కేంద్రం అండతోనే.. బాబు అరెస్ట్!

Jagan arrested Chandrababu Naidu with the help of central government

Update: 2023-09-13 00:45 GMT

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, అంతే కాలం ప్రతిపక్షనాయకుడుగా, జాతీయ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకుడుగా, దేశ రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా, పేరున్న చంద్రబాబును కేంద్ర ప్రభుత్వ అండ లేకుండా అరెస్టు చెయ్యడం సాధ్యం కాదని ప్రజలు విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుని దెబ్బ తీసి జగన్‌కి మేలు చేయాలని నిర్ణయించినట్లు కనిపిస్తుంది. అందుకే చంద్రబాబును వేధిస్తూ అరెస్టు చేస్తే, ఖండించడానికి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నోరు రాలేదు. తెలంగాణ ప్రభుత్వం జగన్ చెల్లెలు షర్మిళను అరెస్టు చేస్తే ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోడీ,చంద్రబాబు అరెస్టయ్యి 48 గంటలు నిద్ర లేకుండా చేస్తే కనీసం ఫోన్ చేసి పరామర్శించలేదంటే చంద్రబాబు పట్ల ఎంత ద్వేషంతో వున్నారో అర్థం అవుతుంది.

రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు అయినా వుండాలి. లేకుంటే తమ కనుసన్నల్లో నడిచే, తమ అడుగులకు మడుగులోత్తే ప్రభుత్వాలు అయినా వుండాలి ఇది బీజేపీ లక్ష్యం. పైకి విమర్శించుకొన్నా ఆ రెండు పార్టీల దోస్తీ ప్రత్యక్షంగా కనిపిస్తూనే వున్నది. మేము జగన్‌కి మద్దతుగా లేము అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎన్ని పత్తిత్తు పలుకులు పలికినా, కేంద్ర ప్రభుత్వం ఎవరి పక్షమో వారి చర్యల ద్వారా అవగతం అవుతుంది. కేవలం బెయిల్‌పై వున్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తుంటే ఏ తప్పూ చేయని చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ప్రధాని మోడీ మాట్లాడరా? విద్వేషంతో వ్యవహరిస్తున్న మీకు స్వస్తి, అస్తి, విశ్వ ప్రార్థన శ్లోకం చెప్పే అర్హత ఉన్నదా?

రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పెట్టి..

రాష్ట్రంలో ప్రతిపక్షం మాట్లాడటమే మహా నేరంగా అక్రమ కేసులు బనాయించి వేధిస్తూ విమర్శకు కూడా స్థానం లేకుండా నియంతృత్వంతో ప్రభుత్వం వ్యవహరించడాన్ని కేంద్రప్రభుత్వం సమర్థిస్తుందా? ప్రభుత్వాన్ని విమర్శిస్తే సమాధానం చెప్పలేక సీఐడీ, ఏసీబీలను ప్రయోగిస్తుంది. అలాంటి జగన్ ప్రభుత్వానికి కేంద్రం మద్దతు ఇస్తుందా?

కర్నూలు జిల్లాలో ఒక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర సంస్థల భద్రత కలిగిన చంద్రబాబు నాయుడు పట్ల రాష్ట్ర పోలీసు విభాగాలు వ్యవహరించిన తీరు చూస్తే రాష్ట్రంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఉందా? అనిపిస్తుంది. దక్షిణాదిన అత్యంత ఆప్తమిత్రుడుగా జగన్ రెడ్డిని చూస్తున్నారు కమల నాధులు.. అందుకే వారు ఆడమన్నట్టు ఆడుతున్నారు జగన్. అందుకే రాష్ట్రంలో అరాచక పాలన చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, ప్రతిపక్షాలను అణచి వేస్తూ, నిర్భంధించడం వంటి చర్యలతో రాక్షస పాలన సాగించినా, ఆర్థిక అరాచకానికి పాల్పడి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా ఒక్క మాట అనడం లేదు కేంద్ర ప్రభుత్వం.

కేంద్రం, పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా, అదెంత వివాదస్పద అంశమైనా వైసీపీ ఎంపీలు జై కొట్టారు. వారి ప్రతి నిర్ణయాన్ని జగన్‌ ప్రభుత్వం తు.చ తప్పక అమలు చేస్తోంది. పైగా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినా, కేంద్రాన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా జగన్‌ సహకరిస్తున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తూ, ప్రజా ప్రయోజనాలకు హాని చేస్తూ,రాష్ట్ర హక్కులు హరించింది బీజేపీ. వారి అండ లేకుండా జగన్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా అంచుకు చేర్చినా, కేంద్రం కన్నెర్ర చేయకుండా అదనపు అప్పులు తెచ్చుకోవడానికి అనుమతులు ఇస్తున్నది.

తప్పు చేసిన వారిని వదిలేసి..

