ఆర్థిక సంక్షోభానికి మూలం!
Impact of Natural Disasters on Indian Economic Growth
దేశంలో ఆకలి సంక్షోభం పెరిగింది. అన్నార్తులు పెరిగిపోయారు. వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది. ప్రధానంగా మనిషి ఏ ప్రకృతి నుండి జన్మించాడో ఆ ప్రకృతిని రక్షించుకోలేక సంక్షోభంలో ఇరుక్కున్నాడు. ప్రపంచం మొత్తం ఈనాడు వాతావరణ విధ్వంసంలో చిక్కుకుపోయింది. 140 కోట్లకు పైబడిన జనాభాలో పోషకాహారం పొందగలిగే స్తోమత లేనివారి సంఖ్య... దాదాపు 76.1 శాతం. అంటే ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు సమతుల ఆహారాన్ని అందిపుచ్చుకోలేనంతగా ఆర్థిక అగచాట్లలో నలిగిపోతున్నారు. 2019 తో పోలిస్తే 2021 నాటికి భారతదేశంలో ఇటువంటి నిరుపేదలు ఇంకా అధికమయ్యారు. వివిధ ఐరాస సంస్థల సంయుక్త అధ్యయనంలో ఇటీవల వెలుగు చూసిన చేదు వాస్తవాలివి! ఇకపోతే సామాజిక విశ్లేషకులు భారతదేశంలో వాతావరణ సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నారు.
విపత్తులతో లక్షల కోట్లు నష్టం
భూమి మరింతగా వేడెక్కిపోతుంది. అడవులు అన్నీ దొంగ కలపలు రవాణా చేసే స్మగ్లర్‌ల వల్ల విధ్వంసం అవుతున్నాయి. అందువల్ల గాలిలో తేమ లేదు. గాలిలో తడి తగ్గే కొద్దీ మనుషుల్లో జీవ శక్తి తగ్గుతుంది. మనుషులు విషవాయువులతో రోగగ్రస్తం అవుతున్నారు.. పౌష్టిక ఆహారం బాగా తగ్గిపోతున్నది. పాలు, పండ్లు, కూరగాయలు, పప్పులు తినే కొనుగోలు శక్తి లేక శారీరక మానసిక శక్తులను కోల్పోతున్నారు. ఇకపోతే తుఫానులు, వరదలు ఎర్రటి ఎండలు, వడగాల్పులు, కరువు కాటకాల వంటి వాటి ఉధృతి నేడు మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆయా విపత్తుల దాటికి 1991 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా రైతన్నలకు 3.8 లక్షల కోట్ల డాలర్ల దాకా నష్టం వాటిల్లింది. ఈ మేరకు సాగు రంగం, పశుగణాలపై ప్రకృతి వైపరీత్యాల దుష్ప్రభావాలు మదింపు వేసిన ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తాజా నివేదిక తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. వ్యవసాయ ప్రధాన దేశమైన ఇండియా ప్రాకృతిక ఉత్పాతాలకు భారీగానే మూల్యం చెల్లించుకుంటోంది. ఒక్క కరవుల వల్లే 1998-2017 నడుమ భారతదేశ జీడీపీ రెండు నుంచి అయిదు శాతం మేర తరుగు పడినట్లు ఐరాస అధ్యయనం నిరుడు స్పష్టం చేసింది. తుఫానులు, వరదల కారణంగా 2021లో భారత్ దాదాపు 760 కోట్ల డాలర్లను కోల్పోయింది. గత ఏడాది తొలి తొమ్మిది నెలల్లో దేశీయంగా దాదాపు 54 లక్షల ఎకరాల్లో ఫలసాయాన్ని ప్రకృతి విపత్తులే విధ్వంసం చేశాయి.
భూగోళం ఓ ఉష్ణగుండం
వాతావరణ మార్పుల ముట్టడిలో చిక్కిన భూగోళం పోను పోను ఉష్ణగుండాన్ని తలపిస్తోంది. ఫలితంగా తీవ్రతరమవుతున్న వడగాడ్పులు అటు ప్రజల ప్రాణాలను, ఇటు వ్యవసాయ దిగుబడులను హరిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా గత రబీ కాలంలో హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో గోధుమ ఉత్పత్తులు తెగ్గోసుకుపోయాయి. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందడం ప్రజల ప్రాథమిక హక్కు. ఆ మేరకు జన జీవన ప్రమాణాలను పెంపొందించి, ప్రజారోగ్య స్థాయిలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యంగా 47 వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. దాన్ని అమలుపర్చడంలో ప్రభుత్వాల వైఫల్యమే జన భారతాన్ని గిడసబారుస్తోంది. సరైన తిండికి దూరమై నానా రోగాల పాలై దేశీయంగా ఏడాదికి 17 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని పరిశోధనలు చాటుతున్నాయి. పోషకాహార లోపం ప్రబలుతున్న కొద్ది ప్రజల ఉత్పాదక శక్తి సన్నగిల్లుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.
