రతనాల సీమ రాళ్లసీమ అయిందిలా!

రతనాల సీమ రాళ్లసీమ అయిందిలా!.... How Rayalaseema became a waterless region

Update: 2023-02-15 19:00 GMT



వలస పాలనలో సీమ ప్రాంతానికి కలెక్టర్‌గా ఉన్న సర్‌ థామస్‌ మన్రో (1801-1807) ఇక్కడి చెరువులు గురించి ఇలా రాశాడు. "ఈ ప్రాంతాల్లో కొత్త చెరువులు నిర్మించడానికి ప్రయత్నించడం వ్యర్థం. అనువైన ప్రతి చోట పూర్వమే చెరువులు తవ్వారు. కడవ ప్రాంతంలోని ఒక తాలూకాలో 3,574 చదరపు మైళ్ల వైశాల్యంలో 4,194 చెరువులు ఉన్నాయి." బ్రిటిష్ పాలకులు కూడా విస్తుపోయే విధంగా నాడు రాయలసీమలో అనువైన ప్రతిచోటా చెరువును నిర్మించారు. ఒకటీ రెండూ కాదు కొన్ని వేల చెరువులు తవ్వించి కర్షకుడి జీవితంలో వెలుగును నింపారు. కానీ రాయలు నిర్మించిన చెరువులను విస్మరించిన ఫలితంగా సీమ వీధుల్లో రతనాలు రాసులుగా అమ్మిన చరిత్ర కనుమరుగైపోతోంది.

విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన చెరువులను విస్మరించిన ఫలితంగా రాయలసీమ వీధుల్లో రతనాలు రాసులుగా అమ్మిన చరిత్ర కనుమరుగైపోతోంది. సేద్యాన్ని ప్రోత్సహించడానికి విజయనగర పాలకులు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. బ్రిటిష్ పాలకులు కూడా విస్తుపోయే విధంగా నాడు అనువైన ప్రతిచోటా చెరువును నిర్మించారు. ఒకటీ రెండూ కాదు కొన్ని వేల చెరువులు తవ్వించి కర్షకుడి జీవితంలో వెలుగును నింపారు. కాలం మారినా ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేనిచోట ఆ చెరువులను వినియోగంలో ఉంచుకోవడం అనివార్యం. కానీ ప్రస్తుతం అలాంటి శ్రద్ధ, సృహ కానరావడం లేదు. దాని ఫలితం కనిపిస్తున్నది. ఎనిమిది వేల చెరువులను శిథిలం చేసుకుని రతనాల సీమను రాళ్లసీమగా మారడానికి ఆస్కారం ఇచ్చాం.

సీమను సుభిక్షం చేసిన రాయలు

రాయలవారు సీమ ప్రాంత అపర భగీరథుడంటే అతిశయోక్తి కాదు. రాయలసీమ ఆనాటి విజయనగరం సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. వలస పాలనలో సీమ ప్రాంతానికి కలెక్టర్‌గా ఉన్న సర్‌ థామస్‌ మన్రో (1801-1807) ఇక్కడి చెరువులు గురించి ఇలా రాశాడు. "ఈ ప్రాంతాల్లో కొత్త చెరువులు నిర్మించడానికి ప్రయత్నించడం వ్యర్థం. అనువైన ప్రతి చోట పూర్వమే చెరువులు తవ్వారు. కడవ ప్రాంతంలోని ఒక తాలూకాలో 3,574 చదరపు మైళ్ల వైశాల్యంలో 4,194 చెరువులు ఉన్నాయి." విజయనగర చక్రవర్తులు కావాల్సినన్ని చెరువులు తవ్వించి రైతులనాకర్షించి రాజ్యాన్ని సుభిక్షం చేశారు. తన 'ఆముక్తమాల్యద' కావ్యంలో రాయలవారు ఇలా అంటారు. దేశ సౌభాగ్యమర్థసిద్ధికిని మూల/ మిలయొకంతైన కుంట కాల్వలు రచించి/ నయము పేదకు, అరి, కోరునను నొసంగి ప్రబల జేసిన అర్థ ధర్మములు పెరుగు". అంటే చిన్న భూ కమతాల్లో కూడా చెరువులు, కుంటలు, కాలువలు తవ్వించి రైతులకు తక్కువ పన్నులకు భూములు ఇస్తే వారు వృద్ధిలోకి వస్తారు. ప్రభుత్వ కోశం నిండుతుంది. రాజుకు ధర్మపరుడనే కీర్తి దక్కుతుంది. అది ఆనాటి రాజధర్మం. పోర్చుగీసు యాత్రికుడు, రాయలవారి సమకాలికుడు న్యూనిజ్‌ వ్యాఖ్య కూడా దీన్నే ఆవిష్కరిస్తున్నది. "రాయలు అనేక చెరువులు తవ్వించినందువల్ల వ్యవసాయం అభివృద్ధి చెందింది" అని రాశాడా విదేశీయాత్రికుడు. కేవలం పాలకులే కాక, మంత్రులు, వారి భార్యలు కూడా చెరువులు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. వైఎస్‌ఆర్‌ (కడప) జిల్లాలోని సిద్ధవటం చెరువును క్రీ.శ 1527లో మల్ల అనంతభూపాలుడు తవ్వించాడు.

