ఆర్థికంలో అందరి అడుగులూ ఒకటే!
in india, all prime ministers economic reforms are same..
దేశంలో నేడు అమలవుతున్న సరళీకరణ ఆర్థిక విధానాలకు నెహ్రూ ప్రభుత్వ కాలం నుండే పునాదులు ఉన్నాయి. దాని ప్రాతిపదికగానే నేటి సరళీకరణ ఆర్థిక విధానాల కొనసాగుతున్నాయి. అధికార మార్పిడి జరిగిన తర్వాత నెహ్రూ నాయకత్వాన కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా సోవియట్ యూనియన్, చైనా దేశాలు సోషలిస్టు ఆర్థిక విధానాలను అమలు జరిపి ఎంతో అభివృద్దిని సాధించటమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను పెంచాయి. ప్రపంచ ప్రజలు సోషలిస్టు ఆర్థిక విధానాలకు ఆకర్షితులైనారు.
జవహర్లాల్ నెహ్రూ.. సోషలిజం నేతిబీరకాయ
నెహ్రూ నాయకత్వాన ప్రభుత్వం సోషలిస్టు, పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు అమలు జరుపుతూ ఏ కూటమిలో చేరకుండా అలీన విధానం అమలు జరుపుతామని ప్రకటించి సామ్రాజ్యవాద, బడా భూస్వామ్య, బడా పెట్టుబడిదారుల అనుకూల విధానాల వైపు మొగ్గు చూపింది. అది బయటపడకుండా సోషలిస్టు ముసుగు తగిలించుకోవటానికి సోవియట్ యూనియన్ తరహా పంచవర్ష ప్రణాళిక ప్రకటించింది. 1951 పారిశ్రామిక నియంత్రణ చట్టం ప్రకారం ఉక్కు, మైనింగ్, యంత్ర పరికరాలు, నీరు, టెలికమ్యూనికేషన్, బీమా, విద్యుత్ ప్లాంట్లు ప్రభుత్వ రంగంలోకి వచ్చాయి. ఇవి ప్రభుత్వ రంగంలోకి వచ్చినప్పటికీ సామ్రాజ్యవాదులకు, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా మలచబడ్డాయి. బిలాయ్, భకోరా ఉక్కు కర్మాగాల్లో సామ్రాజ్యవాదులకు, టాటా,బిర్లా లాంటి బడా పెట్టుబడిదారులకు అవసరమైన ముడి ఉక్కును తయారు చేసి కారు చౌకగా అందించడం అందుకు నిదర్శనం. ఈ కర్మాగారాలను నిర్మించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. ఆ అవసరం లేకుండానే నెహ్రూ ప్రభుత్వం ఉక్కును వారికి అందించింది.
లాల్ బహదూర్... రూపాయి డౌన్
1962లో చైనాతో యుద్ధం తర్వాత నెహ్రూ 1964 మే 17న మరణించారు. 1964 మే 17 నుండి 1966 జనవరి 11 వరకు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నారు. నెహ్రూ- లాల్ బహదూర్ శాస్త్రి పాలన కాలంలో చైనాతో యుద్ధం, తీవ్ర కరువు, బడ్జెట్ లోటు, వేగంగా పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా భారత ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ నుంచి ఆర్థిక సహాయం కోరింది. అందుకు ఈ రెండు సంస్థలు విధించిన షరతుల ఫలితంగా పాలకులు సరళీకరణ ఆర్థిక విధానాల వైపు మళ్లడమే కాకుండా, రూపాయి విలువ తగ్గించడం జరిగింది. ఎగుమతులను చౌకగా మార్చివేశారు. ఈ సందర్భంగానే ఒక పూట భోజనం మానుకోమని ప్రధాని శాస్త్రి ప్రజలకు పిలుపు ఇచ్చారు. శ్వేత (పాల ఉత్పత్తి) విప్లవం పేరుతో అమూల్ మిల్క్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. శాస్త్రి 1966 జనవరి 11న మరణించారు.
ఇందిరాగాంధీ... విదేశీ పెట్టుబడులు
ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జారీలాల్ నందా ప్రమాణం చేసిన కొద్ది రోజుల తర్వాత 1966 జనవరి 24న ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఉన్న దిగుమతి సుంకాలు, ఎగుమతి సబ్సిడీల వ్యవస్థను రద్దు చేసింది. ప్రభుత్వం అనుసరించిన విధానం వలన పారిశ్రామిక మాంద్యం, సరళీకరణ, దేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ ప్రమేయంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. రాజకీయంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిన ఫలితంగా తిరిగి వాణిజ్య పరిమితులను విధించారు. 40% కంటే ఎక్కువ విదేశీ ఈక్విటీ భాగస్వామ్యంతో భారత దేశంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను పరిశీలించటానికి 1968లో విదేశీ పెట్టుబడుల బోర్డును స్థాపించారు. ఇందిరాగాంధీ ప్రధాని అయిన తర్వాత విదేశీ పెట్టుబడులు, పరిశ్రమల్లో వాటి వాటాలు పెరిగాయి. 1978 నుండి వ్యవసాయ ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం ప్రారంభమైంది. భారత ఆర్థిక వ్యవస్థ తూర్పు, ఆగ్నేయాసియా, పొరుగు దేశాల కంటే వెనకబడింది. ఇందిరాగాంధీ రష్యాపై ఎక్కువగా ఆధారపడుతూ అమెరికాతో బలమైన సంబంధాలు కొనసాగిస్తూ, ఆర్థిక సహాయం కోరటమే కాకుండా భారత పరిశ్రమల్లోకి పెట్టుబడులు ఆహ్వానించింది. 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు.