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కేవలం పక్కా రాజకీయ కక్ష సాధింపే అని ప్రతి ఒక్కరు అంటున్నారు. రెండేళ్ల క్రితం నమోదు అయిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల జాబితాలో చంద్రబాబు పేరేలేదు. రెండేళ్ల తర్వాత ఉన్నట్లుండి చంద్రబాబును కావాలనే అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కళ్ళలో ఆనందం చూడటం కోసమే సీఐడి వారు ఇంతటి పాప కార్యానికి ఒడిగట్టారు. చట్టానికి విధేయులుగా ఉండాల్సిన సీఐడీ పోలీసులు ఇలా చేయడం న్యాయమా? రూ.271 కోట్లతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు సీఎంగా ఉండగా ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అది. తదనుగుణంగా జీవోలు విడుదల చేశారు,నిధుల వ్యయం అధికారులది బాధ్యత. ఇది ఆ కార్పొరేషన్ ఫైల్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. చంద్రబాబు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి డబ్బులు రిలీజ్ చేయించడం సాధ్యమా? తప్పు చేసిన అధికారులను కాకుండా మాజీ సీఎంను అరెస్టు చెయ్యడం ఏమిటి? అధికారుల తప్పులను నాయకులకు ఎలా ఆపాదిస్తారు ప్రతి బ్యాంకు అకౌంట్లలో ఏం జరుగుతుందో సీఎంకి ఎలా తెలుస్తుంది? ఇందులో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ 2021 డిసెంబరులో కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు 36 మంది అధికారులను అరెస్టు చేసి వారిపై అభియోగాలు మోపారు. వీరిలో కొందరి రిమాండ్‌ రిపోర్టు తిరస్కరణకు గురైంది. కొందరు బెయిల్‌, మరికొందరు ముందస్తు బెయిల్‌ పొందారు. మొత్తానికి 36 మంది బయటనే ఉన్నారు. కానీ కేసు ఎలాంటి ట్రయల్‌ కాకుండానే, ఎలాంటి చార్జిషీట్‌ వేయకుండానే, సాక్ష్యాలు లేకుండానే. చంద్రబాబును అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు కాక మరేమిటి? దాదాపు రెండేళ్ల తర్వాత అది కూడా 36 మంది అధికారులు బయట ఉండగా ఎలాంటి పురోగతి లేని కేసులో ఎలాంటి సాక్ష్యాలు బయటపడని 36 మందిని వదిలేసి 37వ వ్యక్తిపై సాక్ష్యాలు లేకుండానే 37వ నిందితుడిగా చంద్రబాబును అరెస్టు చేయడం ఎంత దారుణం.

అధర్మానిదే పైచేయి అయినా..

జగన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు పైనే దృష్టి కేంద్రీకరించారు. నాలుగేళ్లుగా సీఐడీ అధికారులు ఏదో ఒక కేసు నమోదు చేయడం, దానిపై చంద్రబాబు కోర్టులను ఆశ్రయించవలసి రావడం జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. వాటి వల్ల అయాచితంగా లబ్ధి పొందిన వారు ఎవరో నిర్ధారించకుండా కేసులు పెట్టుకుంటూ పోతారా? ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్నపద్దతి వచ్చే ప్రభుత్వాలు పాటిస్తే భవిష్యత్తులో ఇలాంటి విపరిణామాలే చోటుచేసుకోవా? అధికార పార్టీ ఫిర్యాదు చేయడమే ఆలస్యం... విచారణ లేకుండా ప్రతిపక్షాన్ని వేధించడమే లక్ష్యంగా పని చేస్తుంది సీఐడి. వారు పెడుతున్న అక్రమ కేసుల్లో విచారణ చేయకుండా తప్పు చేయని వారిని బలిపశువులను చేస్తున్నారు. పరిపాలన చేతకాక, చంద్రబాబుకు జిల్లాల పర్యటనల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబుపై కక్ష సాధిస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. గెలుపు శాశ్వతం కాదు. ఓటమి అంతిమం కాదు. వైసీపీ నాయకులు అధికారం ఉందని మిడిసిపడుతున్నారు. మాకు ఎదురు లేదు, తిరుగులేదు అని విర్రవీగిన వారు కాలగర్భంలో కలిసిపోయిన వాస్తవాలు గుర్తించాలి. అధికారంలో వున్నాం ఏదైనా చేస్తాం, అన్న విధంగా వ్యవహరిస్తున్నారు జగన్ రెడ్డి. ధర్మం-అధర్మానికి మధ్య పోటీ జరిగితే మొదట అధర్మానిదే పై చేయి అయివుండవచ్చు కానీ అంతిమ విజయం ధర్మానిదే అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. తాత్కాలిక రిమాండ్ తో సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. మీరు వల్లించే పారదర్శకత, జవాబుదారిలకు విలువలేదు. మీ పాపాలు పక్వానికి వచ్చాయి.

నీరుకొండ ప్రసాద్

98496 25610

Tags:    

Similar News