వైద్యరంగంలో అతి గొప్ప ఆవిష్కరణ ఎక్స్‌రే

International Day of Radiology importance

Update: 2023-11-08 00:45 GMT

జీవితంలో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక్కసారైనా అనారోగ్యంతో ఆసుపత్రి గడప తొక్కక తప్పదు.. డాక్టర్‌నీ కలువకా తప్పదు. అయితే ఆ డాక్టర్ రోగ నిర్ధారణకు ఎక్స్‌రే తీసుకు రమ్మనడం పరిపాటే.. ఇంతలా రోగ నిర్థారణకు ఉపయోగించే ఈ ఎక్స్‌రే కథ మీకు తెలుసుకోవాలని ఉందా? మీ శరీరంలోనికి ఎక్స్ కిరణాలను పంపించి శరీర అవయవ నిర్మాణాలు, వ్యాధులు, ఎముకల పగుళ్లు తెలుసుకుంటారు.. అసలు ఈ కిరణాలను..ఎవరు ఎలా కనుగొన్నారు ఒకసారి పరిశీలిద్దాం.

వైద్య రంగంలో ఎక్స్-రే ఆవిష్కరణ ఒక గొప్ప మైలురాయి. 1895 నవంబర్ 8న, జర్మనీ భౌతిక శాస్త్రవేత్త సర్ విలియం కొనరాడ్ రాంటిజన్ (Wilhelm Conrad Rontgen) ఉత్సర్గ నాళ ప్రయోగాలతో కేథోడ్ కిరణాల ధర్మాలు పరిశీలించే క్రమంలో అనుకోకుండా ఎక్స్‌రే కిరణాలను కనుగొన్నారు. ఆయన పక్కనే ఉన్న ప్లాటినో సయనైడ్ ఫలకంపై తన చేతి ఎముకలు దర్శనమిచ్చాయి. ఆశ్చర్యానికి గురి అయిన అతను మళ్లీ మళ్లీ పరీక్షించి ఏవో కంటికి కనిపించని కిరణాలు శరీరం గుండా ప్రసరిస్తూ ఎముకల నీడలను ఏర్పాటు చేస్తున్నాయి అని గమనించాడు. మనం సాధారణంగా గణితంలో తెలియని దానిని ఎక్స్ అని అంటుంటాం. అలాగే రాంటిజన్ ఆ ధర్మాలు తెలియని కిరణాలకు ఎక్స్ కిరణాలుగా భావిస్తే అదే నామం వాటికి స్థిరపడిపోయింది.

శరీరానికి గాటు లేకుండా..

పరిశోధనాలయంలో ఆయన కనుగొన్న ఎక్స్ కిరణాల ఆవిష్కరణతో వైద్యరంగంలో పలు విప్లవాత్మక మార్పులు సంభవించాయి. రోగ నిర్ధారణ, చికిత్స సులువు అయ్యింది. నిజానికి రాంటిజన్ కన్న ముందే పలువురు శాస్త్రవేత్తలు వీటి ఉనికి కనుగొన్నప్పటికీ మొదటి పరిశోధనా పత్రాన్ని రాంటిజెన్ సమర్పించడంతో ఆ ఆవిష్కరణకు భౌతకశాస్త్రంలో మొట్ట మొదటి నోబెల్ బహుమతి 1901లో ఆయనకు ఇవ్వడం జరిగింది.. ఎక్స్ కిరణాలను కనుగొన్న ఈ రోజు నవంబర్ 8 ని ప్రపంచ రేడియోగ్రఫీ డే గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. పలు అంతర్జాతీయ సంస్థలు ఇదే రోజున అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు.

