ఆత్మీయ అనుబంధానికి ప్రతీక..
రాఖీ పౌర్ణమి రోజున సోదరి కట్టే రక్షలో అసాధారణ శక్తి ఉందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందుకే దీనిని రక్తసంబంధీకులే కాకుండా ఆత్మీయుల
రాఖీ పౌర్ణమి రోజున సోదరి కట్టే రక్షలో అసాధారణ శక్తి ఉందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందుకే దీనిని రక్తసంబంధీకులే కాకుండా ఆత్మీయుల అనుబంధానికి పరస్పర సహకారానికి చిహ్నంగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున అక్కా చెల్లెళ్లు తమ అన్న తమ్ముళ్లు మహోన్నత శిఖరాలకు ఎదగాలని సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తూ రక్ష కడతారు. సాంప్రదాయం ప్రకారం ఆడపడుచులు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకొని కొత్త బట్టలు కట్టుకొని రాఖీలను పూజించి పుట్టింటికి వెళ్లి మధ్యాహ్న సమయంలో రాఖీలు కట్టాలని గర్గుడు అనే మహర్షి ఉద్భోదించాడు.
పురాణ కథలు..
శ్రీకృష్ణుని మేనత్త కొడుకు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు పట్టరాని కోపంతో తన విష్ణు చక్రాన్ని శిశుపాలునిపై ప్రయోగించి తలను నరికి వేస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుని వేలికి గాయమవుతుంది. పరివారమంతా అటు ఇటు వెతుకుతుండగా అప్పుడు ద్రౌపది తన పట్టు చీరను చింపి శ్రీకృష్ణుని వేలికి రక్ష కడుతుంది. నాకు రక్ష కట్టావు కాబట్టి నీకు కష్టం వస్తే నిన్ను నేను కాపాడుతానని మాట ఇచ్చాడు. అందుకే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదికి రక్షణగా నిలిచాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటనే రక్షాబంధన్ పండుగకు ఆధారమైంది. ఇదే కాక దేవదానవ యుద్ధంలో భయపడి అమరావతిలో తలదాచుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుని భార్య శచీదేవి శివపార్వతులను, లక్ష్మీనారాయణులను పూజించి ఆ రక్ష తెచ్చి ఇంద్రుని చేతికి కట్టింది. ఇంద్రుడు యుద్ధంలో గెలిచి త్రిలోకాధిపత్యాన్ని పొందాడు. అప్పటినుండి అందరికీ రక్ష పైన ఇంకా ఎక్కువ నమ్మకం ఏర్పడింది. గ్రీకు రాజు అలెగ్జాండర్ పురుషోత్తమునిపై దండెత్తగా తన ధైర్య సాహసాలను గుర్తించిన అలెగ్జాండర్ భార్య రుక్సానా తన భర్త క్షేమం కోరి పురుషోత్తముని శరణు వేడి రాఖీ కడుతుంది. రుక్సానాను సోదరిగా భావించిన పురుషోత్తముడు అలెగ్జాండర్ ఓడిపోయినా అతన్ని చంపకుండా వదిలేశాడు.
అందరి మధ్య సఖ్యత ఏర్పడటానికి..
పూర్వకాలంలో వివిధ రకాల యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి అందుకే స్త్రీలు వీరులైన యోధులను గుర్తించి వారికి రక్ష కట్టి వారు చూపే సోదర భావంతో రక్షణ పొందేవారు. శ్రీరామునికి శాంత, శ్రీకృష్ణునికి సుభద్ర, దైవిక చెల్లెలు ద్రౌపతి, ఇలా పురాణాల్లో మనకు కనిపిస్తారు. శివపార్వతులు, రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణలు భార్యాభర్తల ప్రేమకు ప్రేయసి ప్రియుల బంధానికి ఎంత విలువనిచ్చారో మన ఋషులు అంతే గొప్పతనాన్ని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి కూడా ఆపాదించారు. అన్నాచెల్లెళ్ల అపురూప బంధానికి ప్రత్యేకంగా నిలిచిన రక్షాబంధన్‌ను దేశవ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఏమైనా పొరపొచ్చాలు ఉన్నట్లయితే ఈ పండగ ద్వారా అన్ని తేటతెల్లమైపోతాయి. అందరి మధ్య సఖ్యత ఏర్పడడానికి ఐక్యతకు మంచి వారధి ఈ రక్షాబంధన్.
(రేపు రక్షాబంధన్ సందర్భంగా)
- కొమ్మాల సంధ్య
91540 68272