ఇదేనా దేశంలో నెంబర్-1 కమిషన్!
ఇదేనా దేశంలో నెంబర్-1 కమిషన్!... is tspsc number-1 commission in the country
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు సాధించి, తమ కలలను సాకారం చేసుకోవాలనుకున్న నిరుద్యోగుల ఆశలు ఆవిరైపోయాయి. నాడు స్వరాష్ట్ర సాధన కోసం అగ్రభాగాన ఉండి పోరాడిన నిరుద్యోగులు, విద్యార్థులు నేడు తెలంగాణ రాష్ట్రంలో కూడా పోరాడుతున్నారు. రాష్ట్రం సాకారమైతే మా నీళ్లు, నిధులు, నియామకాలు మాకే అంటూ కేంద్రంతో ఆత్మహత్యల యుద్ధం చేసిన యువత, నేడు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేస్తారో లేదో అనే ఆందోళనలో ఉన్నారు. అసలు ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలను ప్రధాన ఎజెండాగా చేసిన విద్యార్థులు ఎంతలా అంటే ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తే తెలంగాణ వచ్చినంక రాసి మేము ఉద్యోగాలు చేస్తామని వాటిని బహిష్కరించేంతగా అంతలా విద్యార్థులు నియామకాలను ఉద్యమ ఎజెండా చేశారు.
రాష్ట్రం సాధించాక ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న విద్యార్ధులకు కనీస ప్రణాళిక లేకుండా టీఎస్‌పీఎస్సీ ఉంది. గ్రూప్స్ స్థాయి పోస్టుల భర్తీ లేదు. ఇచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎక్కింది. మొత్తం ఎనిమిదేండ్లలో ఇప్పటి వరకు 165 నోటిఫికేషన్లు విడుదల చేస్తే అందులో టీఎస్‌పీఎస్సీ ద్వారా 145 విడుదల చేశారు. వాటిలో 109 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్స్, 46 డిపార్ట్‌మెంటల్ రిక్రూట్మెంట్స్ ఇందులో కేవలం 79 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. ఇప్పటివరకు స్వరాష్ట్రంలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు విడుదల చేసిన లీక్ కారణంగా రద్దయింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు గ్రూప్స్ పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సర్వీస్ కమిషన్‌ని దేశంలో ఎక్కడలేని విధంగా తీర్చిదిద్దుతామనీ, యూపీఎస్‌సీ మాదిరి క్యాలెండర్ ఇయర్ అమలు చేస్తామనీ పలికిన ప్రగల్బాలు నీటి మూటలే అయ్యాయి. కనీసం ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేని స్థితిలో సర్వీస్ కమిషన్ ఉంది.
నమ్మకద్రోహం జరిగింది ఎవరికి?
పోటీ పరీక్షల నిర్వహణలో అతి ముఖ్యమైనది పేపర్ తయారీ, ప్రింటింగ్, భద్రపరచడం. సాధారణంగా పాఠశాల స్థాయిలో జరిగే పరీక్షలు, ఎంట్రన్స్ పరీక్షలకే అత్యంత పకడ్బందీగా పరీక్షల నిర్వహణ ఉంటుంది. కానీ రాష్ట్ర స్థాయిలో అత్యంత ముఖ్యమైన పరీక్షల నిర్వహణలో ఈ కమిషనర్ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎవరికి తెలియపర్చకూడని కాన్ఫడెన్సీయల్ విభాగం పనులు సాధారణ సెక్షన్ ఆఫీసర్‌గా బాధ్యతలు చూసే వ్యక్తికి పరీక్ష పేపర్లు ఏ ఫొల్డర్‌లో ఉంటాయో తెలిసి దొంగలించేంత నిర్లక్ష్యంగా కమిషన్ ఉందంటే వారికి ఈ రాష్ట్ర నిరుద్యోగుల పట్ల, ఉద్యోగాల భర్తీ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి పరీక్ష ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్‌లో జరిగితే కమిషన్ చైర్మన్ 3 పేపర్ల సెట్ నుండి 2 సెలెక్ట్ చేసి వాటిని సీల్డ్ కవర్‌లో ఉంచి కేంద్ర ప్రభుత్వ ఆథరైజ్డ్ ప్రింటింగ్ కేంద్రంలో ప్రింట్ చేసి అక్కడి నుంచి పరీక్ష ముందు రోజు జిల్లా కార్యాలయాలకు పంపాలి. అదే ఆన్‌లైన్ అయితే ఇతర రాష్ట్ర పేపర్ సెట్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించుకొని చైర్మన్ తన అధీనంలో ఉండే ల్యాప్ ట్యాప్, లేదా కంప్యూటర్లోకి పాస్‌వర్డ్స్ పెట్టుకుని తన దగ్గరే భద్రంగా ఉంచుకోని పరీక్ష రోజు మాత్రమే ఓపెన్ చేయాలి. ఇన్ని పద్ధతులు పాటించాల్సిన