దిక్కుతోచక.. దిక్కుమాలిన కేసులు!
Illegal cases against Chandrababu because not a single case has been proved till date
అక్రమ కేసులకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ కార్యాలయం అడ్డాగా మారింది. జగన్ జేబు సంస్థగా మారిన సీఐడీ పోలీసులు ప్రతిపక్షనేత చంద్రబాబుపై కేసులు పెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుపై సీఐడీ పోలీసులు అక్రమ కేసులు పెట్టడం తారస్థాయికి చేరింది. అధికార పార్టీ ఫిర్యాదు చేయడమే ఆలస్యం విచారణ లేకుండా చంద్రబాబును వేధించడమే లక్ష్యంగా ఫిర్యాదుపై విచారణ చేయకుండా కేసులు నమోదు చేస్తున్నారు. జగన్ పాలనలో రాక్షస రాజకీయం కోరలు చాచింది. చంద్రబాబుపై ఆధారాలు లేని తప్పుడు కేసులు వేసి న్యాయస్థానాలను ఆట స్థలాలుగా మారుస్తున్నారు. అవినీతి బురదలో పొర్లిన వారికి శుభ్రంగా వున్నవాడు నచ్చడట. తనకంటిన అవినీతి బురదని చంద్రబాబుకి పులిమి దోషిగా నిలబెట్టేందుకు అలుపెరుగకుండా అక్రమ కేసులు పెడుతున్నారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నుండి విజయమ్మ వరకు అ.ని.శా కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు ఎన్నో కేసులు, సభా సంఘాలు వేసి వేధించాలని చూసినా ఎక్కడా ఆరోపణలు రుజువు చేయలేకపోయారు.
చంద్రబాబు రూ. 6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని పుస్తకాలు వేసి పంచి పెట్టారు. ఐదేళ్లు కావస్తున్నా ఆరు పైసలు అవినీతి నిరూపించలేకపొయ్యారు. అధికారంలో ఉన్నాం ఏదైనా చేస్తాం, ఏదైనా మాట్లాడతాం అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న సమస్త విధానాలు అప్రజాస్వామికమైనవే కాదు. అనాలోచితమయినవి, అసంబద్దమైనవి, నిరంకుశమైనవే, కక్షపూరితంగా కేసుల్లో పస లేకున్నా తాడూ బొంగరం లేని అలుపెరుగని అక్రమ కేసులు పెడుతూ చంద్రబాబును ఏదో చెయ్యాలని ఎన్నికల ముందు సీఎం జగన్ అనుసరిస్తున్న వ్యూహంగా కనిపిస్తుంది.
వేధింపే లక్ష్యంగా...
చంద్రబాబును వేధించడమే లక్ష్యంగా జగన్ సర్కారు మరిన్ని కేసులు సిద్ధం చేస్తోంది. దీని కోసం అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని, కొన్ని బృందాలు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నాయని సమాచారం. చంద్రబాబుపై సీఐడీ విభాగం ఇప్పటికే 6 కేసులు నమోదు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబును ప్రజా క్షేత్రంలోకి రాకుండా అడ్డుకునేందుకు వరుస కేసుల వ్యూహం రచించినట్లు అర్ధం అవుతుంది. అమరావతి భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవల్‌పమెంట్, ఫైబర్ గ్రిడ్, మద్యం, ఉచిత ఇసుక కూడా స్కామ్ అంటూ ఒకదానివెంట ఒకటి కేసులు నమోదు చేస్తోంది. ఇందులో స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి రిమాండుకు పంపించిన ప్రభుత్వం ఆ తర్వాత కూడా కేసులపై కసరత్తు ఆగలేదు. ఇవి కాక మరో మూడు నాలుగు కేసులు తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. వీటిలో నీరు- చెట్టు పనులు, ఉపాధి హామీ పథకం పనులు, కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులపై కేసులు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నీరు-చెట్టు పనుల్లో అక్రమాలు జరిగాయని ఒప్పుకోవాలంటూ సంబంధిత సిబ్బందిపై కొన్ని నెలలుగా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఉపాధి పథకం పనులపైనా రంధ్రాన్వేషణ చేస్తున్నారు. నిజానికి... నీరు-చెట్టు, ఉపాధి పనులు చేసిన వారిపై జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగింది. చంద్రబాబుపై మరో పది కేసులు పెడతామని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అంటున్నారు. అమరావతి భూములపై మొదలైన చిత్ర,విచిత్ర కేసుల పరంపర ఉచిత ఇసుక పాలసీ దాకా వచ్చింది. కేసుల్లో ఫిర్యాదుదారులంతా జగన్ రెడ్డి సొంత సామాజిక వర్గీయులే. కానీ జగన్ రెడ్డి పెడుతున్నకేసుల్లో తన సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారులకు మాత్రం మినహాయింపు ఇస్తూ వారిని కాపాడుకుంటూ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబును మాత్రం నిందితుడుగా అక్రమ కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారు. నేను కులం చూడను, మతం చూడను, రాజకీయాలు చూడను, కక్షసాధింపుల చర్యలు ఉండవు, అధికారాన్ని బాధ్యతగా భావిస్తాం అంటూ సుద్దులు చెప్పిన పెద్ద మనిషి నేడు చేస్తున్నది ఏమిటి? అమరావతి అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డుపై ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదుపై కేసు. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో ఆ కార్పొరేషన్ ఎండీ కె.అజయ్ రెడ్డి ఫిర్యాదుపై కేసు, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన రెడ్డి ఫిర్యాదుపై ఫైబర్‌నెట్ కేసు, ఏపీఎస్‌బీసీ ఎండీ వాసుదేవ రెడ్డి ఫిర్యాదుతో మద్యం పాలసీపై కేసు, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఫిర్యాదుపై ఇసుక పాలసీపై కేసు. ఈ విధంగా తన సామాజిక వర్గం వారితో ఫిర్యాదు చేయించి చంద్రబాబుపై కేసు పెట్టడం, ఆ కేసుల్లో తన సామాజిక వర్గం అధికారులు ఎవరూ వుండరు. వారికి మాత్రం మినహాయింపు ఇస్తారు. ఇది జగన్ రెడ్డి నైజం.
