I-N-D-I-A Alliance: బీజేపీపై పోరుకు...‘ఇండియా’ కూటమి సిద్ధం!

I-N-D-I-A Alliance Getting Ready For 2024 Elections

Update: 2023-07-19 00:45 GMT

రాజకీయాల్లో ఎప్పుడు ఏ పార్టీ, ఎవరితో కలిసి పని చేస్తుందో చెప్పడం కష్టం. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. ఇక బీజేపీ సారథ్యంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ తన పాత, కొత్త మిత్రులను మంగళవారం ఢిల్లీలో జరిగే సమావేశానికి ఆహ్వానించింది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం జనసేన పార్టీకి మాత్రమే కబురు పంపారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తమవుతున్న బీజేపీ.. ఎన్డీయే సమావేశానికి మొత్తం 30 పార్టీలకు ఆహ్వానం పంపించింది.

ఎన్డీఏను గుర్తించిన.. బీజేపీ

ఓ వైపు విపక్షాలు వరుసగా భేటీలు అవుతుండటంతో, ఎన్డీయే కూడా తన భాగస్వామ్య పక్షాలతో సమావేశమవుతోంది. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులకు మద్దతు కోరడం, రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల బలప్రదర్శన లక్ష్యంగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాలను రెండు విడతలుగా నడిపిన భారతీయ జనతా పార్టీ తాజాగా అలయెన్స్ బలోపేతంపై దృష్టి సారించింది. గత తొమ్మిదేళ్లుగా మిత్రపక్షాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలను ఎదుర్కొన్న బీజేపీ. అదే సమయంలో చిరకాలంగా తమతో కొనసాగిన మిత్ర పక్షాలను దూరం చేసుకుంది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ మూడేళ్ళ క్రితమే ఎన్డీయేకూ గుడ్ బై చెప్పగా, మహారాష్ట్ర రాజకీయాల్లో ఎవరిది పైచేయి అన్న అంశంపై శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ, నితీశ్ కుమార్ జేడీయూ, పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ ఇలా ఎన్డీయేకు దగ్గరై దూరం జరిగిన పార్టీలు చాలానే వున్నాయి. వాటిలో కొన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్డీయేని వీడితే.. మరికొన్ని బీజేపీ పట్టించుకోవడం లేదంటూ కూటమిని వీడాయి. భారతీయ జనతా పార్టీ, ఎన్డీయే అవసరాన్ని కాస్త లేటుగానే గుర్తించింది. 2014, 2019 ఎన్నికల్లో ఎవ్వరి మీదా ఆధారపడనంత సంఖ్యలో ఎంపీలను గెలుచుకున్న పార్టీ కూటమిలోని పార్టీల అభిప్రాయాలతో పని లేకుండానే నిర్ణయాలు తీసుకుంది.

పాత మిత్రులు గుర్తుకొచ్చారు

ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఎవరినీ పట్టించుకోకుండా బీజేపీ విధానాలను దూకుడుతనంలో మోదీ ప్రభుత్వం అమలు చేసేసింది. ఆనాడు ఉభయ సభల్లో జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన తీరు.. ఎంత హుందాగా వుందో అంతే స్థాయిలో అతి విశ్వాసంతో కనిపించింది. ఇది ఎన్డీయేలోని చిన్న పార్టీలకు కాస్త ఇబ్బందిగానే వున్నా సంఖ్యాబలానికి తలవంచారు చాలా మంది. ఇపుడు మరోసారి లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఉత్తరాది పార్టీగా పేరున్న బీజేపీ.. ఉత్తర భారత రాష్ట్రాలలో ఇప్పటికే ఎక్కువ సీట్లను గెలుచుకుంది. అక్కడ ఇంకా సంఖ్యను పెంచుకునే అవకాశం తక్కువ ఉండటంతో.. ఈసారి దక్షిణాదిన తమ ఎంపీ సీట్ల సంఖ్యను పెంచుకోవాలని ప్లాన్ చేశారు కమల నాథులు. కానీ కర్ణాటక ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వెలువడడంతో ఎన్డీయే బలోపేతంపై బీజేపీ అధినాయకత్వం దృష్టి సారించింది. పాత మిత్రులతో భేటీకి సిద్ధమయింది. ఈ భేటీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హాజరు అవుతున్నారన్న సందేశం పంపింది. ఈ భేటికి ప్రస్తుత మిత్రులతో పాటు గతంలో కూటమి నుంచి వైదొలగిన పార్టీలకు ఆహ్వానం పంపారు. అదే సమయంలో ఇటీవల బీజేపీ దగ్గరైన ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)కి కూడా ఆహ్వానం పంపారు. కానీ బీజేపీకి దగ్గరవ్వాలనుకుంటున్న చంద్రబాబుకు మాత్రం ఆహ్వానం రాలేదు.

