అంబేద్కర్ విగ్రహం పేరుతో జగన్ రాజకీయం

Jagan doing politics in the name of Ambedkar statue!

Update: 2024-01-19 00:45 GMT

సంవత్సరాలపాటు రాత్రింబవళ్లు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డా. బీఆర్‌ అంబేద్కర్‌, అటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని నష్టాన్ని అయిదేళ్లలో జగన్‌రెడ్డి దళితులకు చేశారు. దళితవాడలను అన్ని విధాలా వివక్షకు గురిచేశారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఉన్న పథకాలను నిర్వీర్యం చేయడంతోపాటు 300 మందికి పైగా దళితులను హతమార్చి, ప్రశ్నించిన వారిపై వేలాది కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. వీటికి మసిపూసి మారేడుకాయ చేసేందుకే విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహం పేరుతో బొమ్మ రాజకీయం మొదలుపెట్టారు.

దళితులకు రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డికి అంబేద్కర్ పేరు ఉచ్చరించే నైతిక అర్హత లేదు. అంబేద్కర్‌ను ఆకాశానికి ఎత్తి దళితులను పాతాళానికి తొక్కడమే జగన్ రెడ్డి నైజం. ఐదేళ్ల ఆయన పాలనలో దళితులపై 11 వేలకు పైగా దాడులు జరిగాయి. దాదాపు 300 మంది దళితులను పొట్టన పెట్టుకున్నారు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం, హత్యకు గురైన దళితుల సంఖ్య 188. దళిత జనోద్ధారకుడిలా నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ఊదరగొట్టే జగన్ రెడ్డి పాలనలో వారానికి 4 గురు దళితులు హత్య, 6 గురిపై హత్యాయత్నాలు, రోజుకు ఇద్దరు దళితులపై దాడులు, వారానికి ముగ్గురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని జాతీయ సంస్థలు ఘోషిస్తున్నాయి.

అంబేద్కర్ విదేశీ విద్యా పథకం రద్దు

టీడీపీ హయాంలో 4 లక్షల మంది దళిత సోదరులకు ఉపాధి కల్పించిన ఎస్సీ కార్పొరేషన్‌ను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. దళిత బిడ్డలు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తీసుకొచ్చిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని నాలుగేళ్లపాటు అటకెక్కించి, దానికి అంబేద్కర్ పేరు తొలగించి.. జగన్ రెడ్డి విదేశీ విద్యగా మార్చి అంబేద్కర్‌ను అవమానపరిచారు. దళితులు ఆత్మగౌరవంతో బతికేందుకు తెలుగుదేశం ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం (ఎల్‌పీఎస్) తీసుకొస్తే జగన్ రెడ్డి దాన్ని రద్దు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయలేదు. దళిత బిడ్డలు సైతం కార్పొరేట్ విద్య అభ్యసించేందుకు చంద్రబాబు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసుకొస్తే జగన్ రెడ్డి దాన్ని రద్దు చేశారు. 7,748 మంది దళిత యువకులు ప్రయోజనం పొందిన ఇన్నోవా కార్ల పథకం రద్దు చేశారు.ఎస్సీ, ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి ‘పెళ్లికానుకగా రూ. లక్ష ఇస్తానని మ్యానిఫెస్టోలో చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదు. కోడికత్తి డ్రామాలో దళిత బిడ్డ శ్రీనివాస్‌ను, ఆయేషా మీరా కేసులో సత్యంబాబును ఏళ్ల తరబడి జైలుపాలు చేశారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీ మద్యం మృతుల్లో 12 మంది దళితులే. రూ.28 వేల కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. అది చాలదన్నట్లు 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు దోచుకునేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నారు. ఇందులో ఎక్కువ శాతం భూములు దళితులకు చెందినవే.

