వేలెత్తి చూపితే సరిపోతుందా? మనం మారొద్దా?
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ వారు, బాధితుల కంప్లయింట్ ఆధారంగా అవినీతి అధికారులు నేరుగా డబ్బులు తీసుకుంటున్న
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ వారు, బాధితుల కంప్లయింట్ ఆధారంగా అవినీతి అధికారులు నేరుగా డబ్బులు తీసుకుంటున్న సమయంలో పట్టుకొని రిమాండ్‌కు పంపడం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వారు అవినీతికి పాల్పడిన అధికారులు ఏ శాఖలో ఉన్నా వదలడం లేదు. అయినా అవినీతి, అధికారులలో పరువు పోతదనే భయం లేదు, లంచం తీసుకోవడం తమ హక్కులా భావించి యధేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిన్నారు.
లంచం తీసుకునే అధికారులని ప్రతి ఏటా అవినీతి శాఖ వారు పసిగట్టి పట్టుకుంటున్నప్పటికీ, అవినీతికి పాల్పడితే తప్పేంటి అన్న ధోరణి వారిలో కనబడుతోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన హైడ్రా (హైదరాబాదు డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్) అక్రమ నిర్మాణాలను చెరువు ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్‌లో పెద్ద పెద్ద నిర్మాణాలను సైతం కూల్చివేస్తున్నారు. అయితే హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తున్న నేపథ్యంలో అసలు చెరువు స్థలంలో ఆ నిర్మాణాలకి వివిధ శాఖల అధికారులు ఎలా అనుమతి ఇచ్చారనేది ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఇదంతా పక్కకు పెట్టి కొందరు ప్రజలు, నాయకులు, అధికారులు ప్రభుత్వాలను బదనాం చేస్తున్నారు.
హైదరాబాదులోని చాలా చెరువులు ఆక్రమణలకు గురై కాలనీలుగా వెలసిన సంగతి మనకు తెలిసిందే. గొలుసు కట్టు చెరువులు ఒక చెరువు నిండిన తరువాత మరొక చెరువు నిండుకుంటూ లోతట్టు ప్రాంతాలలోకి వెళ్లీ ముఖ్యంగా మూసీనదిలోనే కలుస్తాయి. ఆ చెరువులు ఆక్రమ ణలకు గురై ఇళ్ల నిర్మాణాలు జరిగిన తరువాత నగరంలో కొద్దిపాటి వర్షం పడినా లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు వెళుతుంది. కొంతమంది ప్రజలు, నాయకులు, అధికారులు ఈ తప్పులు చేస్తూ ప్రభుత్వాలను బదనాం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి పూనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాదు నగర శివారులలో 1980 తరువాత బాగా ఊపందుకుంది. ప్రస్తుతం ఇళ్ల స్థలాలు సామాన్యునికి అందకుండా ఉన్నాయి. చెరువుల ఆక్రమణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ హైదరాబాదులో పార్కులు, చెరువులు ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురౌతున్నాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలను తొలగి స్తున్పప్పటికీ ఈ తంతు మాత్రం ఆగడం లేదు.
అవినీతికి ఆధారం అదే...
ప్రభుత్వ పనుల నిర్మాణాలు జరిగిన తరువాత ఎంక్వైరీల పేరుతో చాలా కాలయాపన జరుగుతూనే ఉంటుంది. అయినా ఎవరు అధికారంలో ఉన్నా టెండర్లు పిలిచే విధానంలో పారదర్శకత ఉండదు. పేమెంట్ విధానంలో ఒక జవాబుదారీతనం ఉండదు. ప్రభుత్వ పనులు చేయాలంటే రాజకీయనాయకుల, అధికారుల చేతులు తడపాల్సిందే. అప్పుడు పనులలో నాణ్యత లేదని ఎవరూ నిరూపించలేరు. ఆ నిర్మాణాలు కూలిపోయినప్పుడు మాత్రం గత ప్రభుత్వం కోట్ల అవినీతికి పాల్పడిందని పెద్దపెద్ద అక్షరాలతో వార్తా పత్రికలు, టి.వీలు మొరపెట్టుకుంటాయి. కానీ ఒక విషయం మనం గమనించాలి. ఒక రోడ్డు గుంతలు పడినా, ఒక బ్రిడ్జి కూలిపోయినా, నిర్మాణం చేసిన కాంట్రాక్టరు బాధ్యత వహించాలి. కానీ ఆ కాంట్రాక్టు ఇచ్చిన ప్రభుత్వాలను బదనాం చేస్తాయి ప్రతిపక్షాలు. అంటే అక్కడ అవినీతి జరుగుతుంది కాబట్టి ఆ బదనాంను వాళ్లు మోస్తున్నారు. ఒక నాయకుడు ముందుకు వచ్చి ఆ నిర్మాణాలకు ఆ కాంట్రాక్టరుదే బాధ్యత అని ఎక్కడా చెప్పలేడు.
