పదోన్నతుల్లో పదనిసలు...రిజర్వేషన్ అమలుకాని వైనం
అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలలో SC/ST/Disabled persons సరిపడినంత లేనందున ఆ వర్గాల వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లను
అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలలో SC/ST/Disabled persons సరిపడినంత లేనందున ఆ వర్గాల వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లను రాజ్యాంగం కల్పించింది. వీటిపై స్పష్టమైన అవగాహన లేక అక్కడక్కడ రిజర్వేషన్లు అమలు పరచడం జరగడం లేదు.
దేశంలో అట్టడుగు, అణగారిన వర్గాల వారి ప్రాతినిధ్యం తగినంతగా లేనందున వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో భారత రాజ్యాంగం అనేక వెసులుబాటులు కల్పించింది. 85వ రాజ్యాంగ సవరణ ద్వారా మార్పు చేయబడిన భారత రాజ్యాంగంలోని 18(4ఏ)నిబంధన ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీలు సరిపడనంతగా లేనప్పుడు ఆయా రాష్ట్రాలు ఈ వర్గాల వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్ను అమలు చేయుటకు వీలు కల్పించింది. దీనికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల సంఖ్య 5 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తేదీ 14.2.2003 ద్వారా అన్ని శాఖల్లోని వివిధ రకాలైన పోస్టుల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది. ఉత్తర్వుల సంఖ్య 21 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తేదీ 18. 3. 2003, అట్లే ఉత్తర్వు సంఖ్య 2 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తేదీ 9.1. 2004 ద్వారా రిజర్వేషన్ అమల్లో వివరణాత్మక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది.
ప్రమోషన్లు ఎలా వర్తిస్తాయంటే?
పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు, బోర్డులు, కార్పొరేషన్లు, గ్రంథా లయ సంస్థలు, మార్కెట్ కమిటీలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తాయి. పదోన్నతులలో రిజర్వేషన్లు అన్ని సర్వీస్‌లోని పోస్టులకు వర్తిస్తాయి. కానీ ఒక పోస్ట్ యొక్క క్యాడర్ సంఖ్య 5 కంటే ఎక్కువ ఉన్నప్పుడే ఈ రిజర్వేషన్ను అమలు చేయాలి. ఇట్టి రిజర్వేషన్ 14.2.2003 నుండి ఇవ్వబడే పదోన్నతులకు మాత్రమే వర్తిస్తాయి. అమల్లో ఉన్న 100 రోస్టర్ పాయింట్ల పట్టికను పదోన్నతులలో కూడా వర్తింప చేయాలి. పదోన్నతుల్లో కూడా ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రిజర్వేషన్ కల్పించారు. రిజర్వేషన్లు సర్వీస్ నిబంధనల ప్రకారం ఆయా పోస్టులకు అర్హత గలవారికి వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ సబ్ ఆర్డినేట్ సర్వీస్ నిబంధన 22 దాన్ని షరతులు అన్ని పదోన్నతుల రిజర్వేషన్‌కు వర్తిస్తాయి.
ఎస్సీ, ఎస్టీలకే పదోన్నతి!
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలను ప్రామాణికంగా తీసుకుని సదరు తేదీ నాటికి ప్రతి క్యాడర్లోను ఎస్సీకి 15%, ఎస్టీలకు 6% ఉన్నారా లేరా? అనే విషయాన్ని గమనించి సూచించిన శాతం లేనట్లయితే రిజర్వేషన్ను అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 14.2.2003 నాటికి ఎస్సీలు 15%, ఎస్టీలు 6% ఉన్నను లేదా తర్వాతి కాలంలో సదరు కోట నిండినట్లయితే మరల ఆ క్యాడర్‌లో రిజర్వేషన్ పాటించవద్దు. ఎస్సీలు 15%, ఎస్టీలు 6% ప్రాతినిధ్యంకై ఇదివరలో సీనియార్టీ ప్రకారం పదోన్నతులు పొందినా పరిగణలోకి తీసుకొని లెక్కించాలి. తగినంత ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు సీనియార్టీ లిస్టులో లేనట్లయితే డిపార్ట్మెంటల్ పరీక్షలు, కనీస సర్వీసెస్ వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులు ఏ స్థానంలో ఉన్నా, వారిని పైకి తెచ్చి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించబడిన రోస్టర్ పాయింట్లలో సర్దుబాటు చేసి పదోన్నతి కల్పించాలి. సీనియార్టీ లిస్టులో ఎస్సీ, ఎస్టీలు ఉండి పదోన్నతి పొందుతుంటే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించబడిన రోస్టర్ పాయింట్లు వారితో నిండినట్లుగా భావించాలి.
క్యారీ ఫార్వర్డ్ చేయడం..