చెరువుల తవ్వకం

ఈ కొద్దిపాటి చారిత్రక అధ్యయనాన్ని బట్టి చూస్తే విజయనగర రాజుల కాలంలో నీటి పారుదల వ్యవస్థ విస్తరణను ఒక యజ్ఞంగా చేపట్టారని తెలుస్తోంది. చెరువుల తవ్వకం వెనుక దృష్టిని కూడా న్యూనిజ్‌ చెప్పారు. నదులు ఎక్కువగా లేని, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటిని భద్రపరిచి నిల్వచేయడానికి యూరప్‌లో మాదిరిగా చెరువుల నిర్మాణం చేపట్టారని న్యూనిజ్‌ చెప్పారు. చెరువులు నిర్మించిన తరువాత వాటి కింద సాగుభూములపై పన్ను రాయితీలు కల్పించారు. వ్యవసాయాభివృద్ధి ద్వారా అనేక రకాల వ్యాపార పంటలను ప్రోత్సహించారు. ప్రజలకు పుష్కలంగా ఆహారం, రాజ్యానికి విశేషంగా ఆదాయం లభించడంతో, వర్తకవాణిజ్యాలు వర్ధిల్లాయి. పట్టణాలు, నగరాలు విస్తరించారు. దీని ఫలితమే కళలు, సాహిత్యం, ఆలయాలు, రాజగోపురాలు కూడా ఈ వైభవానికి నిదర్శనమే. నీటిని నిల్వ చేయడానికి భారీ ఆనకట్టలు, నీటి పారుదలకు కాల్వలు నిర్మించారు. రాయలనాటి చెరువులు - బుక్కరాయచెరువు, నాగవ్వచెరువు, బచ్చపు చెరువు, బాబయ్య చెరువు, అనంతపురం, కంబం, నంద్యాల చెరువులు అనేకం నేటికీ దర్శనం ఇస్తున్నాయి. అయితే ఎన్నో కనుమరుగయ్యాయి. కర్నూలు జిల్లాలో అమ్మనాయనిపేట చెరువు, అవుకు, కంబం చెరువులు ఈ కాలంలో నిర్మించినవే. పెనుగొండలోని బుక్మచెరువును బుక్కరాయల సూచనతో నిర్మించారు.

స్వాతంత్య్రానంతరం చెరువుల అభివృద్ధిలో వలస పాలన కన్నా మన పాలన మెరుగైనదా ఈ ప్రశ్నకు సరైన సమాధానం రాదు. 1954-55 చెరువుల కింద ఆంధ్రప్రదేశ్‌లో 2.451 మిలియన్‌ హెక్టార్లు ఉండగా, 2000 సంవత్సరం నాటికి ఆ సాగు భూమి కేవలం 0.731 మిలియన్‌ హెక్టార్లకు చేరింది. ప్రజలు, ప్రభుత్వాలూ చెరువుల మరమ్మతులు చేపట్టలేదు. భారీ ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపారు కానీ తక్కువ వ్యయంతో కూడిన చెరువులను చిన్నచూపు చూశారు. ఫలితంగా 1956లో రాష్ట్రంలో చెరువుల కింద 39 శాతం నికర సాగు ఉండగా, 2002 నాటికి 2.18 శాతానికి తగ్గింది. చెరువుల కింద సాగు 1956-2002 మధ్య కాలంలో తెలంగాణలో 25 శాతం, రాయలసీమలో 19 శాతం, కోస్తాంధ్రలో 21 శాతం తగ్గిపోయాయి. రాయలసీమను పాలకులు తొలినుంచి జలరాజకీయ సీమగా మార్చారు. 'శ్రీభాగ్‌' ఒప్పందాన్ని ఉల్లంఘించారు. కృష్ణా పెన్నార్‌ ప్రాజెక్టును వ్యతిరేకించి రాయలసీమకు అన్యాయం చేశారు. నాగార్జున సాగర్‌ నుంచి సీమకు నీరు లేకుండా చేశారు. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువను నిర్లక్ష్యం చేసి ఎడమ బ్రాంచ్ కాలువ ద్వారా తెలుగుగంగ పథకాన్ని రూపొందించారు. రాయలసీమకు ఒరిగేదేమీ లేదు. కేసీ కెనాల్‌ను స్థిర జలాధారంగా చేయకుండా గాలికి వదిలేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచినప్పుడు వ్యతిరేకించింది కోస్తాంధ్ర రైతు నాయకులే.

