ఉమ్మడి ఆదిలాబాద్‌లో...ప్రత్యర్థులు ఏకం.. గెలుపెవరిదో!?
In Adilabad... Rivals have united... Who will win the Telangana Assembly Elections?
గత ఎన్నికల నాటి రాజకీయ ప్రత్యర్థులు.. నేడు ఒక్కటవుతున్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు వేరువేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించిన వారు.. ఇప్పుడు ఒకే పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. బరిలో ఉంటున్న వారికి మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు టికెట్లు దక్కక పార్టీలు మారుతున్న నాయకులతో రోజురోజుకు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. గెలుపోటములు తలకిందులయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మనకు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
బీజేపీలో ‘బాపురావు’ ద్వయం
ప్రస్తుత బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఎంపీ, బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు గత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు. 2018 లో అసెంబ్లీ ఎన్నికల్లో రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ తరఫున బరిలో దిగగా, సోయం బాపురావు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. ఆ ఎలక్షన్స్‌లో రాథోడ్ బాపురావుకు 61,125 ఓట్లు రాగా, సోయం బాపురావుకు 54,639 ఓట్లు వచ్చాయి. కేవలం 6,486 ఓట్లతో సోయం బాపురావు ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత ఆరు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రాగా, సోయం బాపురావు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే అది దక్కకపోవడంతో బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. అయితే బోథ్ ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపురావుకు బీఆర్ఎస్ అధిష్టానం ఇటీవల టికెట్టు నిరాకరించింది. దీంతో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే అప్పటికే బీజేపీ బోథ్ అభ్యర్థిగా సోయం బాపురావు పేరును ప్రకటించింది. దీంతో సోయం బాపురావు విజయం కోసం కృషి చేస్తానని రాథోడ్ బాపురావు ప్రకటించడం గమనార్హం. ఆ నాటి ప్రత్యర్థులు ఒక్కటవడంతో సెగ్మెంట్‌లో రాజకీయ పరిణామాలు మారిపోయాయనే టాక్ ఉంది.
ఒకే పార్టీలో ఉండటంతో..
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న కీలక ఆదివాసీ నాయకులు.. నేడు బీఆర్ఎస్‌లో చేరడంతో అక్కడ గులాబీ జెండా ఎగిరే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆత్రం సక్కు బరిలో ఉండగా, బీఆర్ఎస్ తరపున కోవ లక్ష్మి పోటీ చేశారు. ఆత్రం సక్కుకు 65,788 ఓట్లు రాగా, కోవలక్ష్మికి 65,617 ఓట్లు వచ్చాయి. దీంతో కేవలం 171 ఓట్లతో కోవలక్ష్మి ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అయితే ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆత్రం సక్కు గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత అధిష్టానం కోవలక్ష్మికి జడ్పీ చైర్ పర్సన్‌గా అవకాశం కల్పించింది. అయితే ఈ సారి ఆత్రం సక్కుకు టికెట్టు నిరాకరించి.. మళ్లీ కోవలక్ష్మికే పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని ఆత్రం సక్కుకు హామీ ఇచ్చినట్లు తెలియగా, ఆయన ఇప్పుడు కోవలక్ష్మి తరపున ప్రచారం చేస్తుండటం గమనార్హం. వీరిద్దరు 2014 ఎన్నికల్లోనూ ప్రత్యర్థులుగా ఉండగా, అప్పుడు కోవలక్ష్మి సుమారు 19వేల ఓట్లతో విజయం సాధించారు. ఆ సమయంలో టీడీపీ తరఫున బరిలో ఉన్న మర్సుకోల సరస్వతి సుమారు 25వేల ఓట్లు సాధించగలిగారు. అనంతరం ఆమె కాంగ్రెస్‌లో చేరగా, ఇటీవల ఆ పార్టీ టికెట్టు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ముగ్గురు ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉండడంతో ఆ పార్టీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ముధోల్‌లో ‘గులాబీ’కి బలం
ఉమ్మడి ఆదిలాబాద్‌లో బీజేపీ గెలిచే మొట్టమొదటి సెగ్మెంట్ ఏదీ అంటే ముధోల్ పేరే వినిపించేది. అయితే ఇప్పుడు ఇక్కడ రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. 2014, 2018 ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న జి. విఠల్ రెడ్డి, పడకంటి రమాదేవి ఇప్పుడు ఒకే పార్టీలో చేరిపోయారు. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విఠల్ రెడ్డి 63,322 ఓట్లు పొంది విజయం సాధించారు. బీజేపీ నుంచి పోటీ చేసిన రమాదేవి 48,485 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన విఠల్ రెడ్డి 2018లో కారు గుర్తుపై పోటీ చేశారు. అప్పుడు 83,703 ఓట్లు సాధించగా, బీజేపీ నుంచి పోటీ చేసిన రమాదేవి 40,339 ఓట్లు పొంది రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే ఈ సారి బీజేపీ రమాదేవికి టికెట్టు నిరాకరించింది. ఆమె స్థానంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన రామారావు పటేల్‌కు టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తితో రమాదేవి బీజేపీని వీడారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. విఠల్ రెడ్డి విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. దీంతో దశాబ్ద కాలంగా ప్రత్యర్థులుగా ఉన్న విఠల్ రెడ్డి, రమాదేవి ఒకే పార్టీలో చేరడంతో బీఆర్ఎస్‌కు మరింత బలం వచ్చినట్లయింది. మరోవైపు 2018 ఎన్నికల్లో రమాదేవికి 40,339 ఓట్లు రాగా, కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న రామారావు పటేల్‌కు 36,396 ఓట్లు మాత్రమే వచ్చాయి. రమాదేవి కంటే తక్కువ ఓట్లు వచ్చిన రామారావు పటేల్‌కు బీజేపీ టికెట్ కేటాయించడంతో పార్టీ కేడర్ నుంచే తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఒకే పార్టీలో రాథోడ్ – సోయం
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న రాథోడ్ రమేశ్, సోయం బాపురావు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా వీరికి అనుచరగణముండగా.. ఇప్పుడు ఒకరు బోథ్ నుంచి, మరొకరు ఖానాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన సోయం బాపురావు 3,77,374 ఓట్లు రాబట్టగలిగారు. అయితే కాంగ్రెస్ తరపున అప్పుడు బరిలో ఉన్న రాథోడ్ రమేశ్ 3,14,238 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు వీరిద్దరూ ఒకే పార్టీలో ఉండడంతో ఆ పార్టీకి ప్లస్ అవుతుందనే చర్చ జరుగుతున్నది.
ప్రత్యర్థులే దోస్తులుగా..
నిర్మల్ నియోజకవర్గంలో 2018లో ప్రత్యర్థులుగా ఉన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మహిళా నేత అయిండ్ల స్వర్ణారెడ్డి.. ఇప్పుడు ఇద్దరూ బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. గత ఎన్నికల్లో చెన్నూరులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వెంకటేశ్ నేత (ప్రస్తుతం ఎంపీ), ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇద్దరూ ‘కారు’లోనే ప్రయాణిస్తున్నారు. అయితే ఇక్కడ ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితే ప్రశ్నార్థకంగా మారుతున్నది. అప్పటి వరకు తమ నాయకుడు, తమ పార్టీ అంటూ పబ్లిక్‌లో ఉన్న సెకండ్ కేడర్ లీడర్స్.. ఇప్పుడు నేతలు పార్టీ మారుతుండడంతో వారి వెంట వెళ్లాలా వద్దా అనే డైలామాలో ఉన్నట్లు తెలుస్తోంది.
-ఫిరోజ్ ఖాన్
సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
96404 66464