మంత్రిమండలి కూర్పులో...సామాజిక న్యాయం ఉందా?!

కేంద్ర మంత్రిమండలి కూర్పులో గానీ, శాఖల కేటాయింపులో గానీ సామాజిక న్యాయాన్ని పూర్తిగా ఉల్లంఘించారని చెప్పవచ్చు. 71 మందితో

Update: 2024-06-29 01:15 GMT

కేంద్ర మంత్రిమండలి కూర్పులో గానీ, శాఖల కేటాయింపులో గానీ సామాజిక న్యాయాన్ని పూర్తిగా ఉల్లంఘించారని చెప్పవచ్చు. 71 మందితో ఏర్పర్చిన తాజా కేబినెట్‌లో 20 కోట్లమందికి ప్రాతినిధ్యం వహించే ముస్లింలలో ఒక్కరికీ మంత్రి పదవి దక్కలేదు. కేవలం హిందూ భావజాలం ఉన్న వాళ్లకీ, కార్పొరేట్‌ అధినేతలుగా ఉన్న వారికీ క్యాబినెట్‌లో అత్యున్నత పదవులు ఇవ్వటం ఆశ్చర్యకర విషయం.

మోడీ కేబినెట్‌లో ఏడుగురు మహిళలకు, ఏడుగురు ఎస్సీలకు, ముగ్గురు ఎస్టీలకు మాత్రమే అవకాశం కల్పించారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలకు మంత్రిమండలి శాఖలో ప్రాధాన్యత దక్కలేదు. అంటే కేబినెట్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం మొదటి దశలోనే కనబడటం లేదని చెప్పవచ్చు. మొత్తం 71 మందిలో ఒక కమ్మ, ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారంటే జాతీయ స్థాయిలో వారి స్థానాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కేవలం రాష్ట్రాలకే పరిమితమైన నాయకులు జాతీయస్థాయిలో ఏమీ ప్రభావం చూపలేదని అర్థం చేసుకోవాల్సి ఉంది. కేబినెట్‌ శాఖల కేటాయింపులు చూశాక, కార్పొరేట్‌ దిగ్గజాల నేపథ్యం చూశాక, ప్రజల్లో అనేక సందేహాలకు తావు ఏర్పడింది.

ముస్లింలపై ద్వేషం లేదంటూనే..

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పర్చిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ మంత్రిమండలిలో 71 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 71 మందిలో 30 మందికి కేబినెట్‌ హోదా ఇచ్చారు. ఐదుగురికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. 36 మందికి సహాయ మంత్రి హోదా ఇచ్చారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన జాబితాలో ఎక్కువమంది ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులే ఉన్నారు. రాజనాథ్ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గట్కారి, జే.పీ. నడ్డా , శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌, నిర్మలా సీతారామన్‌, జయశంకర్‌, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, వీళ్లందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ నుండి వచ్చిన వాళ్లే. పైగా ఏబీవీపీ కేడర్‌ ఎక్కువమంది ఉన్నారు. నరేంద్ర మోడీ తన పాత టీంకి బలమైన శాఖలు ఇచ్చారు. నిజానికి ఎన్నికలకు ముందు ముస్లింలపై నాకు ఎటువంటి ద్వేషం లేదని మోడీ చెప్పారు. దగ్గర దగ్గర భారతదేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర గణనీయమైనది. ముస్లింలు భారత టెక్నాలజీ రంగంలో ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి వారికి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇకపోతే రెండు సభల్లో సభ్యత్వం లేకపోయినా పంజాబ్‌కు చెందిన రణవీర్‌సింగ్‌ బిట్టూకు, కేరళకు చెందిన జార్జి కురియన్‌లకు మంత్రి పదవులు ఇచ్చారు. దీనిని బట్టి బీజేపీకి ముస్లింల పట్ల వ్యతిరేకత పోలేదని అర్థమవుతుంది.

తెలుగు మంత్రులకు తక్కువ ప్రాధాన్యత

ఇకపోతే దళితులకు మంత్రి పదవులు తక్కువ సంఖ్యలో ఇచ్చారు. సరైన ప్రాధాన్యత కలిగిన పదవులు కూడా ఏవి ఇవ్వలేదు. రాజ్‌నాథ్‌ సింగ్‌కు రక్షణ శాఖ, అమిత్‌ షాకు హోంశాఖ, నితిన్‌ గడ్కరీకి రోడ్లు, జాతీయ రహదారుల శాఖ, జగత్‌ ప్రకాష్‌ నడ్డాకు ఆరోగ్య, సంక్షేమ శాఖ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు వ్యవసాయ శాఖ, నిర్మల సీతారామన్‌కు ఆర్థిక, కార్పొరేట్‌ శాఖ, సుబ్రమణ్యం జయశంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖ, మనోహర్‌లాల్‌కు గృహ నిర్మాణం, పట్టణ అభివృద్ధి శాఖ, హెచ్‌డి కుమార్‌ స్వామికి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ, పీయూష్‌ గోయల్‌కు వాణిజ్యం, పరిశ్రమల శాఖ... ఇలా ముఖ్యమైన శాఖలన్నీ ఎక్కువ బీజేపీకే, అదీ హిందుత్వ భావజాలం ఉన్నవారికే ఎక్కువగా కేటాయించారు. ఇందులో దళిత మైనార్టీలు లేరు.