ఓ శతాబ్దం వెనక్కి వెళితే రోగి రుగ్మతలను తెలుసుకోవాలన్నా, ఇరిగిన ఎముకలను, పగుళ్లను గుర్తించాలన్నా, రోగి వివిధ శరీర అవయవాల్లో కేన్సర్ కంతులను గమనించాలన్నా, మెదడు లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే తెలుసుకోవాలన్నా, చిన్న, పెద్ద పేగులకు రంధ్రం పడ్డా చివరికి గుండెకు చిల్లు పడ్డా, గుండె పని తీరును అధ్యయనం చేయాలన్నా, రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించాలన్నా, ఊపిరితిత్తులలో నీరు చేరినా ఆయా శరీర భాగాలలో కోతలు పెట్టీ, శస్త్ర చికిత్సలు చేస్తే గాని తెలుసుకోలేకపోయారు.. కానీ నేడు శరీరానికి చిన్న గాటు అయినా పెట్టకుండా, ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా వివిధ శరీర అవయవాల నిర్మాణం, పనితీరు, అవలక్షణాలు, రుగ్మతలు గుర్తించడంతోపాటు ముందుగానే క్యాన్సర్ లాంటి రోగాలను పసిగట్టే వీలు ఈ రోజు సాధ్యమైంది. ఇదంతా కేవలం ఎక్స్ కిరణాల ఆవిష్కరణతో సాధ్యమైంది. ఎక్స్ కిరణాల నుపయోగించి ఎన్నో అధునాతన రోగ నిర్ధారణ, చికిత్సా యంత్రాలను కనుగొనడం జరిగింది. వైద్య రంగంలో పలు విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

ఎక్స్ కిరణాల ఉపయోగాలు

ఎక్స్‌రే కిరణాలు ఉపయోగిస్తూ రేడియాలజీ విభాగంలో రోగ నిర్ధారణకు మాత్రమే కాకుండా క్యాన్సర్ లాంటి రోగ నివారణకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన ఉపకరణాలు, యంత్రాలు కనుగొనడం జరిగింది. ఎక్స్‌రే ఆవిష్కరణ వైద్య రంగంలో ఎన్నో కీలక మార్పులు వచ్చాయి. మొదట్లో ఎముకల పగుళ్లని చూడడానికి మాత్రమే వినియోగించారు. తర్వాత క్రమంలో వివిధ యంత్ర పరికరాలు పలు అవయవాల నిర్మాణం, పనితీరు, రుగ్మతలు తెలుసుకోవడమే కాకుండా చికిత్సలు చేయడానికి ఈ ఆవిష్కరణలు తోడ్పడుతున్నాయి. మెదడు, నాడీ వ్యవస్థ, రక్తనాళాలు, ఎక్స్ కిరణాలను ఉపయోగిస్తూ పనిచేసే ఎన్నో ఆధునిక పరికరాలు ఫ్లోరో స్కోపి, కంప్యూటెడ్ టోమోగ్రఫీ, పెట్ స్కాన్, స్పెక్ట్స్ స్కాన్, గామా కెమెరా, సి.ఆర్మ్ మొదలైన ఎన్నో రోగ నిర్ధారణకు ఉపయోగించే యంత్రాలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఎక్స్‌రే కిరణాలు కనుగొన్నాక వైద్య రంగంలో ఒక రోగ నిర్ధారణ విభాగం రేడియో డయాగ్నోసిస్ విభాగం నెలకొల్పారు. అది శాఖోపశాఖలుగా విస్తరించి ఈనాడు రేడియాలజీ, ఇమేజియాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, రేడియో థెరపీ, నుక్లియర్ మెడిసిన్ మొదలైన విభాగాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. రేడియాలజీ కేవలం రోగ నిర్ధారణకే కాదు పలు రక్త నాళాల అవరోధాలు, రుగ్మతలు, వివిధ అవయవాలలో కాన్సర్ కంతుల నివారణకు, రక్త స్రావాల నిరోధనకు పలు రకాల పరీక్షలు అందుబాటులోకి వచ్చి రేడియాలజీకి అదనపు ఆకర్షణగా రోగులకు ఓ గొప్ప వరంగా అభివృద్ధి చెందింది.

కాస్తా అజాగ్రత్త వహించినా..

