మరోకోణం: అది జరిగితేనే ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు!
ప్రభుత్వ వైద్యులను జియో టాగింగ్ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచన రాష్ట్రంలో దుమారం రేపుతున్నది.
ప్రభుత్వ వైద్యులను జియో టాగింగ్ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచన రాష్ట్రంలో దుమారం రేపుతున్నది. తామేమీ జంతువులం కాదని, అనుక్షణం తాము ఎక్కడున్నామో తెలుసుకోవడం అవసరం లేదని ప్రభుత్వ వైద్యుల సంఘం నిరసన వ్యక్తం చేస్తున్నది. ఉద్యోగులలో పని ఎగవేసేవాళ్లు, డుమ్మా కొట్టేవాళ్లు, ఇతర అనైతిక పద్ధతులకు పాల్పడేవాళ్లు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి విభాగంలోనూ ఉన్నారని ఆ సంఘం పేర్కొంది. డాక్టర్ల వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో జియో టాగింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనడం వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని ఆరోపించింది.
తమ బ్యాంకు లావాదేవీలు, ఫొటోలు, ఇతర కీలక వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. విధులను మరిచి ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న ప్రభుత్వ వైద్యులను గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఇతర అనేక మార్గాలుండగా, ఈ పద్ధతిని ఎంచుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనను విరమించుకోకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది.
అందుకే ఆ ఆలోచన
నిజానికి, 2019లోనే తెలంగాణ ప్రభుత్వం వైద్యులను జియోటాగ్ చేయడానికి మొదటి ప్రయత్నం చేసింది. ఆ యేడు సెప్టెంబర్ ఒకటి నుంచి ఆయుష్ విభాగం సిబ్బంది, డాక్టర్ల మొబైళ్లలో జియోటాగ్ యాప్ డౌన్‌లోడ్‌ను తప్పనిసరి చేస్తూ ఆ విభాగ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో ఈ చర్యను ఆ విభాగ ఉద్యోగులే కాకుండా మిగతా వైద్య విభాగాల సిబ్బంది కూడా వ్యతిరేకించి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఎందుకనో అప్పుడు సర్కారు వెనక్కి తగ్గింది. హరీశ్‌రావు ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సామాన్యులకు ఉచిత వైద్యాన్ని అందించే దిశగా ప్రభుత్వ దవాఖానాల ప్రక్షాళనకు పూనుకున్నారు. పలు కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
వివిధ జిల్లాలలోని అనేక ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు తమ విధులకు ఎగనామం పెట్టి బయట ప్రైవేటు ప్రాక్టీసు చేయడాన్ని గమనించారు. కొంతమందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి కొత్తగా నియామకమయ్యే ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడాన్ని నిషేధిస్తూ 2022 జూన్ ఏడున జీఓ సైతం జారీ అయింది. అయితే, ఇప్పటికే సర్వీసులో ఉన్న డాక్టర్లకు, సిబ్బందికి ఈ ఆదేశాలు వర్తించక పోవడంతో వారిని జియో టాగింగ్ చేయాలన్న ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి వచ్చిందని చెప్పవచ్చు.
అందరిలో అదే ఫీలింగ్
ప్రభుత్వ డాక్టర్లు పనిచేయరని, బయట తమ సొంత క్లినిక్‌లు నడిపించుకుంటూ డబ్బులు దండిగా సంపాదించుకుంటారని జనంలో టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఆ మాటకొస్తే ప్రభుత్వ ఉద్యోగులందరూ టైంకు రారని, వచ్చినా పని చేయరని, ఆమ్యామ్యా సొమ్ముకు తెగబడతారనే వాదనకు ఓటేసే వాళ్లు జనంలో నూటికి 90 మంది ఉంటారు. నిరక్షరాస్యులైన రైతులు, కార్మికులు జీవితమంతా కష్టపడి తన కొడుకునో, బిడ్డనో బాగా చదివించి ప్రభుత్వోద్యోగిగా చూసి తరించాలనుకుంటారు. విద్యావంతులైన యువతీ యువకులు యేళ్ల తరబడి రాత్రింబవళ్లు శ్రమించి చదివి గవర్నమెంట్ జాబ్ కొట్టి, ఆ పైన సేదదీరాలనుకుంటారు.