దక్షిణాదికి షరా మామూలే

ఇక ఆంధ్రప్రదేశ్‌ నుండి వెళ్లిన తెలుగు వాళ్లకు రామ్మోహన్‌ నాయుడుకి పౌర విమానయాన శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్‌ సహాయ మంత్రి పదవిని ఇచ్చారు. భూపతి రాజు శ్రీనివాస్‌ వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు సహాయ మంత్రి పదవిని ఇచ్చారు. తెలంగాణ నుంచి జి. కిషన్‌ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్‌ కుమార్‌కు హోం శాఖ సహాయ మంత్రి పదవిని ఇచ్చారు. ఒక్క కిషన్‌ రెడ్డికి బొగ్గు గనుల క్యాబినెట్‌ శాఖ తప్ప మిగిలినవన్నీ అంత బలమైన శాఖలు కాదు. నిజానికి కేంద్ర కెబినేట్‌ కూర్పులో దక్షిణాదికి కూడా అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. కర్ణాటక నుండి హెచ్‌‌డి కుమారస్వామి (జెడియస్‌)కి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ ఇచ్చారు. ఇది ఒక్కటి తప్ప దక్షిణ భారతానికి ప్రాధాన్యమే దక్కలేదు.

కేబినెట్ కూర్పుపై సందేహాలు

భారత రాజ్యాంగాన్ని అనుసరించి దళిత బహుజన మైనార్టీలకు తప్పకుండా ఉన్నతమైన ఆర్థిక, హోం, రక్షణ, న్యాయ, పరిశ్రమల శాఖల్లో ఒక దాన్ని ఇవ్వవలసి ఉంది. ఎన్డీయే తొలి హయాంలో బీజేపీ మేధావులను కూడా తీసుకుని ప్రధానమైన పోర్ట్‌ ఫోలియోలను ఇచ్చింది. దానిలో సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జెట్లీ, జశ్వంత్‌ సింగ్‌ వంటి వారు ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అయితే డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ మొదటి న్యాయమంత్రి గానూ, బాబు జగజీవన్‌ రామ్‌ ఆ తర్వాత కాలంలో హోమ్‌ మినిస్టర్‌గా, రక్షణ మంత్రిగా కూడా చేశారు. కానీ ప్రస్తుత కేంద్ర కేబినెట్‌లో కేవలం హిందూ భావజాలం ఉన్న వాళ్లకి కార్పొరేట్‌ అధినేతలుగా ఉన్న వారికి కేబినెట్‌లో అత్యున్నత పదవులు ఇవ్వటం ఆశ్చర్యకర విషయం. నిజానికి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీకి తగినన్ని సీట్లు రాకపోయినా, ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలకు మంత్రిమండలి శాఖలో ప్రాధాన్యత దక్కలేదు. అంటే దీనికి అంతర్గత ప్రజాస్వామ్యం మొదటి దశలోనే కనబడటం లేదని చెప్పవచ్చు. కులాధిపత్యాన్ని, వర్గాధిపత్యాన్ని, ధనాధిపత్యాన్ని కొనసాగిస్తారా? లేక పేదరిక నిర్మూలనకు ఏమైనా కృషి చేస్తారా అనేది ఈ కేబినెట్‌ శాఖల కేటాయింపులు చూశాక, కార్పొరేట్‌ దిగ్గజాల నేపథ్యం చూశాక, ప్రజల్లో అనేక సందేహాలకు తావు ఏర్పడింది. యువశక్తికి ఉపాధి కల్పించి దేశ సంపదను మరింతగా పెంచి ఆర్థిక అసమానతలు తొలగిస్తూ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ నిర్మించిన భారత రాజ్యాంగ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం నడవాలని ఆశిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, సామ్యవాదులు, హేతువాదులు, అందరూ మాట్లాడే హక్కు కోసం, ప్రశ్నించే హక్కు కోసం, రాజ్యాంగంలోని సౌభ్రాతృత్వం కోసం తపన చెందుతున్నారు. ఆ దిశగా పాలన సాగాలని ఆశిద్దాం.

- డా. కత్తి పద్మారావు

98497 41695

Tags:    

Similar News