జనంలోకి జనసేనాని..లక్ష్యాలేంటి!?
Janasenani Chief Pawan Kalyan Gears Up With 'Varahi' Bus Yatra Ahead Of 2024 Assembly Polls
అభిమానులు, కార్యకర్తల ఎదురుచూపులు, రాజకీయ ప్రత్యర్థుల ఎత్తిపొడుపులకు ముగింపు పలుకుతూ జనసేనాని జూన్ 14 నుంచి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అది ఆయన ప్రస్తుతం కేవలం కొన్ని నియోజకవర్గాల్లోనే పర్యటిస్తున్నారు దానికి కారణం, జనసేన బలం బలగం అంతా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ఉంది. అందుకే అక్కడే ఉన్న సామాజిక వర్గాల మద్దతు కోసం అయా జిల్లాల్లో పర్యటనలకు ఎంచుకోవడం, ఒక కారణమైతే , 2019లో పోటీచేసిన జనసేన పార్టీకి అత్యధిక ఓట్లు కూడా గుంటూరు నుంచి విశాఖపట్నం మధ్య ఉన్న ఈ ప్రాంతంలోనే వచ్చాయి. అందుకే ఈ నియోజకవర్గాలను ఎంచుకోవడమనేది రెండో కారణం. ఈ పర్యటనలో భాగంగా, ప్రతి నియోజకవర్గంలో రెండ్రోజులు యాత్ర కొనసాగిస్తూ వృత్తిదారులు, రైతులు, కర్షకులు, కూలీలు, ఇలా వివిధ వర్గాల వారిని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారిని కలిసేలా ప్రణాళిక రచించడం, అక్కడ జనసేనకు మద్దతు కూడగట్టటం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేయడం తెలివైన ఎత్తుగడే అని చెప్పాలి.
ప్రణాళికలు వివరిస్తూ..
‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా’, ‘వైఎస్ఆర్‌సీపీ విముక్త పాలనే లక్ష్యం’ గా జనసేన పోరాటం చేస్తుందని, పొత్తులపై తన వైఖరిని, రాబోయే కాలంలో తన రాజకీయ లక్ష్యాన్ని వివరిస్తూ కార్యకర్తలను మానసికంగా ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు జనసేనాని. ఇదే విషయమై ఇప్పుడు ఆయన ప్రజలనూ ఒప్పించేలా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా జనసేన సిద్దాంతాలను, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తలపెట్టిన వారాహి యాత్ర జనసేనానికి అగ్నిపరీక్ష. జనసేన గెలిస్తే ప్రజలకేంచేస్తుంది, జనసేన అంటున్న కామన్ మినిమమ్ ప్రోగ్రాంతో రాష్ట్రానికి జరిగే మేలేంటి? అన్ని వర్గాలు మెచ్చేలా సామాజిక న్యాయం ఎలా చేస్తారు ఆన్న ఆంశాలపై ఈ యాత్రలో స్పష్టత ఇవ్వాల్సిన ఆంశాలు. ఈ అంశాలే యాత్ర విజయానికి కీలకం, జనసేన కూడా తన బలమేంటో గుర్తించి, తనకు పట్టున్న ప్రాంతంపైనే దృష్టి పెట్టడం ఆ పార్టీకి శుభ పరిణామమే. కానీ సున్నితమైన సామాజిక వర్గ సమీకరణాల అంశంలో జోక్యం చేసుకోవడం అంత సులభం కాదు. కాబట్టి ఐక్యత సాధించడానికి జనసేనాని పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు రాకపోతే, యాత్ర లక్ష్యం దారితప్పి గమ్యం చేరడం కష్టంగా మారొచ్చు. ఇక్కడ కేవలం మాట్లాడితే సరిపోదు. వారి మధ్య సఖ్యత తీసుకురావడానికి భరోసా ఇవ్వాలి. తమ పార్టీ అందరితో కలిసి ఉంటుందనే సామాజిక భావనను వారిలో పెంపొందించాలి. ఆయా వర్గాలకు తను ఏ విధంగా న్యాయం చేస్తారో వివరించాలి. ప్రభుత్వ వ్యతిరేకతపై విమర్శలు సంధించటానికి, అధికార వైఎస్ఆర్‌సీసీని తిట్టడానికే అయితే ఈ వారాహి యాత్ర వల్ల ఏ ఉపయోగమూ ఉండదు. ప్రజలను కష్టాల నుండి గట్టెక్కించడానికి జనసేన దగ్గర ఎలాంటి ప్రణాళికలున్నాయి? వాటిని ఎలా అమలు చేస్తారనేదే ఈ యాత్ర లక్ష్యం కావాలి. జనసేన చెప్పుకుంటున్నట్టుగా ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం ఈ మూడు నినాదాలను ఎలా జోడిస్తారు? ఎలా ఈ మూడు లక్ష్యాలను సమతుల్యంలో నెరవేరుస్తారో పవన్ తన యాత్రలో ప్రజలకు వివరించాలి.
అప్పుడే వారాహి యాత్ర విజయవంతం!
అలాగే టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోని సైతం మార్చగల శక్తి సామర్థ్యాలు తమ పొత్తుకు ఉంటుందని జనసేనాని ప్రజల్లో నమ్మకం కలిగించాలి. గజమాలలు, ఆధికార పక్షాన్ని, మంత్రులను లేదా ఆ పార్టీలో ఉన్న కీలక నేతలపైన వ్యక్తిగత విమర్శలు, చౌకబారు వ్యంగ్యాస్తాలు సంధించకుండా సమయం వృథా చేయకుండా సమయాన్ని స్థానిక సమస్యలు రాష్ట్ర సమస్యలపై, అధికార పార్టీ వైఫల్యాలపై మాట్లాడుతూ వాటికి పరిష్కారాలను సూచిస్తే మంచిది. అలాగే స్థానిక సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతామో అక్కడే వివరించాలి. దీనికోసం పవన్ కల్యాణ్ బృందం స్థానిక సమస్యలపై లోతుగా పరిశోధన చేసి సరైన పరిష్కారాలతో రోజువారీ నివేదికలు అందిస్తూ ఓటర్ల మనసు గెలుచుకోగలిగితే యాత్ర లక్ష్యం నెరవేరి ‘వారాహి’ విజయవంతం అవుతుంది. ఈ యాత్ర ద్వారా పవన్ కార్యకర్తలతో అనుబంధం పెంచుకోవాలి. తాను అందరివాడినని పవన్ ఈ యాత్ర ద్వారా తెలియజేయాలి. తాను తాత్కాలిక రాజకీయ నాయకుడిని కాదనే గట్టి సందేశాన్ని పవన్ ఈసారి అందిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనహితం కోసం జనసేన ఏం చేస్తుందో చాటి చెప్పాలి. ఈ యాత్ర జనహితార్థం జరిగితేనే ‘జనసేనాని యాత్రకు జనం వస్తారు కానీ, ఓట్లుపడవు’ అనే ముద్ర చెరిగిపోతుంది. అప్పుడే జనసేన కల నిజమవుతుంది ...ఈ యాత్ర జనహిత యాత్రగా మారుతుంది.
వాడవల్లి శ్రీధర్
99898 55445