రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా?

Is there rule of law in andhra pradesh state

Update: 2023-10-27 02:00 GMT

ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకోవాలని, ప్రజల అభిమతాలు గౌరవించాలని, ప్రజల మన్ననల కోసం తపించాలని నీతి గ్రంధాలు చెబుతున్నాయి. కానీ అధికారం కోసం అతి వినయాన్ని ప్రదర్శించి, ప్రజలను నమ్మించి అధికార పీఠం ఎక్కి దూర్తులుగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి వారికి అధికారం ఇవ్వడంతో సమాజం ఎన్నో అగచాట్లు పడుతుంది. జగన్ ఉన్మాదానికి, ఫాసిజానికి అధికారం తోడై ప్రజాస్వామ్యం నిర్బంధాల కింద నలిగిపోతున్నది. ప్రభుత్వం మాదే, వ్యవస్థలు మావే, మేము చెప్పిందే న్యాయం, మేము చేసిందే చట్టం, మేము చేసేదే పరిపాలన అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. తమ ప్రభుత్వానికి ఎదురు ఉండకూడదని, వారికి వ్యతిరేకంగా ఎవరూ నోరు తెరవద్దని, వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చెయ్యకూడదని, తమకు అందరూ భయపడాలని నిరంకుశంతో, నిర్బంధాలతో పాలన సాగిస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించే, విమర్శించే హక్కు ప్రజలకు, రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించింది. కానీ జగన్ ప్రభుత్వం ప్రశ్నిస్తూ, విమర్శిస్తున్న వారి నోళ్లను పెద్ద దబ్బళంతో కుట్టేసి రాజ్యమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని ప్రచారం చేసుకోవాలని చూస్తున్నది.

నాలుగున్నరేళ్లుగా నిర్బంధాలు

శాంతియుత ప్రదర్శనలు, నిరసనలు జరిపే ప్రాథమిక హక్కు రాజకీయ పార్టీలకు, ప్రజలకు వుంది. హింసకు తావు లేకుండా వారి హక్కును వినియోగించుకునేలా పోలీసులు తోడ్పాటు అందించాల్సి ఉంది. శాంతియుత ప్రదర్శనలు అడ్డుకోవడం, అక్రమంగా గృహనిర్భంధం చేయడం అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం. కానీ అధికార పార్టీ చెప్పిందని పోలీసులు ప్రతిపక్షాలను గృహనిర్బంధం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో నిర్భంధం,అణచివేతలు, వేధింపులు,రౌడీయిజం తారాస్థాయికి చేరింది. ప్రజా ఉద్యమాలపై లెక్కలేనన్ని కేసులు బనాయిస్తూ, హక్కులను కాలరాస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా శాంతియుత ప్రదర్శనలకు సభలకు అనుమతులు నిరాకరించడం, ముందస్తు అరెస్టులు చేయడం, గృహనిర్బంధాలు వంటి నిరంకుశ చర్యలతో పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు కనీసం బాధితులను పరామర్శకు కూడా వెళ్లకుండా నిర్బంధిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శాంతియుతంగా అయిదు నిమిషాల కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా లేక జగన్ స్వామ్యమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఈ ప్రభుత్వంలో రోడ్డు ఎక్కితే అరెస్టు, గడప దాటితే అరెస్టు, గుడికి వెళితే అరెస్టు, పరామర్శకు వెళితే అరెస్ట్! ఇలా కర్కశ నిర్బంధాల కింద నలిగి పోతున్నారు ఆంధ్రులు. శాంతియుత నిరసనలు, ర్యాలీలు చేసుకోవడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు, కానీ ఆ హక్కును వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా నెలల తరబడి ఆంక్షలు అమలవుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం నిర్బంధాలతో నలిగిపోతున్నది.

మీ చర్యల్లో.. ప్రజాహితమేది?

40 రోజులుగా చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఏ రూపంలో నిరసన వ్యక్తం చేయాలనుకున్నా పోలీసులు అందుకు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకొంటున్నారు అంటే 30 పోలీస్‌ యాక్ట్‌, 144 సెక్షన్‌ అమలులో ఉన్నాయని బెదిరిస్తున్నారు. ర్యాలీల్లో పాల్గొంటున్న నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టినా, భక్తులు గుడిలో పూజలు చేసినా, ఆఖరికి చంద్రబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లినా, 144 సెక్షన్‌ పేరుతో అడ్డుకుంటున్నారు. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిరసన తెలిపే హక్కు ప్రజలకు రాజ్యాంగం కల్పించింది. అదే సమయంలో శాంతి భద్రతల నిర్వహణ కోసం కొన్ని సహేతుకమైన ఆంక్షలు విధించే అధికారం కూడా పోలీసులకు ఉంటుంది. నిరసనలు హింసాత్మకంగా మారే అవకాశం ఉన్నప్పుడు అక్కడి సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి డీఎస్పీ సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తారు. ప్రజలు కర్రలు, రాళ్లు చేతబట్టుకుని రోడ్డెక్కే అవకాశం ఉంటే 144 సెక్షన్‌ అమల్లోకి తీసుకొచ్చి శాంతి భద్రతలను కాపాడతారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరిస్తారు.కానీ శాంతియుత నిరసనలకు 30 పోలీస్‌ యాక్ట్‌, 144 సెక్షన్‌ అమలు చేయరు.

