పత్రికల గొంతు నులిమితే అన్యాయానికి పట్టాభిషేకం చేసినట్లే!

ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి సారథ్యంలో ప్రతి ఏటా మే 3వ తేదీన ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం’ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది

Update: 2023-05-02 18:45 GMT

ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి సారథ్యంలో ప్రతి ఏటా మే 3వ తేదీన ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం’ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. 1991లో యునెస్కో నిర్వహించిన పత్రికా స్వేచ్ఛ సమావేశంలో తీసుకున్న తీర్మానం ప్రకారం ఐరాస జనరల్‌ అసెంబ్లీ 1993లో మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం జరుపుకోవాలని నిర్ణయించారు. 30వ దినోత్సవాన్ని సభ్యదేశాలు 2023 మే 3న ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం-2023 నినాదంగా ‘భవిష్యత్తు హక్కుల రూపకల్పన ఇతర మానవ హక్కుల పరిరక్షణలో పత్రికా స్వేచ్ఛ‌’ అనే అంశాన్ని తీసుకున్నారు. పత్రికలు ప్రజా గొంతుకలుగా ఎనలేని సేవలను అందిస్తున్నాయి.

ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధి

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా పత్రికలు నిలుస్తున్నాయి. ప్రభుత్వ పథకాల విశ్లేషణలు విమర్శలు, అనుకూల ప్రతికూలతలు, అవినీతిపరుల స్క్యామ్‌ బండారాల్ని బయట పెట్టడం, మానవ హక్కుల పరిరక్షణ సేవలు, విజ్ఞాన వినోదక్రీడ, రాజకీయ సమాచార వితరణలు, ప్రజా సమస్యలకు గళం కలపడం లాంటి అంశాల్లో పత్రికలు అద్వితీయ సేవలు అనుదినం అందిస్తున్నాయి. కరోనా పలు వేవ్‌ల విజృంభణ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో జీవన చక్రం సజావుగా సాగేలా చూడడం, ప్రజలకు నిరంతరం అత్యవసర సేవలను అందించడం లాంటి సేవలను పత్రికలు బాధ్యతగా అందించడం చూసాం.

ప్రాణాంతకంగా విలేకరుల విధి నిర్వహణ

పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన మౌళిక సూత్రాలు, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ చర్యలు, పత్రికల స్వతంత్రతను కాపాడటం, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన జర్నలిస్టులకు నివాళులు అర్పించడం లాంటి చర్యలను ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం వేదికలను వాడుకుంటారు. ‘కరోనా మహమ్మారి’‌ సంక్షోభంలో ‘ఇన్ఫో-డెమిక్‌’ తరహాలో పత్రికలు ప్రజలను చైతన్య పరచడం, కరోనా క్రమశిక్షణలను వివరించడం జరిగింది. జర్నలిస్టుల విధి నిర్వహణ పలు సందర్భాల్లో ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా కూడా మారిన ఉదాహరణలు ఎన్నో చూశాం. ప్రపంచవ్యాప్తంగా అధిక దేశాల్లో పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతున్నట్లు తేలింది.

పత్రికల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికే విరుద్ధం

ప్రస్తుత ప్రభుత్వాలు పత్రికా వ్యతిరేక విధానాలతో కొందరిని జాతి-వ్యతిరేక జర్నలిస్టులుగా ముద్ర వేసి బెదిరింపులు, పత్రికల గొంతులను నొక్కడం, పత్రికారంగంపై ఆధిపత్య ధోరణి పెరిగాయనే వార్తలు వింటున్నాం. ప్రభుత్వ ధోరణిని విమర్శించే పత్రికా యాజమాన్యాలు, విలేకరులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టుల విధులకు ఆటంకంగా నిలుస్తూ, ప్రభుత్వంపై విమర్శనాత్మక వ్యాసాలను రచించే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నాయని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. పత్రికా విలేకరుల కదలికలపై నిఘా పెట్టడం, పోలీసుల బెదిరింపులు, రాజకీయ నాయకులు నిఘా పెట్టడం, హింసా ప్రవృత్తిని కనబర్చడం, నేర గ్రూపుల హింసలు, అవినీతి అధికారులు రాజకీయ నాయకుల బెదిరింపులు పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నాయని తెలిపింది. హిందుత్వ భావనలతో పత్రికా స్వేచ్ఛకు అడ్డుతగులుతూ, కొందరు విలేకరుల ప్రాణాలు తీసే స్థాయికి హింసా ధోరణి పెరిగిందని నివేదికలు వివరిస్తున్నాయి. కరోనా నిబంధనల పేరుతో గత సంవత్సర కాలంగా పత్రిక విలేకరులపై దాడులు పెరిగాయి. కాశ్మీర్‌లో పోలీసులు, మిలిటరీ, పారామిలటరీ దాడులతో పత్రికా స్వేచ్ఛ పతన స్థాయిలోకి పడిపోయిందని వింటున్నాం.

((ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక-2022లో ఉన్న 180 దేశాల్లోని కొన్ని దేశాలు మాత్రమే పత్రికా స్వేచ్ఛను పూర్తిగా అనుభవిస్తున్నాయని నివేదిక తెలియజేసింది. సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం అధిక దేశాల్లో పత్రికల గొంతు పూర్తిగా నొక్కడం జరుగుతోందని, భారత్‌ లాంటి పలు దేశాల్లో పాక్షికంగా విఘాతం కలుగుతోందని వర్గీకరించింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో 1వ స్థానంలో నార్వే, 2వ స్థానంలో డెన్మార్క్‌‌, 3వ స్థానంలో స్వీడెన్‌, 4వ స్థానంలో ఎస్టోనియా, 5వ స్థానంలో ఫిన్‌లాండ్‌, 6వ స్థానంలో ఐర్లాండ్‌, 7వ స్థానంలో పోర్చుగల్‌, 8వ స్థానంలో కోస్టా రికా దేశాలు సగర్వంగా నిలిచాయి. భారతదేశం 150వ స్థానంలో నిలువగా పొరుగు దేశాలు నేపాల్‌ 76వ స్థానం, శ్రీలంక 146, మియాన్మార్‌ 176, పాకిస్థాన్ 157, బంగ్లాదేశ్‌ 162వ స్థానాల్లో ఉంటున్నాయి.))

పత్రికా స్వేచ్ఛతో అవినీతి అదుపు

పత్రికా స్వేచ్ఛకు విలువ ఉన్నపుడే ప్రభుత్వ పథకాల్లోనే కాకుండా ఇతర వ్యవస్థలో జరుగుతున్న లోపాలు బయట పడతాయని గమనించాలి. పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టిన దేశాల్లో అవినీతి అంతం కావడం, సుపరిపాలన సాధ్యపడడం, ప్రజానీకానికి మేలు జరగడం లాంటి ప్రయోజనాలు కలుగుతాయని గుర్తుంచుకోవాలి. పత్రికల గొంతును నులిమితే అన్యాయానికి పట్టాభిషేకం చేసినట్లే అని గమనించాలి. పత్రికలే ప్రజల గొంతులు, సమాచార మాధ్యమాలే అన్యాయాన్ని అంతమొందించే సంకేతాలని అందరం నమ్ముదాం. పత్రికా స్వేచ్ఛను పెంచి పోషిద్దాం.

(నేడు ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం’ సందర్భంగా)

డా బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037




Tags:    

Similar News