ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం ఎలా?

How to recognize and honor Telangana activists?

Update: 2024-01-03 00:45 GMT

ప్రత్యేక తెలంగాణ డిమాండ్ నాలుగున్నర కోట్ల ప్రజలది. దేశ చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యత, ప్రాచుర్యం పొందింది ఈ ఉద్యమం. తెలంగాణ ఉద్యమాన్ని రెండు పాయలుగా గుర్తించాలి. ఒకటి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటం‌, రెండు ప్రజల అంగీకారం తెలుసుకోకుండా, కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి రాష్ట్రం నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం. ఒకటి విముక్తి పోరాటం అయితే, రెండవది వేర్పాటు కోసం జరిగిన పెనుగులాట. ఈ రెండు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం, స్వీయ గౌరవం కోసం జరిగిన ఉద్యమాలే.

ఆరు దశాబ్దాలు, సుదీర్ఘ కాలంపాటు వివిధ రూపాలలో తెలంగాణలో సాగిన ఉద్యమం దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైనది. దేశాన్ని బ్రిటీషు వారు పాలించినా తెలంగాణను మాత్రం నిజాం పాలించేవాడు. పేరుకు నిజాం పాలనగా కనిపించిన పెత్తనం అంతా భూస్వాములదే! వీరి అణచివేత, వెట్టిచాకిరి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. కూలీ రేట్ల పెంపు కోసం ప్రారంభమైన ఈ పోరాటం, సంఘం పెట్టుకునే హక్కు, సభలు పెట్టుకునే హక్కుల సాధన కోసంగా మారింది. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ తోడవడంతో సాయుధ రైతాంగ పోరాటం ద్వారా వెట్టిచాకిరి విముక్తి జరిగి లక్షలాది ఎకరాల భూమిని ప్రజలు స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలకు కష్టాలు మొదలైందిక్కడే..

ఇక హైదరాబాద్ రాష్ట్రంలో 1952 ఎన్నికల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పాలన 1963 వరకు సాగింది. మరోవైపు 1953లో మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి కోస్తా రాయలసీమ ఒక్కటిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పరిపాలనా భవనాలు, అరకొర వసతులతో పాలన సాగిస్తున్న ఆంధ్ర రాష్ట్ర పాలకుల, పెట్టుబడిదారుల కన్ను సుసంపన్నమైన హైదరాబాద్ రాష్ట్రంపై పడింది. ఢిల్లీ పాలకులను అదుపులో పెట్టుకొని భాషా సంయుక్త రాష్ట్రాల పేరిట పెద్దమనుషుల ఒప్పందం పేరిట, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా ఆంధ్ర - హైదరాబాద్ రాష్ట్రాలను కలిపి ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుండి హైదరాబాద్ రాష్ట్ర(తెలంగాణ)ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. రాజకీయ అధికారం మొదలు పరిపాలనా విభాగాలన్నింటిలో నిర్ణయాత్మక శక్తిగా మారి దోపిడీ సాగించారు. పెద్ద మనుషుల ఒప్పందంలోని నియమాలన్నింటినీ తుంగలో తొక్కి, వనరులన్నింటినీ దోచుకుంటూ అన్నిరంగాల్లో తెలంగాణ ప్రాంతం వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించే దుస్థితి ఏర్పడింది. విద్య, ఉద్యోగం మొదలు స్థానికతతో సహా అన్నింటిలో వెనుకబాటుకు గురిచేశారు. యాస-భాషలను, ఆచార వ్యవహారాలను వెక్కిరింపుకు గురిచేశారు.