రాష్ట్రంలో వినాశకరమైన, విచారకరమైన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రశ్నిస్తే సంకెళ్లు, ఎదురు తిరిగితే జైళ్లు అన్న విధంగా పౌరహక్కులను ఉక్కు పాదంతో అణచివేస్తున్నారు. ప్రజల, ప్రతిపక్షాల హక్కులు, స్వేచ్ఛను కాపాడడానికే పోలీసులు వున్నారని హైకోర్టు చేసిన హెచ్చరికలను దులపరించుకుని అదే పంధాలో వ్యవహరించడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా అధికార పార్టీనాయకుల ఆదేశాలు పాటిస్తూ హత్యలు, అరాచకానికి, నేరస్తులకు వంతపాడుతూ పోలీసులు బాధితులను బెదిరించారు. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనే పరిస్థితులు లేవు. జనహితం కోసం పనిచేయాల్సిన పోలీసులు పాలకుల హితం కోసం పనిచేస్తున్నారు.

హైకోర్టు చీవాట్లూ పట్టించుకోరా?

సమతూకాన్నిపాటించే క్రమంలో పోలీస్ వ్యవస్థ తన ఔన్నత్యాన్ని, స్వయం ప్రతిపత్తిని, విశ్వసనీయతను కాపాడుకోవడం అత్యవసరం. అణచివేత, అక్రమ కేసులకు సంబంధించి హైకోర్టు ఏపీ పోలీసుల విధానం ఎమెర్జెన్సీని తలపిస్తోందని, బీహార్ కన్నా అక్రమ నిర్భంద కేసులు ఏపీలోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయని, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతుందా అని, పోలీసులు చట్ట నిబంధనలు ఏ మాత్రం పాటించడంలేదని ధర్మాసనం పదేపదే చీవాట్లు పెట్టినా పోలీసుల వైఖరిలో మార్పు రావడం లేదు. వ్యక్తుల నిర్భంధం విషయంలో పోలీసుల తీరు సిగ్గు చేటని, ఇది రాష్ట్రానికి తలవంపులు అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. దేనికైనా ఒక హద్దు ఉంటుందని, దానిని ఎవరు అతిక్రమించరాదని స్పష్టం చేసింది. నా ప్రభుత్వం, నా ఇష్టం అన్న విధంగా పాలకులు వ్యవహరిస్తుంటే ప్రజలు, ప్రతిపక్షం మాత్రం చట్టాలను ఎందుకు గౌరవించాలి? పాలకుల తప్పులను, అసమర్థతను, వైఫల్యాలను, జరుగుతున్న నేరాలను, ఘోరాలను ప్రతిపక్షం ప్రశ్నించడం నేరమా? ఆందోళనలు చేయకూడదా.. విభిన్న అభిప్రాయాలు చెప్పడానికి, ప్రభుత్వ ఉత్తర్వులను, నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ప్రతిపక్షానికి లేదా?

పాలకులకు విధేయత ప్రమాదకరం!

విద్యుక్త ధర్మాన్ని నిష్టతో నిర్వహించాల్సిన పోలీసు వ్యవస్థ గాడితప్పిన వైనం జగన్ పాలనలో అన్ని చోట్ల కళ్ళకు కడుతుంది. ప్రజాస్వామ్య కల్పవృక్షాన్నే పెకలించే స్థాయిలో నియంతృత్వం జడలు విరబోసుకొన్నది. జగన్ ప్రభుత్వ అరాచకం, వేధింపులు, సాధింపులు, నియంతృత్వంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా పోలీసులు ప్రజల, ప్రతిపక్షాల హక్కులను హరించడం మంచిది కాదని గుర్తించాలి. పోలీసులు ప్రజల రక్షణ కోసం ఉన్నారా లేక ప్రజలు కట్టే పన్నులు ద్వారా జీతాలు తీసుకుంటూ, ప్రజల పక్షాన నిలుస్తున్న ప్రతిపక్షాన్ని అణచి వేయడానికి వున్నారా అన్నది వారే తేల్చుకోవాల్సి వున్నది. ప్రజలకు విధేయులుగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ పాలకులకు విధేయులుగా వున్నామని నిరూపించుకోవడానికి అంతులేని ఆరాటం ప్రదర్శిస్తోంది రాష్ట్రంలో. ఇది అత్యంత ప్రమాదకరం. జగన్ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. తాడేపల్లి ప్యాలెస్‌‌లో వున్న సలహాదారుడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ఎవరెవర్ని అరెస్టు చెయ్యాలో, ఎవర్ని నిర్భంధించాలో, ఎవరిపై అక్రమ కేసులు పెట్టాలో నిర్ణయించుకుని మరీ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ కారణంగానే రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలుకు నోచుకోవడం లేదు.

నీరుకొండ ప్రసాద్

98496 25610

Tags:    

Similar News