గెస్ట్ లెక్చరర్లను ఆదుకోవాలి!

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 1654 మంది అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేక అరిగోస పడుతున్నారు..

Update: 2024-09-12 00:30 GMT

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 1654 మంది అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేక అరిగోస పడుతున్నారు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్స్ పోస్టులకు కాంట్రాక్టు పద్ధతి రిక్రూట్‌మెంట్ సిస్టంకు స్వస్తి పలికి, గెస్ట్ (అతిథి) సిస్టంలో అధ్యాపకుల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఈ పోస్టుకు త్రీమెన్ కమిటీల ద్వారా డెమో లేదా ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరిగింది. అయితే గత పదేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి పాటుపడుతూ, నిరుపేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తూ వచ్చిన అతిథి అధ్యాపకుల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా మారింది.

ఏడునెలల జీతమే..!

ప్రతి సంవత్సరం ఇంటర్ కళాశాలలు జూన్ నెలలో ప్రారంభం అవుతాయి. కానీ ఆ విద్యార్థులకు బోధించే గెస్ట్ ఫ్యాకల్టీ‌నీ ఆటో రెన్యువల్ చేయకుండా, ఒక సంవత్సరం జూలైలో, మరో సంవత్సరం ఆగస్టులో అధికారులకు ఇష్టం ఉన్నట్టు విధుల్లోకి తీసుకొని నెలంతా బోధించిన పీరియడ్‌ల ప్రకారం ఒక్కో పిరియడ్‌కు రూ. 390 చొప్పున, నెలకు 72 పిరియడ్‌ల కు రూ. 28,080 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ వేతనాన్ని సైతం ప్రతి నెలా కాకుండా, మూడు, నాలుగు నెలలకు ఒకసారి చెల్లించడం జరుగుతుంది.

ఇక ఇతర ఉద్యోగులకు పండగ సెలవులు వస్తే సంబరం, కానీ గెస్ట్ లెక్చరర్లకు, వీరి కుటుంబాలకు మాత్రం ఉపవాసం. ఎందు కంటే పనిదినాలలో మాత్రమే వీరికి వేతనం వస్తుంది. ఈ సెలవులకు వీరికి పైసలురావు. అయినప్పటికీ గత పదేళ్లుగా అష్ట కష్టాలు పడుతూ వీరు కొనసాగుతున్నారు. రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకులతో సమానంగా రోజంతా పనిచేస్తూ, చాలీచాలని జీతాలతో తమ బతుకులను వెళ్లదీస్తూ, ఉద్యోగం ఒక్కటే దిక్కు అనే ఉద్దేశంతో పనిచేస్తున్నప్పటికీ, ప్రతి విద్యాసంవత్సరం ప్రభుత్వం వీరికి ఆటో రెన్యువల్ చేయకపోవడమే కాక, ఎలాంటి ఉద్యోగ భద్రతనూ కల్పించదు.

వారి బాధను అర్థం చేసుకొని..

ఒకవేళ రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకులకు బదిలీలు జరిగాయంటే వీరు ఆ స్థానం నుండి వెళ్లిపోవాల్సిందే. రెగ్యులర్ అధ్యాపకులు లేని చోటే వీరి నియామకం జరుగుతుంది కాబట్టి విద్యాసంవత్సరం మధ్యలో బదిలీల వల్ల ఉద్యోగాలు పోయి, మధ్యలో వేరే ఉద్యోగం దొరకక అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి . ఇక ఇప్పుడు ప్రభుత్వం టీజీపీఎస్సీ ద్వారా నియమించుకునే రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇదే జరిగితే మరికొద్ది రోజుల్లో వీరు ఉద్యోగాల నుండి వైదొలగవలసి వస్తుంది. దీంతో వీరు చేసిన పదేళ్ల శ్రమ వృధా అవ్వడమే కాకుండా, కుటుంబంతో సహా రోడ్డున పడాల్సిన పరిస్థితి. ఏళ్లుగా ఇదే ఉద్యోగంలో ఉండటంతో ఇప్పటికిప్పుడు ఉద్యోగం పోయి వేరే ఉద్యోగం చేయలేని పరిస్థితి. అందుకే ప్రజాసంక్షేమం కోసం పాటుపడే ప్రజా ప్రభుత్వం వీరి బాధను అర్థం చేసుకొని, కొత్త రిక్రూట్మెంట్‌తో సంబంధం లేకుండా, గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నాం.

- బత్తిని సునీల్ కుమార్

97013 52031

Tags:    

Similar News