రాజకీయం మగాళ్ల సొత్తేనా?

రాజకీయం మగాళ్ల సొత్తేనా?... Is politics only for men

Update: 2023-03-07 18:30 GMT

భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవునికి మహిళ గొప్పతనం తెలుసు. పుట్టిన ప్రతి ఒక్కరికి మహిళలు పడే బాధలు తెలుసు. మహిళ అంటేనే ఒక దేవత ఆ దేవతను గౌరవించాల్సిన అవసరం ఉంది.

మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపించిన స్త్రీలు చాలామంది ఉన్నారు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన వీర నారీమణులకు మనం రోజు మొక్కాల్సిందే.

ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందన్న వాక్యం వందకు వంద శాతం నగ్నసత్యమే. ఆడది లేకుంటే మగవాడు ఏ పని చేయలేడు, పక్కా సోమరిపోతుగా ఉంటాడు. తెల్లవారుజామున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నిరంతరాయంగా పనిచేసే గొప్ప వీరవనిత మహిళ. విశ్వమంతటికీ మహిళనే గొప్ప దేవత. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయమే కాదు, మన బాధ్యత కూడా.

వారు వంటింటికే పరిమితమా...

సమాజంలో చాలామంది మదిలో ఉండేది మహిళ వంటింటికే పరిమితమని కానీ కేవలం మగవాడే ఉద్యోగం చేయాలని మహిళలు మాత్రమే ఇంట్లో ఉంటూ వంట పని ఇంటి పని చేస్తూ ఉండాలని రాజ్యాంగంలో రాసిపెట్టి లేదు. ప్రతి మహిళకు ఉద్యోగం చేయాలని డబ్బులు సంపాదించాలని పెద్ద పెద్ద సమావేశాలలో మాట్లాడాలని అనుకుంటారు. కానీ ఈ కోరికలు కొంతమంది మహిళలు మాత్రమే నెరవేర్చుకుంటున్నారు. చాలామంది లక్ష్యాలు బూడిదలో పోసిన పన్నీరు లాగానే మారిపోతున్నాయి. ముందుగా ప్రతి మగవాడు చేయాల్సింది ఒక్కటే మహిళలకు నచ్చినది ఏంటో కనుక్కొని ఆమెకు వెన్నంటే ఉండి ప్రోత్సహించాలి. అప్పుడే సమాజంలో మహిళలకు గౌరవం పెరుగుతుంది. అప్పుడే మహిళ తలెత్తుకొని గౌరవంగా బ్రతుకుతుంది. అలాగే మగవారు మాత్రమే రాజకీయం చేయాలని ఏమీ లేదు. మహిళలు రాజకీయంగా ఎదిగి మరింత మంది మహిళలకు ఆదర్శంగా నిలవాలి. అలాగే భ్రూణ హత్యలు, చదువు మధ్యలోనే ఆపించేయడం వంటి చర్యలు చేయకూడదు.

ఇవన్నీ కేవలం మహిళా దినోత్సవాల రోజున నోటి మాటలుగా కాకుండా ఆచరణలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరగాలి. మహిళలు ప్రజాస్వామ్యంలో గౌరవించబడాలి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపాలి. మహిళలు కూడా రోడ్డుపై స్వచ్ఛందంగా తిరిగే రోజులు రావాలి. ప్రతి మహిళను తన సోదరి వలె ప్రతి ఒక్క మగవాడు భావించాలి. మహిళలు తమ సత్తాను చాటుతూ ప్రజాస్వామ్యంలో తమ వంతు పాత్రను పోషిస్తారని దానికి పురుష లోకం సహకరిస్తారని కోరుకుంటున్నాను.

వెంగళ రణధీర్

9949493707

Tags:    

Similar News