పౌరసత్వ చట్టం సబబే!
Implementation of Citizenship Amendment Act in India is correct
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం ఎందుకు వివాదాస్పదమైందో అర్థం కావడం లేదు. తరతరాలుగా పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ దేశాలలో మైనారిటీలు చాలా బాధలకు గురవుతున్నారు. వారి స్వేచ్ఛకు ఆటంకం కలుగుతోంది. హక్కులు అనుభవించలేకపోతున్నారు. ఈ దిశలో భారత్ వారిని అక్కున చేర్చుకోవటంలో తప్పేముంది?
మానవతా దృక్పధంతోనే ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టం చేసింది. ఆయా దేశాల్లో మైనారిటీలుగా ఉన్న వారి బాధలు, ఇక్కట్లు చూడలేక వాళ్ళకు భారత పౌరసత్వం ఇవ్వడానికి చట్టం చేసింది. నిజంగా ఇది అభినందించాల్సిన అంశమే. అలాగే ఈ చట్టంలో ముస్లింలకు కూడా అవకాశం కల్పించి ఉంటే బాగుండేది. భారత పౌరసత్వం తీసుకోవడంలో వాళ్ళని తప్పించటం ఒకటే ఈ చట్టంలో లోపం. అనేక కారణాల వలన ఆయా దేశాలకు వెళ్లిన క్రైస్తవులు, బౌద్ధులు, పార్శిలు, హిందువులు తిరిగి భారత్‌లో కలవటం ముదాహవమే. భారత్‌లో ఉండే మతసహనం, స్వేచ్ఛ వారికి నచ్చి భారత పౌరసత్వం పొందుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం గమనించే వారికి న్యాయం చేసింది. ముస్లింలు వాళ్ళ మత స్వేచ్ఛకు అనుగుణంగానే ఆయా దేశాలలో ఉన్నారు. వారికి వచ్చిన ముప్పేమీ లేదు. ముఖ్యంగా హిందువులు, క్రైస్తవులు వివక్షకు గురి అవుతున్నారు. హిందూ, లేదా క్రైస్తవ అమ్మాయిలను బలవంతంగా వివాహం చేసుకోవడం, ఎత్తుకు పోవడం వివిధ ప్రసార, ప్రచార మాధ్యమాల్లో చూస్తున్నదే. దాంతో వాళ్ళు ఆ దేశాలను విడిచి భారత్ చేరుకుంటున్నారు.
మైనారిటీలకు క్రీడల్లోనూ చోటు లేదు
ఇదొక్కటే కాదు, ఆయా దేశాల్లో మైనారిటీలకు చెందిన ఒక్కరు కూడా క్రీడల్లో లేకపోవడం చూస్తున్నదే. పాక్‌లో గతంలో ఓకే హిందువు డానీష్ కనేరియా మాత్రమే ఆ దేశ క్రికెట్ జట్టులో ఉన్నాడు. తర్వాత మరో హిందువు కానీ, క్రైస్తవులు కాని జట్టులో లేరు. మరి అక్కడ మత స్వేచ్చ ఏమైంది ఆ బాటలోనే బంగ్లా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో ఒక్క హిందువు కానీ క్రైస్తవుడు కాని కనపడరు. బంగ్లాలో లిటన్ దాస్, సౌమ్య సర్కార్ మాత్రమే మినహాయింపు. పాక్‌లో ఈ మధ్య కాలంలో ఎవరూ అగుపడటం లేదు. అంటే వాళ్ళలో ప్రతిభ ఉన్నా, అక్కడి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయన్నది నిజం కాదా?
ప్రతిభకు పట్టం కడుతున్న భారత్
భారత్‌లో అటువంటి వివక్ష ఏమీ లేదు. అన్ని మతాలకు చెందిన క్రీడాకారులూ ప్రతిభ ఉంటే వెలుగులోకి వస్తున్నారు, వారిని ప్రోత్సహిస్తున్నారు. క్రీడలలో మనం ఇది చూస్తున్నదే. ఆటలలోనే ఈ విధంగా చిన్న చూపు ఉంటే, ఇక వారి హక్కులకు అక్కడి దేశాలు ఏ మాత్రం విలువ, గౌరవం ఇస్తున్నాయి భారత్‌లో మత స్వేచ్ఛ, మత సహనం, సామరస్యం ఇక్కడ ప్రధానం. అన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటారు, వారి, వారి ప్రార్ధనా స్థలాలకు కూడా వెళతారు. కొన్ని కట్టుబాట్లతో వాళ్ళ ఇష్టా ఇష్టాలను హరించి వేశారు. అది తాళలేకనే చాలా మంది భారత్ వైపు చూశారు, భారత్ లోకి వచ్చారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం గమనించి వారి ప్రయోజనాలను కాపాడాలి, వారి హక్కులకు భంగం వాటిల్ల కూడదని వారికి భారత్‌లో ఉండటానికి, ఆస్తులు కొనుగోలు చేయటానికి, స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టం తెచ్చింది. ఇందులో భయపడవలసిన విషయం ఏముంది?
సీఏఏ ఎన్నికల స్టంట్ కాదు
మన భారతీయులు ఎంతో మంది ప్రస్తుతం వివిధ దేశాలలో పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి పౌరసత్వం రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ మనదేశంలో నిర్దిష్టంగా కొన్ని సంవత్సరాలు నివాసం ఉంటే వారికి భారత పౌరసత్వం ఇస్తున్నారు, అటువంటిదే ఈ సిటిజెన్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ). ఇది ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అది వాటికి మాములే. వివిధ సంస్కరణలు చేయమంటారు, చేస్తే గగ్గోలు పెడతారు. 370 ఆర్టికల్‌పై అదే విధంగానే విమర్శ. కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ విమర్శలు సహించి దీన్ని అమలు చేసింది. కానీ ప్రతిదానికి అడ్డు చెప్పటం కొన్ని పార్టీలకు అలవాటే. ఏది ఏమైనా పౌరసత్వ చట్టం వీగిపోదు. భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న ప్రతివారికి ఇది ఆనందాన్ని ఇచ్చే విషయమే. భారత పౌరసత్వం పొందబోతున్నాం అని వారి కళ్ళల్లో సంతోషాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు వారు కూడా మన భారత పౌరులే.
- కనుమ ఎల్లారెడ్డి
టెక్సాస్, అమెరికా
93915 23027