ఒక ప్యానెల్ సంవత్సరంలో సరిపడినంత మంది ఎస్సీ, ఎస్టీలు లేనట్లయితే సదరు ఖాళీలను తదుపరి సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. మరల రెండవ ప్యానల్ సంవత్సరంలో కూడా ఎస్సీ, ఎస్టీలు లేనట్లయితే ఆ ఖాళీలను కేటాయించబడిన రోస్టర్ పాయింట్లను మెరిట్ కం, సీనియారిటీ ప్రాతిపదికన భర్తీ చేయాలి. ఈ విధంగా ఇతరులతో భర్తీ చేయబడిన ఖాళీలను మరల మూడవ ప్యానల్ సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీలతోనే భర్తీ చేయాలి. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించబడిన రోస్టర్ పాయింట్లలో అర్హులైన మహిళ అభ్యర్థినులు లేనట్లయితే, సదర ఖాళీలను ఎస్సీ, ఎస్టీ పురుష అభ్యర్థులతో భర్తీ చేయవచ్చు. ఆయా క్యాడర్లకు రిజర్వేషన్ లెక్కించటలో ఏర్పడిన శేషం 0.5 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఒకటిగా పరిగణించాలి. ఉదాహరణకు ఒక కేడర్ యొక్క మొత్తం పోస్టులు 25 అనుకుంటే ఎస్సీ వారికి 15% చొప్పున 3.75ను 4 గా, ఎస్టీ వారికి 6% చొప్పున 1.5 ను 2గా పరిగణిస్తూ ఖాళీలను నింపాలి. ఎస్టీలకు సంబంధించి ఏదైనా క్యాడర్లో మొత్తం పోస్టుల సంఖ్య 6 లేక 7 ఉన్నను 1 పోస్ట్ వారికి ఉన్నట్లుగానే భావించి రోస్టర్ ప్రకారం వారి వంతు వచ్చినప్పుడు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 4 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తేదీ 2.1. 2007 ద్వారా తెలియపరిచారు. డిజేబుల్ పర్సన్స్‌కు కూడా పదోన్నతుల్లో మూడు శాతం రిజర్వేషన్ ప్రభుత్వం వారు జీవో 42 తేదీ 19.10. 2011 ద్వారా కల్పించారు. 100 రోస్టర్ పాయింట్లలో ఆరు 31 56ను ఏర్పాటును తెలియజేశారు. తదుపరి 3% నుంచి 4% రిజర్వేషన్లు పెంచారు. అట్లే వారికి 82వ పాయింట్‌ను కూడా రోస్టర్‌లో కేటాయించారు.
పదోన్నతికి..
సరిపడనంత డిజేబుల్ క్యాండిడేట్స్ ఫీడర్ కేటగిరీలో లేనట్లయితే వారికి కేటాయించబడిన రోస్టర్ పాయింట్లను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం క్యారీ ఫార్వర్డ్ చేయడం, ఇతర డిసేబుల్డ్ కేటగిరి వారితో నింపాల్సి ఉంటుంది. చాలా ప్రభుత్వ శాఖల యందు శాఖ అధికారులు పదోన్నతుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్ పర్సన్స్‌కు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు, వివరణలు ఉన్ననూ వారికి సరైన అవగాహన లేక కొన్ని సందర్భాల్లో అవసరం లేకున్నా పదోన్నతి కల్పిస్తున్నారు. ఉదాహరణకు ఆ శాఖకు చెందిన క్యాడర్ స్ట్రెంత్ అనుసరించి ఆయా వర్గాలకు అనగా ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్ పర్సన్స్‌లకు చెందిన సరిపడు ఉద్యోగులు ఉన్నారా? లేదా అనేది నిర్ధారించుకొని పదోన్నతులు కల్పించవలసి ఉంటుంది. కానీ ఇవి పాటించకుండా ఎక్కువగా పదోన్నతులు కల్పిం చడం కూడా జరిగినది. అట్లే కొన్ని శాఖలలో ప్రిన్సిపల్ ఆఫ్ అడిక్వసీ అంటే సరిపడినంత ఆయా వర్గాలకు చెందిన వారు లేకున్నా పదోన్నతులు కల్పించవలసి ఉన్నందున కూడా వాళ్ల రోస్టర్ పాయింట్ వచ్చేవరకు ఆగి పదోన్నతులు కల్పిం చడం జరుగుతున్నది. ఈ రెండు కూడా సరైన పద్ధతులు కావు. పదోన్నతులు ఇచ్చునాటికి ప్రిన్సిపుల్ ఆఫ్ అడిక్వసీ ఫుల్ ఫీల్ అయినదా? లేదా అనేది నిర్ధారించుకొని ఎంతమంది అయితే తక్కువగా ఉన్నారో అంత మందికే పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే పదోన్నతుల రిజర్వేషన్ విషయంలో సమతుల్యత పాటించినట్లు అవుతుంది.
చిలప్పగారి మనోహర్ రావు
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి
96406 75288