అయితే ఈ కిరణాల ఉపయోగం ఎంత ఉందో ఎలాంటి అశ్రద్ద, అజాగ్రత వహించినా మేలు కన్న కీడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. మొదట్లో ఎక్స్ కిరణాల విధ్వంసక ధర్మాలు తెలియక వివిధ ప్రయోగ దశల్లో వినియోగించిన ఎందరో శాస్త్రవేత్తలు మేడం క్యూరీ, రాంటిజెన్‌తో సహా ఆయన భార్య కూడా కేన్సర్‌తో మరణించారు. 1930-50 లలో అమెరికాలో షూ కంపెనీలలో పనిచేసే ఎంతోమంది కార్మికులు రేడియేషన్ బారిన పడి మరణించారు. ఎక్స్‌రేలు శరీర అవయవాల కణజాలాల గుండా ప్రసరించినపుడు విభిన్న శక్తి స్థాయిలు కలిగి ఉంటాయి. తక్కువ శక్తి స్థాయి కిరణాలు శరీర భాగాల నుండి చొచ్చుకొని పోలేక వాటి శక్తిని శరీర కణజాలంలో నిక్షిప్తం చేస్తాయి. అంటే శరీర కణజాలంలోని అణువుల అమరికలోని ఎలక్ట్రాన్లను తొలగిస్తుంది. దీనినే అయానీకరణం అంటారు. తద్వారా శరీర కణజాలంలోని అణువుల క్రోమోజోములలో మార్పులు సంభవించే ప్రమాదం ఉంది. పలు ఉత్పరివర్తనలు జరిగి కేన్సర్‌కి దారితీసే ప్రమాదం ఉంది. ఈ అయానీకరణ రేడియో ధార్మికత ఎంత ప్రమాదకరం అంటే ఎక్స్ కిరణాలు ఎదుర్కొన్న వ్యక్తులలోనే కాకుండా వారి భవిష్యత్ తరాలలో (జెనెటిక్ ఎఫెక్ట్స్) కూడా వాటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. గమ్మత్తు ఏమిటంటే ఈ రేడియో ధార్మిక ఎక్స్ కిరణాలు క్యాన్సర్ కారకాలు అన్నది ఎంత నిజమో...అదే క్యాన్సర్ కణాల నిర్మూలనకు ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సూత్రంతో అవే రేడియో ధార్మిక కిరణాలను రేడియో థెరపీ చికిత్సలో ఉపయోగించి క్యాన్సర్ కణాలను చంపేస్తారు.

డాక్టర్స్‌ డాక్టర్స్‌గా వారికి పేరు..

నిజానికి మానవాళి మాత్రమే కాదు జీవకోటి మొత్తమూ వివిధ రకాల రేడియేషన్ వలగూడులో చిక్కుకొని ఉంది. ఎక్స్ కిరణాలే కాకుండా ఆల్ఫా, బీటా, గామా కిరణాలు చివరికి రేడియో తరంగాలు, మొబైల్ సిగ్నల్స్ అన్నీ రేడియేషన్ వెదజల్లేవే.. దీంతో రేడియాలజీ ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోంది. ఈ రంగంలోని రేడియాలజిస్ట్‌లను డాక్టర్స్‌గా వ్యవహరిస్తారు. ఎందుకంటే వారు రోగ నిర్ధారణలో కీలక పాత్ర వహిస్తారు. సాంకేతిక నిపుణులను రేడియోగ్రాఫర్స్‌గా, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజిస్టులుగా పిలుస్తారు. వీరు రోగ నిర్ధారణలో, అన్వేషణలో డాక్టర్‌కి ఒక టార్చ్ లైట్‌లా ఉపయోగపడుతారు. శరీర అవయవాలను వివిధ కోణాలలో, వివిధ యంత్రాల సహాయంతో ఎక్స్ కిరణాల ఉపయోగించి శరీరంలోని ఏ భాగాన్ని అయినా చిత్రాల, వీడియోల ద్వారా ఆవిష్కరిస్తారు. వాటిని అధ్యయనం చేసి రేడియాలజిస్టులు రోగ నిర్ధారణ చేస్తారు.. శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందడంతో డిజిటల్ సబ్ట్రాక్షన్, కాత్లాబ్, ఫ్లురోస్కాపి, సి. ఆర్మ్, ఓ ఆర్మ్ మొదలైన పరికరాలు అందుబాటులోకి రావడంతో నేడు రేడియాలజీలో శరీరానికి కోత పెట్టకుండా చికిత్స మార్గాలు వచ్చాయి. 3D సి-ఆర్మ్ తో రోగి అవయవాలను త్రీడీ రూపంలో వీక్షిస్తూ శస్త్ర చికిత్సలు నిక్కచ్చిగా చేయవచ్చు.

(నేడు అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం)

శ్రీనివాసులు శిరందాస్

ప్రిన్సిపాల్, నిజాం వైద్య విజ్ఞాన సంస్థ,

94416 73339

Tags:    

Similar News