మరోవైపు ఖమ్మం జిల్లాలోని పాల్వంచ ధర్మల్ పవర్ స్టేషన్‌లో మెజారిటీ ఉద్యోగులను ఆంధ్రప్రాంతం వారిని నియమించడంతో తెలంగాణ రక్షణ పేరిట దినసరి వేతన కార్మికుడు క్రిష్ణ దీక్ష ప్రారంభించాడు. దాని ప్రభావంతో ఖమ్మంలోనే నేషనల్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు రవీంద్రనాథ్ దీక్ష ప్రారంభించారు. దీనికి యావత్ విద్యార్ధి లోకం కదం తొక్కింది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలకు పాకింది. విద్యార్థుల ఉద్యమానికి అధ్యాపకులు, ఉపాధ్యాయులు, మేధావులు, కార్మికులు, రాజకీయ పార్టీలు ఇలా ఒక్కరేమిటి తెలంగాణ యావత్ ప్రజానీకం అండగా నిలిచింది. దీనిపై బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం క్రూరమైన దాడి చేసింది. పోలీసుల కాల్పుల్లో నాలుగు వందలమంది చనిపోగా వేలాది మంది గాయపడ్డారు. తదుపరి ఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి విజయ దుందుభి మోగించింది. కానీ, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కొన్ని ఒప్పందాలు చేసుకొని తెలంగాణ ప్రజాసమితిని విలీనం చేసి తెలంగాణా ఉద్యమాన్ని నీరుగార్చింది. అలా తాత్కాలికంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ, కాలగమనంలో అనేక రూపాలలో మండుతూనే వచ్చింది. అడపాదడపా నిరసనలు కొనసాగాయి.

ఉద్యమం ఊపందుకుని..

1996 నాటికి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. భువనగిరిలో ప్రారంభమైన కదలిక సూర్యాపేటలో తెలంగాణ మహాసభగా, వరంగల్ డిక్లరేషన్‌గా, తెలంగాణ జనసభగా ఏర్పడ్డాయి. దీనికి అనుబంధ సంఘాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ రాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మళ్ళీ ఊపందుకుంది. దీంతో సీమాంధ్ర ప్రభుత్వం కన్నెర్ర చేసి విద్యార్థి నాయకులను, కళాకారులను, రైతాంగ నాయకులను, కార్యకర్తలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. కేసులు బనాయించింది‌. అలా ఉద్యమం కొంత వెనుక పట్టు పట్టింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మళ్లీ రాజకీయ పరిష్కారం రూపంలో ప్రజల ముందుకొచ్చింది. ఒకపక్క టీఆర్ఎస్, మరోపక్క పక్క ప్రజా సంఘాల వేదికలతో తెలంగాణ అంతటా ఉద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమానికి దేశంలోని వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టారు. ఈ ఉద్యమంతో తెలంగాణ అగ్ని గుండంలా మారింది. దీంతో ఉద్యమ సెగకు తలొగ్గిన కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. కానీ ఆంధ్ర ప్రాంత నేతల ఒత్తిడికి తలొగ్గి ప్రకటనను వెనక్కితీసుకుంది. దీంతో నిరాశ చెందిన కాసోజు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో తెలంగాణలోని రాజకీయ పార్టీలు అన్నీ ఒక్క తాటిపైకి రావడంతో పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదించడం అనివార్యం అయ్యింది.

బుద్ధిజీవుల బాధ్యత పెరిగింది

తెలంగాణ సాయుధ పోరాటాన్ని పాశవికంగా అణచివేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించి గౌరవించింది. టీఆర్ఎస్ కొంతమేర గుర్తించింది. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పైగా ఉద్యమకారులను గౌరవిస్తామని అనడంతో ఉద్యమకారుల గుర్తింపు, గౌరవాల సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ఈ గుర్తింపు ఎలా ఉంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉద్యమకారులపై ఉన్న ఉపా చట్టాన్ని ఉపసంహరించుకుంటుందా? ఉద్యమ కారులపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కు తీసుకుంటుందా? విప్లవ పార్టీ, ప్రజాసంఘాలపై నిషేధం ఎత్తివేస్తుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు పౌరసమాజం నుండి తలెత్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తారో చూడాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం గెలిచిందని ప్రకటించిన బుద్ధి జీవుల భుజస్కందాలపై బాధ్యత ఇప్పుడు మరింత పెరిగినట్లైంది. సూచనలు, సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో, సుపరిపాలన జరిగేలా చేస్తారా? పౌర ప్రజాస్వామిక హక్కులకు భంగం కలగకుండా చూస్తారా? నిజమైన ఉద్యమకారులు ఎవరు? ఎలా గుర్తిస్తారు? వారి ప్రాతిపదిక ఏమిటి? వారిని ఎలా గౌరవిస్తారు? అనే అంశాలను సునిశితంగా పరిశీలించాలి. దీనిని సరైన దారిలో జాగ్రత్తగా నడపలేదంటే మాత్రం ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందన్నది చారిత్రక సత్యం! ఆలోచించండి!

- రమణాచారి

తెలంగాణ ఉద్యమనేత

99898 63039

Tags:    

Similar News