రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న వేళ.. గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పరిశీలిస్తే రాజకీయానికి కొత్త నిర్వచనం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్ధాంత రాద్దాంతాలకు తావు లేదు. ఏదో ఒక పార్టీ టికెట్ సంపాదించి ఎన్నికల్లో పోటీ చేయడమే ముఖ్యం. ఏళ్ల తరబడి అంటిపెట్టుకుని ఉన్న పార్టీని క్షణాల్లో మార్చి వేస్తున్నారు. చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపొందిన 119 వారిలో 40 మంది పార్టీలను వీడి వేరే పార్టీ లోనికి వెళ్లారు. 2023 జనరల్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. పూట పూటకు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉన్నది, ఏది తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితులను అంచనావేస్తూ దాని మీద ఆధారపడి అటు నుంచి ఇటు నుంచి అటు వలసలు పెరుగుతున్నాయి. సొంతగూటికి చేరికలు, కొత్తగూడు వెతుక్కోవటాలు రోజుకో చోటుగా ఉంటున్నాయి. అన్నిటికన్నా ప్రజలలో ఉన్న ఎన్నికల గాలి ఎటువైపు వీస్తుందో అటువైపు రాజకీయ వలసలు పెరుగుతున్నాయి.
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే..
స్వాతంత్ర పోరాటాల కాలంలో రాజకీయ విలువలు నిబద్ధతను కట్టుబడి ఉన్న పరిస్థితుల నుండి 80 వ దశకం లో ఎమర్జెన్సీ కాలంలో 'ఆయారాం- గయారాం ' సంస్కృతి ఉధృతంగా సాగింది.ఈ నాలుగు దశాబ్దాల కాలంలో రాజకీయ వ్యవస్థ, నైతిక విలువలు పూర్తిగా దిగజారి పోతున్నాయి. ఇప్పుడు పొద్దున ఒక పార్టీలో ఉంటే మధ్యాహ్నానికి మరొక పార్టీలో చేరి సాయంత్రానికి తిరిగి గూటికి చేరిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. అది అధికారంలో ఉన్న పార్టీ సంఖ్యాబలం ఎప్పుడు ఏ తీరుగా మారుతుందో చెప్పలేని విచిత్ర పరిస్థితి వచ్చింది. దీనిని నిరోధించడానికి 1985లో రాజ్యాంగంలోని షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపుల నిరోధక చట్టం (యాంటీ డిఫెక్షన్ లా) తీసుకువచ్చారు. దీనితో పార్టీ గుర్తులతో గెలిచి ఇష్టానుసారంగా పార్టీ మారడం కొంత మేరకు తగ్గింది. కానీ ఎన్నికైన సభ్యులలో మూడింట ఒక వంతు పార్టీ మారితే వారికి ఈ చట్టం వర్తించదని వెలుసుబాటు కల్పించారు.
అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ తో పాటు వ్యక్తి ఆధిపత్యాన్ని వ్యతిరేకించే హక్కు స్వేచ్ఛ ఉండాలి. ఎవరికైనా నచ్చిన పార్టీని ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలి. ఫిరాయింపులను అడ్డుకునే పేరిట ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించే పరిస్థితి రావడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో తిరోగమనంగానే చెప్పవచ్చు. అయితే ఇది పూర్తిగా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛను హరించేది అని చెప్పడానికి అవకాశం లేదు. మరొక మరోవైపు ఈ ఫిరాయింపు నిరోధక చట్టం అనైతిక అవకాశవాదాన్ని అడ్డుకోగలిగింది. పార్టీ మారిన మారుతున్న వారంతా సిద్ధాంతాలకు అనుగుణంగా విధానపరంగానూ విభేదించి పార్టీ మారడం లేదు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థాలే ఎక్కువగా కిరాయింపులకు కారణం అవుతున్నాయి. అంతేకాకుండా రాజకీయ బేరాలు, అధికారం పంచుకోవడాలు జరగడం పరిపాటయింది. దీంతో రాజకీయ అస్థిరత సర్వత్రా వ్యాపించింది. ఈ ఫిరాయింపులతో మొత్తం రాజకీయ స్వరూపమే మారిపోయింది. రాజకీయ సమీకరణల నేపథ్యంలో సంకీర్ణయుగ రాజకీయాల సమయములో ఈ ఫిరాయింపులు ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను సవాళ్లు గా మారాయి. ఏ పార్టీ ఎన్నికల రేసులో ముందంజలో ఉంటుందన్నదని భావిస్తారో ఆ పార్టీలోకి వలసలు జోరుగా సాగడం పరిపాటయింది.
రాజకీయ చైతన్యం అవసరం!
అయితే, ఇలా పార్టీలు మారుతున్న వారిని ప్రజలు ఆదరించటం లేదా... ఆదరిస్తున్నారు. గెలుపు అవకాశం ఉన్న పార్టీలో చేరి దర్జాగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రాజకీయాల పట్ల ఏవగింపు కలుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఎన్నికల కమిషన్ అనేక రిస్ట్రిక్షన్స్ పెట్టి, ఎన్నికల కోడ్ ఉపయోగించి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో 550 కోట్ల నగదు పట్టుబడిందనీ, లక్షల కొద్ది లీటర్ల మద్యం పట్టుబడిందనీ, బంగారంతో పాటు వస్తు సామగ్రి పట్టుబడినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు చేస్తున్న ఖర్చు 10 వేల కోట్లకు ఎగబాకడం తథ్యమని ఎన్నికల పరిశీలకులు అంచనా వేస్తున్నారు.. ఇందులో మూడు వంతులు నల్లధనం అని అంచనా, దేశం వెలుపల పోగుపడిన వేల కోట్ల మేర నల్లధనం నుండి హవాలా (ప్రభుత్వానికి పట్టు పడకుండా) ద్వారా తెప్పించి ఎన్నికల్లో విచ్చలవిడిగా పోటీపడి డబ్బులు పంచుతున్నారు. ఎన్నికల కమిషన్‌కి తెలియకుండా ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారన్న దానికి ఇప్పటివరకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. కేవలం అంచనాలు మాత్రమే. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి రూ 20 కోట్ల నుంచి 100 కోట్ల వరకు హెచ్చిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన మెజార్టీ రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారం చేపడుతున్నారు. కాబట్టి ప్రజలలో రాజకీయ చైతన్యం కల్పించి నైతిక విలువలు కలిగిన వారిని, నీతి నిజాయితీపరులుగా ప్రజల కోసం ప్రజల మధ్య ఉండి ప్రజాసేవ చేసి నిస్వార్ధంగా ప్రజాసేవ చేసే వారిని ఆదరించి.. ఓటును నోటుకు అమ్ముకోకుండా ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలి.
- ఉజ్జిని రత్నాకర్ రావు
సీపీఐ సీనియర్ నాయకులు
94909 52646