కుబేరులపై టాక్స్ విధించాల్సిందే!
గత దశాబ్ద కాలంలో 1 శాతం ప్రపంచ కుబేరుల సంపద 42 ట్రిలియన్ డాలర్లు దాటిందని, ఆర్థిక అసమానతలు దినదినం రాకెట్ వలె వేగంగా
గత దశాబ్ద కాలంలో 1 శాతం ప్రపంచ కుబేరుల సంపద 42 ట్రిలియన్ డాలర్లు దాటిందని, ఆర్థిక అసమానతలు దినదినం రాకెట్ వలె వేగంగా పెరుగుతున్నదని స్పష్టం అవుతున్నది. అందుకే అసమానతల రుగ్మతలు తగ్గించడానికి బ్రెజిల్ దేశపు లియో డి జెనీరో పట్టణంలో జరుగనున్న జీ - 20 దేశాల ఆర్థిక మంత్రుల శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో అత్యంత సంపన్నులకు పన్నులు లేదా ‘అల్ట్రా-వెల్త్ టాక్స్’ విధించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ఆక్స్‌ఫామ్ తాజా నివేదిక వివరిస్తున్నది.
పలు నివేదికలు, 1 శాతం ప్రపంచ పేద వర్గాల ఆదాయంతో పోల్చితే గత పదేళ్లలో అత్యంత కుబేరుల సంపాదన 36 రెట్లు అధికంగా పెరిగిందనే ఆశ్చర్యకర అధ్యయన వివరాలను వెల్లడించాయి. అంతేకాకుండా ప్రపంచంలో అల్ట్రా - రిచ్ వర్గాల పన్నులు అత్యంత తక్కువగా ఉన్నాయని, సంపన్నుల సంపాదన అనేక రెట్లు పెరుగుతూ, సామాన్యుల సంపాదన పాతాళంలోకి దిగజారుతున్నట్లు పేర్కొన్నాయి. రోజు రోజుకు అసమానతలు అపారంగా పెరగడంతో పేదలు నిరుపేదలుగా మారుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఆర్థిక అసమానతలు రూపుమాపడానికి..
గత దశాబ్దంలో 1 శాతం అల్ట్రా-రిచ్ వర్గ కుబేరుల ఒక్కొక్కరి సంపాదన 4,00,000 డాలర్ల మేర పెరుగుదల నమోదు కాగా, అదే సమయంలో పేదల సంపద 335 డాలర్లు మాత్రమే పెరిగినట్లు తెలుస్తున్నది. అందుకే 2024 నవంబర్ 18 - 19 తేదీల్లో నిర్వహించే జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ సమావేశ ఎజెండాలో ఈ ప్రధాన అంశాన్ని తీసుకొని చర్చించి ‘అల్ట్రా-వెల్త్ ట్యాక్స్’ విధించే విధంగా కఠిన నిర్ణయం తీసుకో వాలని దక్షిణ ఆఫ్రికా, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలతో పాటు ఆక్స్‌ఫామ్ సంస్థ కూడా కోరుకుంటున్నది.
ప్రపంచంలో అసమానతలు అసాధారణ స్థాయిలో పెరుగుతున్నట్లు, ఆర్థిక అసమానతల చట్రంలో నలుగుతున్న నిరుపేదలతో పాటు భూగోళ విపత్తులను కూడా తగ్గించడానికి ప్రభుత్వాలు విఫలం అవుతున్నట్లు పలు గణాంకాలు వివరిస్తున్నాయి. ఒక శాతం కుబేరుల జేబులు నిండుతూ పేదల పేగులు ఆకలితో మాడు తున్నాయని పలు నివేదికలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. సూపర్ రిచ్ వర్గాలు చెల్లించే పన్నులు వారి సంపాదనలో 0 నుంచి 0.5 శాతం మాత్రమే ఉంటున్నదని, వారి వార్షిక ఆదాయం 7.1 శాతం పెరుగుదలను చూపుతున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రతి ఐదుగురు ప్రపంచ అల్ట్రా-రిచ్ కుబేరుల్లో నలుగురు జీ-20 దేశాల్లోనే ఉన్నారని కూడా నివేదిక పేర్కొంటున్నది. అందుకే ఈ అసమానతల రూపుమాపడానికి ప్రభు త్వాలు జీ-20 శిఖరాగ్ర సమావేశం నిర్ణయం తీసుకోవాలని విశ్వ పౌర సమాజం ఆశిస్తున్నది.
2 శాతం సంపద పన్ను విధిస్తే..
అసమానతలు అబ్సీన్ లెవెల్స్‌కు చేరడంతో సూపర్ రిచ్ వ్యత్యాసాలు అసాధారణంగా పెరుగుతున్నట్లు గమనించడం విచారకరమే కాదు ఆక్షేపణీయం కూడా. 3,000 మంది ప్రపంచ సూపర్ రిచ్ కుబేరుల నుంచి కనీసం 2 శాతం సంపద పన్ను వసూల్ చేస్తే దాదాపు 250 బిలియన్ డాలర్ల ఆదాయం ప్రభుత్వాలకు వస్తుందని, ఈ ఆదాయాన్ని పేదరిక నిర్మూలనకు కేటాయిస్తే ఆర్థిక అసమానతలు కొంతవరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ప్రపంచ సూపర్-రిచ్ వర్గాల నుంచి తప్పక 8 శాతం వరకు సంపద పన్నులు వసూలు చేసే విధంగా జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ శిఖరాగ్ర సమావేశం ఏకాభిప్రాయంతో తీర్మానం చేసి, అసమానతలు, వాతావరణ విపత్తుల తగ్గింపుకు మరో సరైన మార్గాన్ని సుగమం చేయాలని నిపుణులు ఆశించడం సముచితంగా, ఆచరణ సాధ్యంగా ఉన్నది.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
99497 00037