బేరమాడకుండా కూరగాయలు కొంటేనే..రైతుకు లాభం చేసినట్టు!
ఈ రోజు కూరగాయల ధరలు ముఖ్యంగా టమాటో, ఉల్లిగడ్డ మిగతా కూరగాయల ధరలు కూడా 70 రూపాయల నుండి 100 రూపాయల వరకు పెరిగినాయి.
ఈ రోజు కూరగాయల ధరలు ముఖ్యంగా టమాటో, ఉల్లిగడ్డ మిగతా కూరగాయల ధరలు కూడా 70 రూపాయల నుండి 100 రూపాయల వరకు పెరిగినాయి. పంట ఎక్కువ దిగుబడి రాక, వర్షం ప్రభావానికి పంట చెడిపోయి మన అవసరాలకు సరిపోక ధరలు పెరిగాయి. అయితే తరచూ ఈ సమస్యలు మనం చూస్తూనే ఉంటాం. వింటూనే ఉంటాం. ఒక దగ్గర పంట ఎక్కువై దిగుబడి ఎక్కువ వచ్చి పంటలు పారబోస్తారు. ఒక దగ్గర పంట దిగుబడి రాక ధరలు ఆకాశానికి అంటుతాయి. పంటల ధరలు రైతుకు గిట్టుబాటు అయ్యే మార్గాలు, పంట నిల్వల మార్గాలున్నప్పటికీ మనం వాటిని వారికి అందించలేక విఫలమవుతున్నాం.
నిల్వ సౌకర్యం లేకనే కడగండ్లు
మనం నిత్యం తినే కూరగాయల ధరలు ఒక్కోరోజు ఒక్కో విధంగా ఉంటాయి. కొన్నిసార్లు సామాన్యుడు కొనలేని ధరలను మనం చూస్తున్నాం. ఒక ప్రాంతంలో రైతులందరూ ఒకే రకమైన పంటను పండించడంతో ఆ పంట దిగుబడి పెరిగి గిట్టుబాటు ధర ఉండదు. అటువంటి పరిస్థితుల్లో రైతులకు నష్టం జరుగుతుంది. రైతులందరూ ఆ పంట నష్టమొచ్చిందని పోయినసారి వేసిన పంటను వేయకుండా కొత్త పంటను వేస్తారు. మళ్లీ అదే పరిస్థితి. ఇక్కడ రైతులకు అవగాహన లేక ప్రభుత్వం తలదూర్చకపోవడం వలన ఒక ప్రాంతంలో ఒక పంట ఎక్కువ దిగుబడితో కొనేవాళ్ళు లేక గిట్టుబాటు ధర రాక చాలా సార్లు తమ పంటను అంగట్లో రోడ్లపై పారేసి బాధతో ఇంటికి వెళ్ళే రైతులను మనం చూస్తాం. ముఖ్యంగా కూరగాయలు నిల్వ ఉండవు గనుక రైతులు ఆందోళన చెంది గిట్టుబాటు ధర రాకున్నా అమ్ముకొని నష్టపోతుంటారు.
అక్కడ ధరలు పూర్తి నియంత్రణలో...
అభివృద్ధి చెందిన దేశాలలో కూరగాయలను నిల్వ చేసే విధానాలను అవలంభిస్తారు. పంటలను మార్కెట్‌లకు పంపించే వరకు లేదా విక్రయించే వరకు సురక్షితంగా ఉంచడం వలన ఆహార కొరత ఉండక ధరలు కూడా నియంత్రణలో ఉంటాయి. రైతులు పండించే కూరగాయలు లేదా ధాన్యాలను నిల్వ ఉంచుకునే మార్గాలను ప్రభుత్వం రైతులకు శిక్షణ ఇవ్వాలి. లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి. వీటన్నింటిపై ప్రభుత్వం రైతులకు శిక్షణ, సహకారాలు ఇవ్వాలి. రైతు పండించే పంటలను క్రిమికీటకాల నుండి, ఎలుకల నుండి, వాతావరణంలోని మార్పుల నుండి పంట చెడిపోకుండా చాలా జాగ్రత్త వహించేలా శిక్షణ ఇప్పించాలి.
