అంబేడ్కర్‌ని విస్మరించి.. రాజ్యంగాన్ని పొగడటమా?
Is it fair for politicians to ignore Ambedkar and praise the Constitution?
భారతదేశంలో నేడు ఎన్నికలు మతోన్మాదానికి, సెక్యూలర్ వాదానికి మధ్య యుద్ధంగా నడుస్తున్నాయి. ఒక ప్రక్క ఆర్‌ఎస్ఎస్ వాళ్ళు మేము రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. మరోపక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చేదే లేదనడంలో ఉద్దేశమేమిటి? భారత రాజ్యాంగం భారత దేశానికి ఊపిరి లాంటింది. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అంటే లౌకిక వాదాన్ని ఉల్లంఘించడమే. రాజ్యాంగ సృష్టికర్తను విస్మరించి రాజ్యాంగాన్ని పొగడడంలో కుల వివక్ష ఉంది. అస్పృశ్యత కూడా దాగి ఉంది.
భారతదేశం మొత్తంగా కుల సమీకరణలతోనే రాజకీయాలు నడుస్తున్నాయి. బీహార్‌లో దశాబ్దాలుగా కులాల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. నితీష్ చేపట్టిన కుల గణన మరోసారి రిజర్వేషన్ల అంశాన్ని చర్చకు పెట్టింది.
ఉద్దేశపూర్వకంగానే..
రాజకీయాల్లో కులతత్వం, అస్పృశ్యత కూడా పెరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇండియా కూటమి స్పోక్స్ పర్సన్ రాహుల్ గాంధీ కానీ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతూ అంబేడ్కర్ పేరు ఎత్తకపోవడం అంటే అది తప్పకుండా రాజకీయాల్లో కులవివక్షే అవుతుంది. రాజ్యాంగాన్ని ఎంతో శ్రమతో రూపొందించిన డా. బి.ఆర్.అంబేడ్కర్ నామవాచకాన్ని సీపీఎం అధినేత ఏచూరి సీతారాం సైతం అంబేడ్కర్ పేరును కానీ ఉచ్ఛరించకుండానే రాజ్యాంగ వ్యవస్థలను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని అంటున్నారు.
ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో 'భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని భారత రిపబ్లిక్ లౌకిక ప్రజాస్వామిక స్వభావాన్ని కాపాడేందుకు బీజేపీని ఓడించే లక్ష్యంతో ఇటీవల ‘ఇండియా’ వేదిక, డిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ప్రదర్శన నిర్వహించింది. అని అన్నారు. మొత్తం ఈనాడు జరుగుతున్న రాజకీయాల్లో రాజ్యాంగ ప్రశస్తి ఎక్కువగా ఉంది. అదే సమయంలో రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేడ్కర్‌ను విస్మరించటం కూడా ఉద్దేశపూర్వకంగానే జరుగుతోంది. రాజ్యాంగ సృష్టికర్తను విస్మరించి రాజ్యాంగాన్ని పొగడడంలో కుల వివక్ష ఉంది. అస్పృశ్యత కూడా దాగి ఉంది. 111 మంది దళిత ఎంపిలు కూడా అంబేడ్కర్ పేరును కూడా విస్మరిస్తున్నారు. ఆయన నిర్మించిన రాజకీయ రిజర్వేషన్‌ల ద్వారా పార్లమెంటుకు వెళ్లినవారు దళితుల గురించి మాట్లాడలేకపోతున్నారు.
ఇదే నిర్లక్ష్య వైఖరి వహిస్తే..
అంబేడ్కర్ సిద్ధాంతాలను అర్థం చేసుకోకుండా, సంపదను అందరికీ పంచాలనే అంశాన్ని విస్మరించి ఎం.పీలందరు కోట్లకు పడగలెత్తి ధనవంతులై, భూస్వాములై, దోపిడీ దారులై, నల్లడబ్బు స్వాములై నిజాయితీ నీతిలేని వారిగా ఎక్కువ మంది జీవిస్తున్నారు. ఎంపీల్లో బ్యాంకుల్లో డబ్బు ఎగ్గొట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 302, 307 కేసుల్లోనే గాక మహిళలపై అఘాయిత్యాలు చేసిన వారు కూడా ఎక్కువమంది ఎన్నికల్లో నిలబడడం ఆశ్చర్యం. భారతదేశంలో సాంఘిక విప్లవాన్ని, కుల నిర్మూలనను ‘ఆర్థిక సమతావాదులు’ విస్మరించినట్లయితే వారికి విప్లవం సుదూరంలో ఉండక తప్పదు. ఒకవేళ సాంఘీక వ్యవస్థలో ఉన్న అంతరాల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తే చివరకు వారి విప్లవ సాధనలో కూడా కుల వ్యవస్థ యొక్క దుష్ఫలితాలు ప్రతిఫలించక తప్పదు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ అంబేడ్కర్ ఇలా పేర్కొన్నారు. ‘‘ఇండియాలో సాంఘీక వ్యవస్థను సోషలిస్టులు ఎదుర్కొనక తప్పదు. అలా ఎదుర్కొనకుండా విప్లవం సాధ్యం కాదు. ఒకవేళ అది సాధ్యమైనా, వారి ఆశయాలు నెరవేరాలంటే సదరు సాంఘీక వ్యవస్థతో సోషలిస్టు కుస్తీ పట్టక తప్పదు. ఇది నా దృష్టిలో నిర్వివాదమైన సత్యం’’ ఇక్కడ సోషలిస్టులను ఉద్దేశించి చెప్పిన మాటలు కమ్యూనిస్టులకు కూడా వర్తిస్తాయన్నారు.
నేటికీ కులవివక్ష, అస్పృశ్యత
కానీ ఈ రోజున మేధావులు, ఆలోచనాపరులు, ఉద్యమకారులు, స్త్రీవాదులు, సామాజిక సేవకులు నిశ్శబ్దంగా ఉండడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. వీరందరు అంబేడ్కర్ ఆలోచనలతో రావలసిన చారిత్రక సందర్భం వచ్చింది. ఇప్పుడున్న పార్టీలు దళిత మేధావులు, స్త్రీ ఉద్యమకారులకు, లౌకికవాదులకు సీట్లు ఇవ్వకపోవడాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏమిటింటే, భారత రాజకీయాల్లో ఈనాడు కూడా కుల వివక్ష, అస్పృశ్యత కొనసాగుతున్నాయి. అందుకే ఈనాడు దళిత బహుజనులు స్త్రీలు మైనార్టీలు స్వయంగా రాజ్యాధికారం కోసం పోరాడాలి. దళిత బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయం కావాలి. అంబేడ్కర్ విప్లవ మార్గంలో నడుద్దాం.
డా. కత్తి పద్మారావు
98497 41695