జన భారతానికి.. సవాళ్లు అధికమే..!!

India No. 1 in population, what are challanges

Update: 2023-04-26 00:15 GMT

‘భారత్‌లో అధిక జనాభా పెరుగుదల ఆ దేశంలోని 63 శాతం మంది సాధారణ పౌరుల్లో ఆందోళన కలిగించిందని తాజాగా జనగణన సర్వేలో తేలింది. అయితే, ఆ దేశం జనాభా పెరుగుదలను ఆందోళనకరంగా చూసే కంటే.. పురోగతి, అభివృద్ధి, మానవ హక్కులు, బహుళ అవకాశాలకు కొలమానంగా చూడాలి. అని ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల నివేదిక భారత ప్రతినిధి ఆండ్రియా వొజ్‌నార్ వ్యాఖ్యానించారు.

వారం కిందట.. ప్రకటించిన ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల నివేదికను బట్టి ప్రపంచంలోనే అధిక జనాభా దేశంగా భారత్ 142.86 కోట్లతో తొలిస్థానంలో నిలిచింది. ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్టు-2023’ని యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్స్‌(UNFPA)’ ఇటీవలే విడుదల చేసింది. ఇప్పుడు చైనా జనాభా 142.57 కోట్లు. మనదేశ జనాభాతో సరిపోల్చితే 29 లక్షలు తక్కువ. దశాబ్ధాలుగా జనాభాపరంగా చైనానే ఆధిపత్యం కొనసాగిస్తుండగా ఎట్టకేలకు 72 ఏళ్లు తర్వాత మన దేశం చైనాను దాటింది.

1950 నుంచి ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాల జనాభా లెక్కలను ప్రకటిస్తోంది. భారత్‌కు దక్కిన ఈ హోదా అటుంచితే.. ప్రపంచంలో అధిక జనాభా దేశంగా మనం గర్వించేదే అయినా.. భవిష్యత్‌లో పొంచి ఉండే ఆర్థిక, సామాజిక సవాళ్లను ఊహించుకుంటే ఆందోళనే ఎదురొస్తుంది. కొన్ని దేశాలకు జనాభా పెరుగుదల మేలు చేసేదిగా ఉంటుంది. ఉదాహరణకు రష్యాలో ఎక్కువమంది పిల్లలను కనే మహిళలకు ఆ దేశం ప్రోత్సాహకాలను అందిస్తోంది. దానికి కారణం అక్కడ జనాభా పెరుగుదల చాలా తక్కువస్థాయిలో ఉండడం. కానీ మన దేశానికి వచ్చేసరికి ఈ పెరుగుదల భవిష్యత్ ఆందోళన కలిగించేదిగా పరిణమించవచ్చు. మనదేశం అభివృద్ధి చెందుతున్న దేశమైనందున కలిసొచ్చే అవకాశాల కంటే ఎదురయ్యే సమస్యలే ఎక్కువ అవ్వొచ్చు. ఇప్పటికే పేదరికం, నిరుద్యోగం, తక్కువ ఉపాధి కల్పన, సరిపడా వస్తు ఉత్పాదకత లేకపోవడం, దిగుమతులపై ఆధారపడడం, సరైన విద్యా, వైద్యం, గృహ వసతి లేమి వంటి సమస్యలతో దేశం ఎంతో సతమతమవుతుండగా ఈ పెరుగుదల దేశంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందోనని ఆర్థిక వేత్తలు అంచనాలు వేస్తున్నారు. మరోవైపు ఈ జనాభా పెరుగుదలతో మానవ వనరులకు కొరత ఉండదని. ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుందని. యువ శ్రామిక శక్తి కూడా ఎక్కువగా దొరుకుతుందని అంతర్జాతీయ సంస్థలు, అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ మానవ వనరులు, నాణ్యత కలిగిన శ్రామిక శక్తి సామర్థ్యాలు ఉండే దేశాల వైపు చూస్తాయని అలా మనదేశం వైపు కూడా చూడొచ్చని కొందరు ఆర్థిక వేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ పెరుగుదల కారణంగా... దేశంలో విద్య, వైద్యం, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, గృహవసతి, ఉపాధి సామర్థ్యాల మెరుగుదలకు విస్తృతంగా పెంచేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కృషి చేయాలి.