తుంగభద్ర జలాలపై మాత్రమే ఆధారపడ్డ కడప, కర్నూల్‌, అనంతపురం జిల్లాల్లో ఆయకట్టులో సాగు అంతంతమాత్రమే జరుగుతుంది. పూడికతో తుంగభద్ర కృశిస్తున్నది. ప్రస్తుతం రాయలసీమ అవసరాల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కృష్ణానదీ జలాలు లభిస్తాయన్న గ్యారెంటీ ఎవరిస్తారు. రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నికర జలాలు తప్పా మిగులు జలాల లభ్యత ఉండదని నిపుణుల అభిప్రాయం. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తప్పా సాగు నీటి అవసరాలు తీరవనే అభిప్రాయం సీమ ప్రజల్లో గూడుకట్టుకుని ఉ౦డటానికి ఈ అన్యాయాల చరిత్రే కారణం. రాయలచెరువును పునరుద్ధరిస్తే తప్పా సీమలో పనీపాటలు, ప్రశాంతత ఉండవు. కడుపు నిండినోడు ఊరుకోడని సామెత. తక్షణం చెరువుల మరమ్మతులు చేపట్టి సాగునీరు, తాగునీరు ఇవ్వాలి. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అనేక చెరువులను నింపవచ్చు. సాగును పెంచవచ్చు. గాలేరు-నగరి కాల్వ ద్వారా కడప, చిత్తూరు జిల్లాల్లో చెరువులను నింపవచ్చు. దాదాపుగా 8000 నుంచి పది వేల వరకు చెరువులు శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి వనరులు కల్పిస్తే రాయలసీమ రతనాలసీమ అవుతుంది. జల రాజకీయాలు చేయకూడదు. సీమను ఎడారిగా మార్చకూడదు.

అప్పర్‌భద్రతో సీమకు హాని

అప్పర్‌భద్ర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు రూ.5,800 కోట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో తుంగభద్ర నుంచి 29.90 టిఎంసీల నీటిని సెంటల్‌ కర్ణాటకకు తరలించేందుకు వీలు కలిగింది. దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాల తాగు, సాగునీటికి కొరత ఏర్పడినట్లే, అలాంటి మేజర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో రాయలసీమ ఎడారి కావాల్సిందేనా? ఎందుకంటే రాయలసీమ ప్రధాన నీటి వనరు తుంగభద్ర. ఈ ప్రాజెక్టు నీటిని దీని ఎగువ, దిగువ కాల్వలు కేసీ కెనాల్‌ ద్వారా సీమ రైతులు వినియోగించుకుంటున్నారు. ఎగువ కాల్వ కింద మూడు లక్షల ఎకరాలు ఉంది. ఇది సాగవ్వడం ఇక అప్పర్‌ భద్రతో కష్టమే. కృష్ణా, తుంగభద్ర, పెన్నా నీటిని ముందు రాయలసీమవాళ్లు వాడుకున్న తరువాతే ఎవరికైనా అంటూ శ్రీభాగ్‌ ఒప్పందం చేసుకున్నాకనే రాయలసీమ వాళ్లు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని ఆనాడు సాధించాము. రాయలసీమ రాజధానిని త్యాగం చేస్తేనే ఆంధ్రప్రదేశ్‌ (విశాలాంధ్ర) ఏర్పడింది. ఇన్ని త్యాగాలు సీమ వాసులు చేసినా చివరకు సీమకు మిగిలింది శూన్యం. రాజధాని పోయే, కృష్ణానీరు లేదు, తుంగభద్ర నీరు లేదు, పెన్నా ఎండిపోయే. వీటిని రక్షించుకోవాలంటే ప్రత్యేక రాష్ట్రమే గతి. ముఖ్యమంత్రుల నుంచి రాష్ట్రపతుల వరకు అందరూ రాయలసీమ నాయకులే. రాయలసీమ మాత్రం జలరాజకీయ సీమగా మిగిలింది. ఇది నేటి రాజనీతి. అయితే 'రారాజులు జన్మించిరి దేశంలో/ రాజ్యాలను ఏలినారు గతంలో.../ చివరికెవరు మిగిల్చిరి/ కులసతులకు గాజులు' అనే మహాకవి మాటలు మరువరాదు.


- డా.ఎనుగొండ నాగరాజనాయుడు

విశ్రాంత ప్రధానాచార్యులు, తిరుపతి

9866822172

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Tags:    

Similar News