గాలి, నీరు కూడా కల్మషమే!
పీల్చే గాలిలో కల్మషం ఉన్నంత కాలం భారతదేశంలోని ప్రజలకు ఆరోగ్య భద్రత లేదు. గాలి, నీరు, కల్మషం చేస్తున్నది ఎవరు పాలక వర్గాలు. అన్ని నదుల్లోని ఇసుకను తోడి అమ్ముకుంటున్నారు. నదులు నదీ ప్రవాహాలు కుంటుపడుతున్నాయి. కొండలు త్రవ్వి గ్రానైట్‌ను అక్రమ రవాణా చేస్తున్నారు. దాని వల్ల భూమి శక్తి తగ్గిపోతుంది. చెట్లు విపరీతంగా నరకడం వల్ల మేఘాలు ఏర్పడడం లేదు. భూతల శీతల వాతావరణం వేడెక్కిపోతుంది. అక్టోబర్‌లో కూడా 40 నుండి 47 వరకు ఉష్ణోగ్రతలు వుండడం వలన మనుషులు ఉక్కపోతతో దిక్కులేని స్థితిలో జీవిస్తున్నారు. సూర్యుణ్ణి దేవతగా పూజించే ఈ జనం మండుతున్న సూర్యుణ్ణి చూసి పరుగులు తీస్తున్నారు. అనేక వైరుధ్యాలు మనుషులను వెంటాడుతున్నాయి. దానికి ప్రకృతి ఒక కారణం అని తెలుసుకోలేకపోతున్నారు. దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే పరిశ్రమలు, వ్యవసాయ భూమి విస్తరణ తగ్గిపోతున్నాయి. వ్యవసాయ కూలి వ్యవసాయదారుడు గా మారడం లేదు. కూలి గ్రామంలో దొరకక వలస కూలీగా మారుతున్నారు. దానితో కొన్ని గ్రామాలు వృత్తులకు నిలయంగా మారిపోయినాయి. వృద్ధులకు సంరక్షణ లేక ఉసూరుమంటూ జీవిస్తున్నారు. ఊరిలో శుభ్రత లేక దోమల కాటుతో విషజ్వరాల వలయంలో గ్రామీణ భారతం విలవిలలాడుతుంది.
తలెత్తుకుంటున్నామా.. దించుకుంటున్నామా?
నిజానికి ఈనాడు భారతదేశ సౌభాగ్యం అంతరిస్తూ పోవడానికి కారణం పంటలు ఎండిపోవడం. పంటలు ఎండిపోవడానికి కారణం నదులు శుష్కించడం, నదులు శుష్కించడానికి కారణం పాలక వర్గాలు ఆనకట్టలను సరైన కాలాలలో పూర్తి చేయకపోవడం. దేశ ఆర్థిక సంపద రాజకీయ పార్టీల బొక్కసాలలోకి వెళ్లడం. మద్యం వ్యాపారులు రాజకీయ నాయకులు కావడం. సకాలంలో వర్షాలు కురిసే వాతావరణాన్ని పునరుజ్జీవింపజేసుకోవలసిన బాధ్యత పాలకవర్గం మీద వుందని జనం గ్రహించడం లేదు. నిజానికి ప్రపంచం ముందు తలదించుకునే పరిస్థితిలోకి భారతదేశం నెట్టబడుతుంది. కారణం వ్యక్తి స్వార్థం పెరగడం. వ్యక్తి సామాజిక బాధ్యత పెరిగితేనే దేశం సుసంపన్నం అవుతుందని అంబేడ్కర్ చెప్పారు. బహుముఖంగా పితృస్వామ్య వ్యవస్తీకృతమైన భారతదేశంలో భూమిని, పంటని, నీటిని, మొక్కని రక్షించుకొనే పునరుజ్జీవనోద్యమం అంబేడ్కర్ రాజ్యాంగ స్పూర్తితో మళ్ళీ వెలుగెత్తినపుడే దేశం తలెత్తుకు తిరిగే రోజు వస్తుంది. ఒలింపిక్స్‌లో బంగారు పతకాలే కాదు ప్రపంచ దేశాల ఆర్థిక నమూనా, అంచనాల పట్టికలో కూడా మనం మొదటి వరుసలో నిలబడగలుగుతాం ఆ వైపు పయనిద్దాం...
డా. కత్తి పద్మారావు
ప్రముఖ కవి, సామాజిక ఆర్థిక వేత్త
98497 41695