కొలిచిన వారికి కొంగు బంగారం.. హేమచల లక్ష్మీనర్సింహస్వామి
greatness of Hemachala Lakshminarsimhaswamy
కొలిచిన వారికి కొంగు బంగారంగా నాటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంగపేట మండలంలో హేమాచల లక్ష్మీనర్సింహస్వామి భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. ఇక్కడ స్వామికి ప్రతీఏటా వైశాఖ శుద్ధ మాసంలో స్వాతీ నక్షత్ర పౌర్ణమి నాడు స్వామికి ఆదిలక్ష్మి చెంచులక్ష్మిల కళ్యాణాన్ని నేటి నుంచి ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. గోదావరి తీరాన్ని ఆనుకుని ఉన్న పురాతన క్షేత్రంలో స్వామి వారి ఆదిలక్ష్మీ చెంచులక్ష్మీ సమేతంగా స్వయంభువుడుగా కొలువై ఉన్నాడు. హేమాచల కొండలపై కొలువున్న లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీరుచకుని వెళుతున్నారు. ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఏడు రోజుల పాటు భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు.
మల్లూరు హేమాచల క్షేత్రాన్ని రాణి రుద్రమదేవి సందర్శించిన సమయంలో ఇక్కడి జలపాతానికి చింతామణి జలపాతంగా నామకరణం చేసినట్లు చరిత్ర ఉంది. మారుమూల అటవీప్రాంతంలో ఉన్న ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకొని వెళుతుంటారు. ఇక్కడ గుట్టలలో నుంచి ప్రవహిస్తున్న జలపాతం నీటిని తీసుకుని వెళ్లి వారి బంధువులకు ఇచ్చి క్షేత్రం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ నాభీ చందనం రాతి గుహలో కొలువై ఉన్న స్వామి వారి శరీరం మానవ శరీరంలా మెత్తగా వేలితో నొక్కితే లోపలికి వెళ్లే విధంగా ఉండడం విశేషం. నిత్యం వేలాదిగా తరలి వస్తున్న భక్తులు స్వామి వారి నాభి నుంచి వచ్చే చందనాన్ని తీసుకుని సేవించడం ద్వారా దీర్ఘకాలిక రోగాలతో పాటు సంతానం లేని వారికి సైతం సంతాన ప్రాప్తి జరుగుతుందని భక్తుల నమ్మకం. అయితే నిత్యం నిరాటంకంగా పారే జలపాతం ఎక్కడి నుంచి వస్తుందో తెలియకపోవడం క్షేత్రంలోని విశేషం. ఈ ఆలయంతో పాటుగా, స్వామి వారు కొలువై ఉన్న గుట్టపైకి నడక దారిలో కాళ్ళనొప్పుల స్వామి శిఖాంజనేయ స్వామి దేవాయాలయాలు ఉన్నాయి. ఆ గుట్టలో ఓ రాయిని వేసి మొక్కుకోవడం ఆనవాయితీ. హేమాచల క్షేత్రానికి నలు దిక్కులలో క్షేత్రపాలకులున్నారు. తూర్పున అభయాంజనేయ స్వామి, పశ్చిమాన శిఖాంజనేయ స్వామి, ఉత్తరాన జాలాంజనేయస్వామి, దక్షిణాన ఎద్దుముక్క ఆంజనేయ స్వామి ఆలయాలలో ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి ఉప ఆలయాలుగా మల్లూరు గ్రామంలో శ్రీ భవానీ శంభులింగేశ్వరస్వామి, శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవి ఆరవ శతాబ్దానికి పూర్వం నుండే ఈ క్షేత్రం ఉన్నట్టు చరిత్ర చెబుతుంది. చిన్నచోళ చక్రవర్తుల కాలం నాటిదని చరిత్రకారులు తెలుపుతున్నారు. ఈ క్షేత్రం అంతా అర్ధచంద్రాకారంలో ఉండడం విశేషం. దట్టమైన అటవీ ప్రాంతం కలిగిన ప్రాంతంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆశ్రిత జన రక్షకుడు భక్తుల కల్పతరువుగా లక్ష్మినర్సింహస్వామి స్వయంభుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.
కొలునుపాక కుమారస్వామి
9963720669