కూతుళ్ల పెళ్లి బాధ్యత మీద పడిన తండ్రులు తమకు అల్లుళ్లుగా సర్కారీ నౌకరి ఉన్నోళ్లే రావాలనుకుంటారు. ఇప్పుడిప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపైనా మోజు పెరిగినా, ప్రభుత్వోద్యోగంతో అది సమానం కాదనే భావన ప్రజలలో బలంగా ఉంది. గవర్నమెంట్ జాబ్ అంటేనే కష్టపడకుండా, రిస్క్ లేకుండా, సర్వీస్‌లో ఉన్నప్పుడు, రిటైరైన తర్వాత సకల సౌకర్యాలు, హక్కులు పొందే ఉద్యోగమనే ఫీలింగ్ సమాజంలో సర్వత్రా ఉంది.
పెద్దల ప్రాపకం కోసం
ఈ ఫీలింగ్ రావడానికి అటు ప్రభుత్వాలు, ఇటు ఉద్యోగులు ఇద్దరూ కారణమే. ఓటు బ్యాంకు రాజకీయాలు అనుసరించే పార్టీలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట మచ్చిక చేసుకునేది ప్రభుత్వ యంత్రాంగాన్నే. తమ స్వప్రయోజనాల కోసం ఐఏఎస్, ఐపీఎస్ మొదలుకొని కిందిస్థాయి తహసీల్దార్ల వరకు అందరిలో ఆశ్రిత పక్షపాతాన్ని, అధికార దుర్వినియోగాన్ని ప్రోత్సహించి పబ్బం గడుపుకుంటున్నాయి. పాలనలో సొంత పార్టీ నేతలకు, శ్రేణులకు మేలు చేసే విధానాలను అమలు చేయడం ద్వారా ప్రభుత్వోద్యోగులలో అనైతిక పద్ధతులను, క్రమశిక్షణారాహిత్యాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా పెంచి పోషిస్తున్నాయి. వినని వాళ్లను లూప్ లైన్ పోస్టులకు పంపి కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నాయి. పరిస్థితి ఎలా ఉందంటే సీఎంతో, మంత్రులతో బాగుంటే, వాళ్లు చెప్పినట్లు వింటే కోరుకున్న పోస్టింగే కాకుండా, కావాల్సినంత సంపాదన ఉంటుందని పై స్థాయి ఉద్యోగులు భావిస్తున్నారు.
ఎంపీలతో, ఎమ్మెల్యేలతో, స్థానిక అధికార పార్టీ నేతలతో సఖ్యంగా ఉంటే తాము ఏం చేసినా అడ్డుండదని కింది స్థాయి ఉద్యోగులలో ధీమా ఉంది. నిజాయితీతో వ్యవహరించి అష్టకష్టాలు పడే కంటే, ప్రాధాన్యం లేని పోస్టులకు వెళ్లేకంటే వాళ్లు చెప్పినట్లు వింటే పుణ్యం, పురుషార్థం రెండూ లభిస్తాయనే వాతావరణం నెలకొంది. ఫలితంగా సమస్యలతో వచ్చే సామాన్య జనాన్ని పట్టించుకోకుండా, బడా బాబులకు పెద్దపీట వేసే సంప్రదాయం పెచ్చరిల్లింది. టైంకు రాకపోవడం, వచ్చినా ఉబుసుపోక కబుర్లలో మునిగితేలడం, సెల్‌ఫోన్లలో నిమగ్నం కావడం, ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయకుండా పెండింగులో పెట్టడం వంటి అక్రమ పద్ధతులు అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కొనసాగుతున్నాయి.
