రింట్ మీడియా , ఎలెక్ట్రానిక్ మీడియా లాంటి వివిధ రకాల మాధ్యమాలలో జర్నలిస్టులుగా, డెస్క్ పనిచేస్తున్న వారితో పాటూ ఫోటో గ్రాఫర్, వీడియో షూటర్ లాంటి వివిధ హోదాలలో పని చేస్తున్న అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని, రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ త్రిబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తామని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం ప్రైవేటు స్థలాలు కొని జర్నలిస్టులు అందరికీ ఇళ్ళు వచ్చేటట్లు జర్నలిస్టు కాలనీలు నియమిస్తామని, ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు అందజేసి వారికి అన్ని కార్పొరేట్ హాస్పిటల్ లలో వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలలో ముఖ్యమైనవి. కానీ ఇవేమీ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం.

హెల్త్ కార్డులకు నో వాల్యూ

రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఒక్క త్రిబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన దాఖలాలూ లేవు. మండల, జిల్లాల పరిధిలోని విలేకరులకు అక్కడక్కడా ఆయా శాసన సభ్యుల చొరవతో కొంతమంది విలేఖరులకు మాత్రం ఇండ్ల స్థలాలు 2019 ఎన్నికల ముందు కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ ఊసే లేదు. అనేక ప్రధానమైన కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జర్నలిస్టుల హెల్త్ కార్డులను ఆమోదించే పరిస్థితి నేటికీ కూడా లేదు. దాంతో కిడ్నీ, లివర్, గుండె, బ్రైన్ లాంటి సున్నితమైన జబ్బులకు ఆన్ని సౌకర్యాలు కలిగిన నాణ్యమైన హాస్పిటల్‌లో వైద్యం చేయించుకోలేక జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రెస్ అకాడమీ ద్వారా జర్నలిస్టుల సంక్షేమ నిధి సంవత్సరానికి కేవలం 20 కోట్ల రూపాయలు కేటాయించడంతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులందరికీ తగిన ఆర్థిక సహాయం అందడం లేదు.

ఇకనైనా ఆదుకోండి

చిన్న, మధ్యతరగతి పత్రికలు, పిరియాడికల్, డిజిటల్ మీడియా... ఇలా అన్నింటికీ ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి వాటి మనుగడకు తోడ్పడటం, జర్నలిస్టులతో పాటూ మీడియా రంగంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న అర్హులైన వారందరికీ అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయడం, అన్ని రకాల జబ్బులకు అన్ని ప్రధాన కార్పొరేట్ హాస్పిటల్స్‌లో హెల్త్ కార్డులు పని చేసేటట్లు చర్యలు తీసుకోవడం,అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు యుద్ద ప్రాతిపదికన ఇవ్వడం, జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం, ఉద్యోగ విరమణ చేసిన పాత్రికేయులకు ప్రభుత్వ పరంగా తగిన పెన్షన్ ఇవ్వడం, అక్రిడేషన్ కలిగిన పాత్రికేయుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో ఫీజుల రాయితీ కల్పించడం, పాత్రికేయుల రక్షణకు ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకోవడం ముఖ్యం. దీనికై యుద్ద ప్రాతిపదికన ప్రభుత్వ పరంగా ఒక కమిటీ వేసి రాష్ట్రంలోని మీడియా సంస్థలలో పని చేస్తున్న సిబ్బందికి ఉద్యోగ రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెలుగులు నింపుతుందని ఆశిద్దాం.

కైలసాని శివప్రసాద్

సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్

94402 03999

Tags:    

Similar News