దళితులపై నిత్య దాడులు

జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడి జరగని రోజు లేదు. దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి, డోర్‌ డెలివరీ చేసి నేనే హత్య చేశానని ఒప్పుకున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును జగన్‌ తన పక్కన కూర్చోబెట్టుకుని సన్మానాలు చేయించి దళితులను అవమానించారు. సీఎం సొంత నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం, అంకాలమ్మ గూడూరులో దళితుడైన జంజాల కృష్ణయ్యను వైసీపీ నాయకుడు అతి కిరాతకంగా హత్య చేశారు. ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, రావివారిపాలెంలో దళిత స్త్రీ హనుమాయమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు. కడప పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డా. అచ్చెన్నను కులం పేరుతో వేధించి హతమార్చారు. దళితుడైన నెల్లూరు నారాయణపై దొంగతనం నిందవేసి స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. కావలిలో కరుణాకర్ అనే దళిత యువకుడిని వైసీపీ నేతలు వేధింపులతో గురిచేసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారు.

కరోనా కిట్లు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ రెక్కలు విరిచి నడిరోడ్డుపై అవమానించారు. మానసికంగా వేధించి చంపారు. లిక్కర్ రేట్లు ప్రశ్నించిన చిత్తూరు జిల్లా దళిత యువకుడు ఓం ప్రతాప్‌ను గుట్టుచప్పుడు కాకుండా హతమార్చారు. అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించినందుకు వరప్రసాద్‌కు గుండు గీయించారు. మాస్కు పెట్టుకోలేదని చీరాల థామస్ పేటకు చెందిన దళిత యువకుడు కిరణ్‌ను పోలీసులే కొట్టి చంపారు. మెజిస్ట్రేట్ రామకృష్ణపై ఆయన సోదరుడు రామచంద్రపై దాడి చేశారు. పులివెందులలో దళిత మహిళ నాగమ్మపై అత్యాచారం చేసి, హత్య చేశారు. అమరావతిలో దళిత రైతులపైన అట్రాసిటీ కేసులు పెట్టి 18 రోజులు జైలు పాలు చేశారు. విశాఖ జిల్లా పెందుర్తిలో దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌ను ఇనుప కడ్డీలతో కొట్టి శిరోముండనం చేశారు. కంచికచర్లలో శ్యాంకుమార్‌పై దాడి చేసి నోట్లో మూత్రం పోశారు.

విగ్రహ రాజకీయం ముసుగులో

అసాంఘిక శక్తులు, అధికార పార్టీ రౌడీ మూకలు దళితులపై దమనకాండ సాగిస్తున్నా పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఏపీ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్పష్టం చేసింది. 2019-22 మధ్య కాలంలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై 1,294 నేరాలు జరగ్గా...అందులో 834 (65%)లైంగిక దాడులే. 13 జిల్లాలకు సమదూరంలో ఉండి రాష్ట్రం నడిబొడ్డున ఉన్న ప్రజా రాజధాని అమరావతిలో 25 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన అంబేద్కర్‌ స్మృతివనాన్ని అర్థాంతరంగా నిలిపివేసి రాజకీయ ప్రయోజనాల కోసం హడావుడిగా విజయవాడలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జగన్‌రెడ్డి పెత్తందారీతనానికి నిదర్శనం. దళితుల్లో జగన్‌రెడ్డిపై పెరుగుతున్న వ్యతిరేకతను దారిమళ్ళించడానికే అంబేద్కర్‌ విగ్రహం పేరుతో మరో వంచనకు జగన్‌రెడ్డి కుట్ర పన్నారు. దళితుల హక్కుల కోసం, చట్టాల కోసం, నిధుల కోసం కలిసికట్టుగా పోరాడి జగన్‌రెడ్డికి బుద్ధి చెప్పాలి. జగన్ రెడ్డి పాపాలను క్షమించేందుకు దళితులు సిద్దంగా లేరు.

-నక్కా ఆనంద్‌బాబు

సాంఘిక సంక్షేమ శాఖ మాజీ మంత్రివర్యులు

Tags:    

Similar News