బోలెడు చట్టాలు.. అమలు అసాధ్యం
ప్రజాస్వామ్య పాలనలో మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం, మూడు బలమైన స్థంభాలైన శాసనవ్యవస్థ, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ. నాలగవదైన మీడియా అన్నీ కలసి ప్రజలకు మంచిపాలన అందించాలి. శాసన వ్యవస్థ ప్రథమ కర్తవ్యం, దేశానికీ, రాష్ట్రానికీ అవసరమైన చట్టాల శాసనాలను చెయ్యడం. పాలనా వ్యవస్థ ముఖ్య కర్తవ్యం, చట్టసభలు చేసిన శాసనాలను అమలుపరచడం. భారత రాజ్యాంగం ప్రకారం పాలనా వ్యవస్థ దేశాన్ని సంక్షేమరాజ్యంగా చెయ్యడంలో ముఖ్య పాత్ర వహించాలి. ప్రభుత్వాలు శాంతిభద్రతలను కాపాడుతూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే అభివృద్ధికి తోడ్పడాలి. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మనం నిర్మించుకున్న ప్రభుత్వాలదే. మరి ఎక్కడ లోపం జరుగుతోంది?
తప్పులు చేస్తూ వేలెత్తగలమా?
రోజురోజుకూ ప్రజలకు ప్రభుత్వాలపై విశ్వాసం తగ్గుతోంది. నాయకులపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఒక అధికారి ప్రభుత్వం నుండి జీతం పొందుతూ ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నానని నిజాయితీగా చెప్పగలుగుతాడు? 'నేరం నాది కాదు ఆకలిది' అని తెలుగు సినిమాలో ఎన్టీఆర్ ఒక పాటలో 'మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా.. మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి.. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి..'అని నిలదీస్తారు.
ఒక మహిళ తప్పు చేసిందని కొట్టడానికి కొందరు పిడికిలితో రాయి పట్టుకొని ఉన్నప్పుడు మీలో తప్పు చేయనివారు ముందుగా ఆ మహిళపై రాయి వేయండి అన్న సందర్భంలో ఒక్కరు కూడా అక్కడ ఉండరు. అంటే ప్రస్తుతం అందరం ఏదో ఒక పాపం చేస్తున్నామని హీరో మేలుకొలుపుతాడు. మంచిని గ్రహించి ఎవరికి వారు తప్పులు చేయకుండా స్వీయనియంత్రణ కలిగిఉండటమే సజ్జనుని లక్షణం.
సత్యమేవ జయతే గీటురాయి
మన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఎన్నో పరిశోధనలు, సమాలోచనలు, ప్రముఖులైన ప్రజా ప్రతినిధులతో కూడిన కమిటీ రెండేళ్ల 11 నెలల 18 రోజులు శ్రమించి 1949 నవంబరు 26న రాజ్యాంగ నిర్మాణసభలో ఆమోదించుకొని సభ్యుల వివేకంతో కూడిన ఆలోచనా ధోరణుల వలన రాజ్యాంగం రూపుదిద్దుకొంది. లిఖిత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దానిని అమలుపర్చడంలో ఆయాకాలాల్లో అవసరాలకు అనుగుణంగా అందరి సభ్యుల ఆమోదయోగ్యంతో మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తితో సత్యం మాత్రమే విజయం సాధిస్తుందని విస్తృత ప్రచారంతో ముందుకెళ్లినప్పుడే ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. మన దేశ జాతీయ నినాదంగా స్వీకరించబడిన సత్యమేవ జయతే ప్రేరణతోనే మనం కోరుకుంటున్న సుపరిపాలన సాధ్యపడుతుంది.
సోమ శ్రీనివాసరెడ్డి
కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్