దగ్గర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పనిచేస్తున్న చిన్నస్థాయి ఉద్యోగికి ఎలా పాస్వర్డ్ తెలిసింది? అతను కంప్యూటర్లో నుండి పేపర్ ఎత్తుకెళ్ళినా గమనించలేని స్థితిలో కమిషన్ ఉందా? ఎంసెట్ లాంటి పేపర్లను తయారు చేసే వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఎంసెట్ రాస్తుంటే వారిని పేపర్ తయారీకి అనుమతివ్వరు. అలాంటిది టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ఉద్యోగికి పరీక్ష రాయడానికి ఎవరు అనుమతిచ్చారు? ఇస్తే ఎన్‌ఓసి ఎవరు ఇచ్చారు? అసలు డ్యూటీ చేస్తూ 103 మార్కులు ఎలా సాధించాడు? దీనిపై ప్రభుత్వం స్పందించదు. ఎవరు సమాధానం చెప్పరు. బాధ్యత లేని చైర్మన్ ప్రెస్‌మీట్‌లో నమ్మక ద్రోహం జరిగింది అంటారు కానీ అసలు నమ్మకద్రోహం జరిగింది తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకే కానీ, అధికారులకు కాదు. అందుకే ఈ లీకేజీలకు చైర్మన్ బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలి.
నమ్మకం కోల్పోయిన విద్యార్థులు..
నేడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త పర్సనల్ సర్వీస్ కమిషన్‌గా మారింది. ఉద్యోగాలు భారీగా భర్తీ చేస్తాం అని ప్రకటించిన ప్రభుత్వం అసలు ఉద్యోగాలు భర్తీ చేసే కమిషన్‌లో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. కమిషన్‌లో 450 శాంక్షన్డ్ పోస్టులు ఉండాల్సింది. కానీ 125 పోస్టులు ఉన్నాయి. అందులో 82 మంది రెగ్యులర్ ఉద్యోగులు. 20 మంది మాత్రమే ఆఫీసర్ స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం 83,000 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇక్కడ ఉన్న ఉద్యోగులు న్యాయ, ఇతర పనులు చూసుకోవడానికే సమయం సరిపోతే పరీక్షలు పారదర్శకంగా జరగడానికి అవకాశం ఎలా ఉంటుంది. దేశంలోనే నెం 1 సర్వీస్ కమిషన్ అయితే మరీ దీనిపై దృష్టి ఏది?
రాష్ట్రంలో పేపర్ లీకేజీ ఘటన ఇదే మొదటిది కాదు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ఉద్యోగాల భర్తీలో వివాదాలు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. ఇప్పటికే సింగరేణి పోస్టుల భర్తీ విషయంలో పోస్టులు అమ్ముకున్నారని వాదనలు ఉన్నాయి. అలాగే జూనియర్ లైన్‌మెన్ పరీక్షలో అవకతవకలు జరిగి పరీక్ష రద్దైంది. అలాగే కొన్ని సంవత్సరాల ముందు ఇంటర్ విద్యార్థుల రిజల్ట్స్ వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇప్పుడు ఏకంగా ఈ పేపర్లు లీక్ కావడంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఏండ్ల తరబడి నగరానికి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతూ లైబ్రరీలో, కోచింగ్ సెంటర్లలో కష్టపడి చదువుతూ లక్షల రూపాయాలు ఖర్చు పెట్టారు. అయితే వీరి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సింది పోయి నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు టిఎస్‌పిఎస్సీపై నిరుద్యోగులు, విద్యార్ధులు నమ్మకం కోల్పోయారు. తక్షణమే ప్రభుత్వం సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి తో విచారణ జరిపి ఎవరి హస్తం ఉన్నా కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలోని విద్యార్థులు గందరగోళ పడకుండా తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. ప్రస్తుతం ఉన్న కమిషన్ చేత రాజీనామా చేయించి కొత్త వారిని నియమించాలి. అప్పుడే విద్యార్ధులలో నమ్మకం కలుగుతుంది. ఇప్పటి వరకు శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ అత్యంత పారదర్శకంగా నిర్వహించినప్పుడే ఈ రాష్ట్రం ఏర్పడినందుకు సార్థకత ఉంటుంది.
టి.నాగరాజు
ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.
94900 98292