కక్ష సాధింపునకు వేరే మార్గం లేక...
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా నిర్బంధించిన చంద్రబాబుకి హైకోర్టు ఆరోగ్య కారణాల రీత్యా నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఈ తీర్పు వచ్చే ముందు రోజే మద్యం అక్రమాల కేసు నమోదు చేసిన సీఐడీ మళ్ళీ ఇసుక అక్రమాలంటూ మరో కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ2గా చేర్చింది. వీటికి ముందు పైబర్ గ్రిడ్, ఔటర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాలంటూ రెండు కేసులు నమోదు చేసింది. మరో 6 నెలల్లో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వరుస కేసుల పరంపర ఏ ఉద్దేశంతో కేసులు పెడుతున్నారో ఇప్పటికే ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. కేసులన్నీ సీఐడీ నమోదు చేయడం, ఇవన్నీ దాదాపు ఒకేలా ఉండటం. ఒకే సామాజిక వర్గం వారే ఫిర్యాదులు చెయ్యడం ఇవన్నీ చూస్తే చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలో భాగమేనని అర్ధం అవుతుంది. తన ప్రభుత్వాన్ని పాతాళంలో పాతర వెయ్యటానికి ప్రజలు సిద్ధపడిన పరిస్థితుల్లో దిక్కుతోచక చంద్రబాబుపై దిక్కుమాలిన కేసులు పెట్టి శునకానందం పొందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ సీఐడీకి ఫిర్యాదు చేసింది. దీంతో సీఐడీ వెంటనే చంద్రబాబుతో పాటు ఆయన హయాంలో పనిచేసిన మంత్రులు తమ చర్యల ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు చేసింది. చంద్రబాబు నాయుడుపై రోజుకో తప్పుడు కేసు పెడుతున్నారు. కక్షతో రగిలిపోతున్న జగన్ నైజం ఏంటో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థం అయింది.
ఐదేళ్లు కావస్తున్నా..
ఆనాడు తనకు పదవి ఇచ్చాడని కర్ణుడు దుర్యోధనుడికి తప్పుడు సలహాలు ఇచ్చి తప్పు దారి పట్టించి కౌర వంశాన్ని నాశనం చేసిన విధంగానే నేడు జగన్ సలహాదారు సజ్జల కూడా తప్పుడు సలహాలు ఇచ్చి జగన్‌ని నాశనం చేస్తున్నాడు. సజ్జల సలహాలతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి శునకానందం పొందుతున్నారు. సీఐడీ పోలీసులు ఈ విధంగా ఇష్టా రాజ్యంగా ముఖ్యమంత్రి మెప్పుకోసం చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం భావ్యం కాదు. జగన్ రెడ్డి ఆదేశాలు గుడ్డిగా అమలుచేసి సీఐడీ పోలీసులు చరిత్ర హీనులుగా మిగిలి పోరాదు. ఇప్పటికైనా సిఐడి వ్యవస్థ తీరు మార్చుకోవాలి. అలాగే ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు రూ 6 లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు ఉన్నాయని పుస్తకాలు వేశారు. మరి జగన్ సీఎం అయి ఐదేళ్లు కావస్తున్నా, అధికారం జగన్ రెడ్డి చేతుల్లోనే వున్నా చంద్రబాబు పై కానీ, ఆయన కుటుంబసభ్యులపై కానీ ఆరు రూపాయల అవినీతిని నిరూపించలేకపోయారు. దీనిని బట్టి జగన్ రెడ్డి చంద్రబాబుపై పెడుతున్న కేసుల్లో వాస్తవం ఎంతో సీఐడీ అర్థం చేసుకోవాలి. ప్రశ్నించే, విమర్శించే వారిపై పోలీసులు కేసులు పెట్టి వేధించడం వంటి చర్యలతో రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కాల రాస్తున్నారు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ ఈ విధమైన కక్ష సాధింపులతో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి వ్యవహరించలేదు. పోలీస్ వ్యవస్థను తమ వశం చేసుకొని మొత్తం వాళ్ళతోనే రాజ్యం నడుపుతున్నారు.
నీరుకొండ ప్రసాద్
98496 25610