పంట నిల్వ బాధ్యత ప్రభుత్వానిదే!
ఇవన్నీ పండించే రైతుకు సాధ్యం కాదు. అందుకే ఆ పంటను సురక్షితంగా విక్రయించే స్థలాల వరకు లేదా నిల్వ ఉంచే మార్గాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. పంటలను వేసేటప్పుడు ప్రాంతాల వారీగా నీటి లభ్యత, అక్కడ వాతావరణం అనుకూలతను బట్టి , మట్టి పరీక్షలకు అనుగుణంగా ప్రభుత్వం రైతులను సమన్వయ పరచాలి. మన నాయకులు రైతుకు పంట నష్టం వచ్చినప్పుడు కేవలం రైతుతో ఫోటో దిగి రావడం వలన రైతులకు తాత్కాలికంగా ఉపశమనం దొరకవచ్చునేమో కానీ దీర్ఘకాలిక ప్రయోజనం ఉండదు. వ్యవసాయ శాఖ వారు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పంటలు వేసే ముందు రైతులకు శిక్షణా తరగతులను నిర్వహించాలి. దిగుబడి పెంచే మార్గాలు, నిల్వ ఉంచే పద్ధతులు, అమ్ముకునే విధానాలు రైతులకు తెలియపరచాలి.
రైతును కాపాడుకోకపోతే ఎలా?
అంతకు మించి, పండించి అన్నం పెట్టే రైతును కాపాడుకోవాలని మన అధికారులు, నాయకులు తెలుసుకోవాలి. సేవాదృక్పథం, దేశభక్తి ఉన్న నాయకులు ఎన్నికల్లో నిలబడినప్పుడు రైతులు, సామాన్యులు వాళ్ళను గుర్తించి ఏమీ ఆశించకుండా ఓటు వేసినప్పుడు సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కొంతమంది ఉద్యోగం లేదని వ్యాపారం చేసుకునే అర్హత లేదని, భూమి లేదని చింతించకుండా, భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతును గుర్తించి వ్యవసాయం చేసుకునే రైతుకూలీలకు తమ జీవనోపాధికి భరోసా ఇచ్చింది. అదే విధంగా 24 గంటల కరెంటు, పంట రుణాలు కూడా ఇవ్వాలి.
యువ రైతులకు సహకరిద్దాం!
ప్రస్తుతం చదువుకున్న యువత నూతన పద్ధతులతో, కొత్త వంగడాలతో పంట భారీగా దిగుబడి కోసం మోటరైజేషన్‌ను, పంటలను నిల్వ చేసే మార్గాలను, పంటలను కాపాడుకునే విషయాలను, మార్కెటింగ్ చేసుకునే మార్గాలను తెలుసుకొని సేంద్రియ పద్ధతుల ద్వారా ఎటువంటి కృత్రిమ మందులను, ఎరువులను వేయకుండా వ్యవసాయం మీద మక్కువతో ముందుకు వస్తున్నారు. వారిని స్వాగతిద్దాం. సహకరిద్దాం. ఇప్పటికీ మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి దాదాపు 40% వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్నాం. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమైనప్పటికీ వంటనూనెలు ఎగుమతి చేయకుండా దిగుమతి చేసుకోవడం బాధాకరమైన విషయం. కూరగాయలు పండించి ఏదో విధంగా అంగట్లో అమ్ముకోవడానికి వచ్చి వెళ్లిపోయే వరకు మొత్తం తెచ్చిన కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకొని చీకటి పడేలోగా ఇంటికి వెళ్ళి ఆ డబ్బుతో జీవితాలను గడిపి పిల్లలను చదివించుకునేవారు చాలామంది ఉన్నారు. మనకు కొనే స్తోమత ఉన్నప్పుడు బేరమాడకుండా వారిని ప్రోత్సహించినట్లయితే రైతుకు మనం సహకరించినట్లే.
-సోమ శ్రీనివాసరెడ్డి
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్