పెరుగుదలతో ఎదురయ్యే సవాళ్లు

పెరిగే జనాభా మానవవనరుల వృద్ధికి అనుకూలంగా ఉంటుందనేది ఆర్థిక వేత్తలు చెప్పడం ఎంత వాస్తవమో.. ఆకలి బాధలు కూడా పెరుగుతాయనేది అంతే నిజం. మనదేశంలో జనాభా పెరిగినంత మాత్రాన భూమి వైశాల్యం పెరగదు. సహజ వనరులు పెరగవు. ప్రధాన సమస్యలు భూమి, తక్కువ వనరులు. తగిన భూ విస్తీర్ణం లేకపోగా వ్యవసాయంపై ఆధారపడడం తగ్గుతుంది. ఉన్న ప్రకృతి వనరులపైనే ఒత్తిడి పెరుగుతుంది. వీటిని అందరికీ సమవాటాలుగా పంచడం కూడా పెద్ద సమస్యే అవుతుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కొందరికే చేరుతాయి. తద్వారా పేదరికం, నాణ్యమైన విద్య, వైద్యం, తగిన గృహ వసతి లేమితో పాటు అధిక కాలుష్యం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పెరిగే జనాభాకు అనుగుణంగా మానవాభివ‌ృద్ధి, సామాజిక అభివృద్ధి సూచీలను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే.. దేశంలో ఇంకా 81 కోట్లమందికిపైగా పేదరిక రేఖ దిగువన ఉండి.. వన్ నేషన్ వన్ రేషన్ కింద బియ్యం తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం సందర్భానుసారంగా చెబుతూనే ఉంది. ఇక నిరుద్యోగిత పరంగా చూస్తే.. ఇంచుమించు 10 శాతంగా ఉంది. ఆర్థికవృద్ధి కూడా 10 శాతం దాటడం లేదు.

దార్శనికతే ప్రధానం

2064 నాటికి మనదేశ జనాభా 153 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. ఇందుకు అనుగుణంగా భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పాలకులు రాజకీయాలను కుల, మత, వర్గ, ప్రాంతీయ, సిద్ధాంత పరమైన కోణాల్లో చూడకుండా మానవాభివృద్ధే ధ్యేయంగా.. జాతి అభ్యున్నతే దేశ సంపద.. జన శ్రేయస్సే సర్వోన్నతమనే ధృఢ నిశ్చయంతో ముందుకు సాగాలి. ప్రజలను ఎన్నికలు వచ్చినపుడే ఓటర్లుగా చూడకుండా దేశ సంపదగా పరిగణించాలి. భారత సర్వతోముఖాభివృద్ధికి దార్శనిక విధానాలను అనుసరించాలి. పెరిగే జనాభాకు, భవిష్యత్ అంచనాలకు తగినట్టుగా జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అభివృద్ధి చెందిన దేశాలకు ఎక్కువ మానవ వనరులను అందించే స్థాయికి తీసుకెళ్లాలి. ఇలా చేసి ప్రపంచంలో అధికంగా డాక్టర్లను తయారు చేసే దేశం క్యూబా. కరోనా సమయంలో అమెరికాకు బద్ధశత్రువుగా ఉన్నా సరే మానవతా దృక్పథం చూపి, ఆ దేశానికి డాక్టర్లను పంపి అండగా నిలిచింది. అలాగే చైనా సైతం పలు దేశాలకు అధిక మానవ వనరులను అందిస్తోంది. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో చైనా కార్మికశక్తినే ఎక్కువగా కనిపిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా భారత్‌ను తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకతా.. బాధ్యతా పాలకులపై ఎంతైనా ఉంది. పాలనలో దార్శనికతే దారి దీపం కావాలి.

సురేశ్ వేల్పుల

సీనియర్ జర్నలిస్ట్

91001 44990

Tags:    

Similar News