సంస్మరణ:అణగారిన వర్గాల గొంతుక
ఒక సామాన్య పేద రైతు కుటుంబంలో జన్మించిన బాబూ జగ్జీవన్‌రామ్ అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక దళిత
జాతిపిత మహాత్మాగాంధీ అభిప్రాయాలతో జగ్జీవన్ రామ్ ఎక్కువగా ఏకీభవించేవారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాలలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలోనూ ముందున్నారు. సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు. బాబూజీ అని పిలిపించుకున్న ఆయన నడిచిన బాట, అనుసరించిన ఆదర్శాలు, చూపిన సంస్కరణ మార్గాలనూ గుర్తుచేసుకుంటూ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒక సామాన్య పేద రైతు కుటుంబంలో జన్మించిన బాబూ జగ్జీవన్‌రామ్ అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక దళిత చిహ్నం. బాబూజీగా ప్రసిద్ది చెందిన జగ్జీవన్‌రామ్ 1908 ఏప్రిల్ 5న జన్మించారు. ఆయన తండ్రి శోభీరామ్, తల్లి వసంతీదేవి. బిహార్‌లోని షాహాబాద్ (ఇప్పుడు భోజ్‌పూర్) జిల్లాలోని చంద్వా అనే చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. ఆయనకు అన్నయ్య సంత్‌లాల్‌తోపాటు ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు.
జగ్జీవన్‌రామ్ 1936-1986 మధ్య 50 సంవత్సరాలపాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా కొనసాగి ప్రపంచ రికార్డు సాధించారు. అత్యంత గౌరవనీయమైన దళిత నాయకులలో ఒకరుగా ప్రసిద్ధిగాంచారు. 1971 భారత-పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారత రక్షణ మంత్రిగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలోనూ జగ్జీవన్‌రామ్ ఉత్సాహంగా పాల్గొనేవారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు 1934లో ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్, అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేశారు.
దళితుల హక్కుల కోసం
1935 అక్టోబర్ 19న దళితులకు ఓటు హక్కు కోసం హమ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారు. బ్రిటిష్ అధికారులపై అసమ్మతి చర్యలతో 1940లో అరెస్ట్ అయ్యారు. రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిది. దళితుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు. 1946లో జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్‌లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చారు. 1940 నుంచి 1977 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అనుబంధ సభ్యునిగా, 1948 నుంచి 1977 వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రతినిధిగా కూడా పనిచేశారు. కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారు.
అనేక సంస్కరణలు
దేశంలో హరిత విప్లవం సక్సెస్ చేయడంలో జగ్జీవన్‌రామ్ కీలకపాత్ర పోషించారు. జనతా ప్రభుత్వంలో 1977 నుంచి 1979 వరకు ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ (ఇందిరా) పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1936 నుంచి 1986 వరకు ఐదు దశాబ్దాలకు పైగా చట్టసభ సభ్యుడిగా కొనసాగడం ప్రపంచ రికార్డు. స్వతంత్ర భారత దేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1952 నుంచి ఆయన చనిపోయే 1986 వరకూ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగానూ ఆయన రికార్డు సృష్టించారు. ఆయన కుమార్తె మీరా కుమార్ 2009-2014 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 1928లో మజ్దూర్ ర్యాలీలో జగ్జీవన్‌రామ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టిలో పడ్డారు.
దళిత హక్కుల కోసమే కాదు, మానవతా కార్యక్రమాలలోనూ ఆయన చురుకుగా పాల్గొనేవారు. తాను పాల్గొనడమే కాక అందరినీ చైతన్యపరిచేవారు.1934లో భారీ భూకంపానికి బిహార్ అతలాకుతలమైతే సామాజికంగా సేవలందించి ఆర్తులను ఆదుకున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ అభిప్రాయాలతో జగ్జీవన్ రామ్ ఎక్కువగా ఏకీభవించేవారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాలలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ ముందున్నారు. సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు. బాబూజీ అని పిలిపించుకున్న ఆయన నడిచిన బాట, అనుసరించిన ఆదర్శాలు, చూపిన సంస్కరణ మార్గాలనూ గుర్తుచేసుకుంటూ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జటావత్ హనుమ
గెస్ట్ లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్
ప్రభుత్వ డిగ్రీ&పీజీ కళాశాల–భూపాలపల్లి