అందరినీ ఒకే గాటన కట్టి
అలా అని ప్రభుత్వోద్యోగులందరూ పనిదొంగలనే అభిప్రాయమూ సరైంది కాదు. వారిలో కొందరే ఇలాంటి అనైతిక, అక్రమ పద్ధతులకు పాల్పడి అందరినీ బద్నాం చేస్తున్నారు. వారిని గుర్తించి చర్యలు తీసుకోవడానికి బదులుగా ఆయా ప్రభుత్వాలు మొత్తం ఉద్యోగులందరినీ ఇబ్బంది పెట్టే విధానాలకు తెర తీస్తున్నాయి. తమ అసలు బండారం బయట పడకుండా జాగ్రత్త వహిస్తున్నాయి. పుండొక చోట ఉంటే మందొక చోట రాయడానికి ప్రయత్నిస్తున్నాయి.
జియో టాగింగ్ సిస్టమ్ అందులో భాగంగానే ముందుకువచ్చింది. ఈ పద్ధతిని నిర్బంధంగా అమలు చేయడం తాత్కాలికంగా ఫలితాలనివ్వవచ్చునేమో కాని ప్రభుత్వ వైద్యులను సామాన్య ప్రజలకు చేరువ చేయజాలదు. భయపెట్టడం ద్వారా ఏ పనీ జరగదని గుర్తించాలి. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ దీర్ఘకాలం మన లేదని చరిత్ర చెబుతోంది.
పాలనా వ్యవస్థ మారాలి
ప్రభుత్వోద్యోగులు సరిగ్గా పని చేయాలంటే ముందు పాలకులు, పాలనా వ్యవస్థ మారాలి. రాజకీయ వ్యవస్థలో ఉన్న అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అక్రమ, అనైతిక పద్ధతులను అరికట్టాలి. అందుకు అవసరమైన కఠిన విధానాలను, చట్టాలను ఆమోదించాలి. అమలు కోసం జ్యుడీషియరీ, సెమీ జ్యుడీషియరీ అథారిటీలను ఏర్పాటు చేయాలి. అధికార పార్టీ పట్ల విధేయత ప్రామాణికంగా కాకుండా నైపుణ్యం, అంకితభావం, కష్టపడే తత్వం, ప్రజాసేవ ఆధారంగా పోస్టింగులు, ప్రమోషన్లు ఇచ్చి కార్యాలయాలలో పని సంస్కృతిని పెంచి పోషించాలి. చీఫ్ సెక్రెటరీ నుంచి మొదలుకొని గ్రామ కార్యదర్శి వరకు అన్ని స్థాయిలలో ఈ పద్ధతి అమలు కావాలి. అప్పుడు ప్రభుత్వోద్యోగులందరూ వాళ్లంతట వాళ్లే మారిపోతారు. మారని మొండిఘటాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ సర్కారుకు ఎప్పుడూ ఉండనే ఉంటుంది.
కొసమెరుపు
ఈ సందర్భంగా ప్రజలలో బలంగా వ్యాప్తిలో ఉన్న ఒక ప్రతిపాదనను చెప్పి ముగిస్తాను. ముఖ్యమంత్రి, మంత్రులు సహా ప్రభుత్వ పదవులలో ఉన్నవాళ్లు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఉపాధ్యాయులు సహా ప్రభుత్వోద్యోగులందరూ తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివించేలా, ప్రభుత్వాసుపత్రులలోనే వైద్యం పొందేలా, యేటా ఒకసారి ఉద్యోగులందరి ఆస్తులపై ఆడిటింగ్ జరిగేలా చట్టాలు తీసుకువస్తే వ్యవస్థ అంతా ఆటోమాటిక్‌గా సెట్ అవుతుందనేది ఈ వాదన సారాంశం. ప్రస్తుత ప్రభుత్వానికి ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రతిపాదనను పరిశీలించాలి.
డి. మార్కండేయ
editor@dishadaily.com