మెట్టు దిగిన కాంగ్రెస్

బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ విధాన భావ సారూప్యత గల పార్టీలను కలుపుకునే పనిని చాలా కాలం క్రితమే ప్రారంభించింది. మరోవైపు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఫలితాల తర్వాత 2024 ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తేవడానికి యధాశక్తి ప్రయత్నిస్తోంది. అవసరమైతే ఓ మెట్టు దిగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించిన కాంగ్రెస్ నేతల ధోరణి దీనినే చాటుతోంది. పాట్నాలో జరిగిన సమావేశంలో ఢిల్లీ ఆర్డినెన్సుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో కినుక వహించి, విపక్షాల మలి భేటీ బెంగళూరు సమావేశానికి గైర్హాజరయ్యే సంకేతాలు కేజ్రీవాల్ పార్టీ వైపు నుంచి వచ్చాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఓ మెట్టు దిగి వచ్చి మరీ సయోధ్య చేసుకుంది. బెంగళూరు భేటీకి హాజరయ్యే బీజేపీయేతర పార్టీల సంఖ్య తగ్గకుండా జాగ్రత్త పడింది. మొన్న, నిన్న బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో బీజేపీయేతర విపక్షాలు సమావేశం అయ్యాయి. బెంగళూరు భేటీ తర్వాత విపక్షాల కూటమి నిర్మాణానికి ఓ రూపు దిశ ఓ షేపు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

2024 సార్వత్రిక సమరం.. ఎన్డీఏ X యూపీఏ పోరుగా మారుతోంది బీజేపీని ఎదుర్కోవాలనే ఉమ్మడి లక్ష్యంతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పట్నాలో జరిగే విపక్ష పార్టీల అధినేతల సమావేశం నిర్ణయించింది. ప్రధాన మంత్రి అభ్యర్థి, సీట్ల పంపకం వంటి సంక్లిష్ట విషయాలపై ఏకాభిప్రాయం సాధించటానికి బెంగళూరులో సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే బీజేపేతర కూటమి పేరు’ను ‘ఇండియా’ గా మార్చారు. అయితే ప్రధానమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్‌కి ఆసక్తి లేదని.. కేవలం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే మా ధ్యేయమని తేల్చి చెప్పారు.

సీట్ల పంపకాల్లో.. వ్యూహమేంటి?

దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఎన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలో ముందే నిర్ణయించుకుంటాయా? ఏ అంశాల ఆధారంగా సీట్ల పంపకాలు చేసుకుంటాయి? అసలు ఈ లెక్కలు తేలేనా? అని విపక్ష కూటమి సమావేశంపై అనేక మంది అనుమానాలు. కానీ వాటికి తావు లేకుండా ఈ ఇండియా ఫ్రెంట్ ఓ ప్రత్యేక వ్యూహంలో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం అధికారికంగా కూటమి ఉండదు, సీట్ల పంపకం ఉండదు. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీని ఎదుర్కొని, గెలవగలిగే విపక్ష పార్టీ అభ్యర్థి ఒకరు ఉండేలా చూడడమే ప్రధానాంశం. అయితే స్థానిక బలాబలాల్ని బేరీజు వేసుకుని కమలదళాన్ని ఢీకొట్టగల అభ్యర్థి 'ఒక్కరినే' బరిలోకి దింపేందుకు విపక్షాలు ఎంతమేర రాజీ ధోరణి ప్రదర్శిస్తాయనేది కీలకం.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, హరియాణా, ఉత్తరాఖండ్‌లో బీజేపీకి అసలైన ప్రత్యర్థి కాంగ్రెస్. ఆ రాష్ట్రాల్లో విపక్ష కూటమికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ కాంగ్రెస్సేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి కాస్త భిన్నంగా మారబోతుంది. ఇక్కడ సీట్ల పంపకంలో ఎలా వ్యవహరిస్తారనేది కీలకంగా మారనుంది. భిన్న రాష్ట్రాలలో సీట్ల పంపకం విషయంలో విపక్ష జట్టు ఎలాంటి వ్యూహం పన్నుతుందో. ప్రధాని పదవి కోసం ఎదురుచూసే ఆశావహులు ఏ మేరకు కూటమికి బలాన్ని ఇస్తారో అన్నది వేచి చూడాలి.

శ్రీధర్ వాడవల్లి

99898 55445

Tags:    

Similar News