సొంత టీమ్ చేతిలో ఇమ్రాన్ క్లీన్ బౌల్డ్
మాజీ క్రికెటర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ని అక్కడి మిలిటరీ బలవంతంగా అరెస్ట్ చేసి లాక్కెళ్లడం తాజా ఉదంతం.
మాజీ క్రికెటర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ని అక్కడి మిలిటరీ బలవంతంగా అరెస్ట్ చేసి లాక్కెళ్లడం తాజా ఉదంతం. కోర్టు ఆవరణలోనే వేరే కేసు సందర్భంగా హాజరైన ఆయన్ని పారా మిలిటరీ ట్రూపుల్ని వినియోగించి అవమానకరంగా ఎత్తుకుపోవడం అక్కడి పాలనా విధానానికి నిదర్శనమే కానీ ఆశ్చర్యకరం కాదు. అందుకే ఆయన 'అన్యాయం అన్యాయమ'ని గొంతు చించుకున్నా లాభం లేకపోయింది. క్రికెట్ భాషలో చెప్పాలంటే ఆయన సొంత టీమే ఆయన ఔట్ కాకపోతే బలవంతంగా వికెట్ లాగేసినట్టు. బయటకు తోసేసినట్టు. అక్కడ అంపైర్ అయినా, థర్డ్ అంపైర్ అయినా సైన్యమూ, ఐఎస్ఐ మాత్రమే. న్యాయస్థానమూ, పౌరసమాజమూ బలంలో కేవలం నామమాత్రం. సైన్యమూ, ఐఎస్ఐ సహకారంతోనే గతంలో ప్రధాని కాగలిగిన ఇమ్రాన్ తరువాత వారి అభిమానానికి దూరం అయ్యాడు.
2018లో ప్రధాని కాగలిగిన ఆయన గడువు ముగియకుండానే పదవీచ్యుతుడయ్యాడు. అప్పటినుండీ ఆ రెండు బలమైన అధికార కేంద్రాలకీ వ్యతిరేకంగా విమర్శలు చేసాడు. ఫలితంగా వందకు పైగా కేసులు ఆయనపై వచ్చి పడ్డాయి. ఒకసారి హత్యాప్రయత్నం నుంచి బయటపడ్డాడు. ఏ క్షణమైనా అరెస్టు కాగలనని చెప్తూనే వచ్చాడు. అందరూ ఊహించింది కూడా అదే. ఇప్పుడు అక్కడి న్యాయస్థానాలు ఆయన అరెస్టుపై ప్రశ్నిస్తున్నప్పటికీ అవి అంతకుమించి ఏమీ చెయ్యలేవు. అక్కడి పాలనపై మిలిటరీ, ఐఎస్ఐ పట్టు అలాంటిది. ఆర్ధికంగా దివాళా అంచున ఉన్న ఆ దేశం వచ్చే యేడు ఎన్నికలకు వెళ్లబోతుంది. రాజకీయ,సామాజిక అంశాలను ఎప్పటిలాగే సైన్యం శాసించబోతోంది. ఇలాంటప్పుడే మనదేశంలో పాలనావిధానం, రాజ్యాంగం ఎంత గొప్పవో మరోసారి తెలిసేది.
డా. డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ
94408 36931