రాజీవ్‌గాంధీ.. సరళీకరణ దారులు
ఇందిరా గాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్ 31న ప్రధాని అయ్యారు. ఈ కాలంలోనే అమెరికా నాయకత్వాన సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారీ దేశాలు ప్రపంచ ఆర్థిక సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టి అన్ని దేశాలు వాటిని ఆచరణలో పెట్టాలని వత్తిడి చేశాయి. రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరణ చేయడం ప్రారంభించారు. అందుకోసం సరళీకృత ఆర్థిక విధానాలు ప్రతిపాదించారు. ఈ విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రైవేట్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ప్రకటించాడు. విదేశీ పెట్టుబడులకు, పరిశ్రమల్లో విదేశీ భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచాడు. గ్రామీణ, గిరిజన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. రాయితీలను ధనవంతుల అనుకూల విధానాలుగా ప్రజలు భావించారు. దిగుమతులకు పెద్దపీట వేశారు. 1991 ఫిబ్రవరి 12న రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు.
పీవీ, వాజ్‌పేయి... తలుపులు తెరిచేశారు
1991 జూన్ 21న పీవీ నరసింహారావు ప్రధానిగా ఎన్నికైనారు. ఆర్థిక సంక్షోభాన్ని నివారించే పేరుతో సంస్కరణలు చేయడం, విదేశీ పెట్టుబడులు తెచ్చే విధానాలు ప్రవేశపెట్టారు. అందుకు ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ, మౌలిక సదుపాయాలకు పెట్టుబడులు పెంచటం, విదేశీ రుణాలను స్థిరీకరించేటప్పుడు విదేశీ వాణిజ్యానికి భారతదేశం ద్వారాలు తెరవటం, భారత్ మార్కెట్లను విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు అనుమతించటం జరిగింది. వ్యవసాయ రంగాన్ని కూడా బహుళజాతి సంస్థల ఆధిపత్యానికి నిలయంగా చేసేందుకు డంకెల్ ప్రతిపాదనలపై సంతకం చేయటం, వ్యవసాయ ఒప్పందాన్ని ఆమోదించడం జరిగింది. 1996లో జరిగిన ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో మెజారిటీ సాధించి వాజ్పాయ్ ప్రధాని అయ్యారు. తిరిగి మార్చి 1999 మార్చి 19న మరోసారి ప్రధాన మంత్రి అయ్యారు. ఆయన కూడా పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలనే అమలు జరిపారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే విధానాలు చేపట్టాడు. దేశ ఆర్థిక విధానాలను సమూలంగా మార్పు చేసే దిశగా స్వేచ్ఛా వాణిజ్యానికి సంస్కరణలను ప్రోత్సహించారు.
మన్మోహన్... పీఎస్‌యూల అమ్మకాలు
2004, 2009లో జరిగిన ఎన్నికల్లో యూపీఏ కూటమి మెజారిటీ సాధించి నాటకీయంగా మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యాడు. ఆయన పాలనలో సరళీకరణ విధానాలు, ఆర్థిక సంస్కరణలు వేగంగా జరిగాయి. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, అమ్మి వేయడం, లేదా మూసివేయడం జరిగింది. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడుల వాటాలు బాగా పెరిగాయి. బహుళజాతి సంస్థలకు ద్వారాలు బార్లా తెరిచారు. వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేశారు.
నరేంద్ర మోడీ... శరవేగంగా సంస్కరణలు
2014, 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ సాధించి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాడు. జాతీయత, జాతీయ విధానం జపం చేసిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టి సరళీకరణ, ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడుల జపం మొదలు పెట్టింది. రక్షణ రంగంతో సహా ప్రభుత్వ రంగ సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులకు అనుమతించింది. కొన్నింటిలో నూటికి నూరు శాతం అవకాశం కల్పించింది. ప్రభుత్వరంగ సంస్థలను, ఆస్తులను అమ్మకానికి పెడుతున్నది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీల కట్టబెట్టే విధానాలు ప్రవేశపెట్టే విధంగా మూడు వ్యవసాయ చట్టాలను చేసింది. తీవ్ర వ్యతిరేకత రావటంతో వాటిని ఉపసంహరించుకోవడం జరిగింది. బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసం కార్మిక హక్కులను హరించే విధంగా 44చట్టాలను 4చట్టాలుగా చేసింది.
ప్రజావ్యతిరేక సంస్కరణలు
దేశానికి ‘ స్వాతంత్య్రం' వచ్చిన దగ్గర నుండి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న విదేశీ పెట్టుబడులను ఆహ్వానించటం, సరళీకరణ విధానాలు అమలు జరపడం, ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టడం సామ్రాజ్యవాదుల, బడా పెట్టుబడిదారుల, భూస్వాముల ప్రయోజనాలను కాపాడే విధానాలు అమలు జరుపుతూ వచ్చాయి. మోదీ ప్రభుత్వం, గత ప్రభుత్వాల కన్నా అత్యంత వేగంగా వీటిని అమలు చేస్తున్నది. దేశ ప్రజల ప్రయోజనాలకు ప్రమాదకరమైన విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్మించటమే నేడు ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.
బొల్లిముంత సాంబశివరావు
రాష్ట్ర కార్యవర్గ వర్గ సభ్యులు
రైతు కూలీ సంఘం (ఆం.ప్ర)
98859 83526