నియామకాలలో సమన్యాయం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యం నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పటివరకు నీళ్లు, నిధులపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం నియామకాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే 80 వేల పై చిలుకు ఉద్యోగ నియామకాలకు అనుమతి ఇచ్చింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యం నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పటివరకు నీళ్లు, నిధులపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం నియామకాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే 80 వేల పై చిలుకు ఉద్యోగ నియామకాలకు అనుమతి ఇచ్చింది. అందులో రోస్టర్ పాయింట్స్ వెరిఫై చేసి కొద్ది రోజుల ముందు టీఎస్‌పీఎస్‌సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యున్నత పోస్టులైన గ్రూప్-1 నియామకాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో పొందుపరచిన రోస్టర్ విధానం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మొత్తం గ్రూప్-1 పోస్టులు 503 అయితే, అందులో మహిళలకు 33 శాతం అనగా, 166 పోస్టులు కేటాయించాలి. కానీ, నోటిఫికేషన్‌లో వారికి 225 పోస్టులు అంటే 45 శాతం మహిళలకే కేటాయించారు. రాష్ట్ర నియామాకాలలో మొదటిసారి అమలవుతున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు 50 పోస్టులు రావాలి కానీ, వారికి 43 మాత్రమే వస్తున్నాయి. బీసీ-బి 10 శాతం రిజర్వేషన్‌కు 50 పోస్టులు రావాలి. కానీ, కేవలం 31 పోస్టులే వచ్చాయి. అందులో 17 పోస్టులు మహిళలకే కేటాయించారు. బీసీ-డి వారికి ఏడు శాతం రిజర్వేషన్లకు 35 పోస్టులు రావాల్సి ఉండగా 21 పోస్టులే కేటాయించారు. అందులో కూడా 17 పోస్టులు మహిళలకే కేటాయించారు. ఇది ఏండ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ కొంత నిరాశ కలిగించింది.
కొత్త ఉత్తర్వుల ప్రకారం
తెలంగాణ ప్రభుత్వం నూతన జిల్లాల రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జోనల్, మల్టీ జోనల్ విధానం తీసుకువచ్చింది. దీని ప్రకారం స్థానికతకు పెద్దపీట వేస్తూ 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించారు. సాధారణంగా ఒక నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ చేపడితే, ఖాళీల భర్తీ పూర్తయ్యే నాటికి ఉన్న రోస్టర్‌ను తదుపరి నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా భావిస్తారు. కానీ, రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమలులోకి రావడంతో రోస్టర్ కొనసాగింపునకు బదులుగా, రోస్టర్ పాయింట్లను ఒకటో క్రమ సంఖ్య నుంచి కొనసాగించాలని సాధారణ పరిపాలన శాఖ స్పష్టం చేయడంతో నూతన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో నియామకాలకు కొత్త రోస్టర్-1 తయారుచేశారు. అంటే, ఇప్పటివరకు ఉన్న రోస్టర్ ఏ పాయింట్ దగ్గర ఉందో అక్కడే దానిని ఆపివేసి కొత్త రోస్టర్ -1 ప్రారంభం అవుతుంది.
సాధారణంగా రోస్టర్ 100 పాయింట్లకు తయారుచేస్తారు. వాటిలో అన్ని సామాజిక వర్గాలకు వారివారి రిజర్వేషన్ల ప్రకారం వాటా దక్కినప్పటికీ గ్రూప్-1 లో ఎందుకు మహిళా పోస్టులు ఎక్కువగా రిజర్వు అయ్యాయి, ఎందుకు బీసీ-బి,బి సి-డి వారికి తక్కువ పోస్టులు దక్కాయి. దానికి కారణం మహిళా రిజర్వేషన్లు, స్పోర్ట్స్ రిజర్వేషన్లు, మాజీ సైనిక ఉద్యోగుల రిజర్వేషన్లు. సమాంతర రిజర్వేషన్లను అలా కాకుండా వారి రిజర్వేషన్లను నిలువు రిజర్వేషన్లుగా గుర్తిస్తూ రోస్టర్ తయారు చేశారు.
వారికే ఎక్కువ రిజర్వు అయ్యాయి
నిలువు రిజర్వేషన్లుగా రోస్టర్ పాయింట్లు ఇస్తున్నప్పటికీ మొదటి పది రోస్టర్ పాయింట్లలో మహిళలకు 33 శాతం పరిమితికి లోబడి మూడు పాయింట్లు కేటాయిస్తే సరిపోయేది. కానీ, ఆరు పాయింట్లు కేటాయించారు. మొదటి 20 రోస్టర్ పాయింట్లలో 7 రోస్టర్ పాయింట్లు కేటాయిస్తే సరిపోయేది, కానీ 10 పాయింట్లు కేటాయించారు. గ్రూప్-1 స్థాయిలో చాలా డిపార్ట్మెంట్‌లలో 10 నుండి 50 వరకు పోస్టులు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్‌లో రోస్టర్ పాయింట్లు ఒకటి నుంచి ప్రారంభిస్తారు. మొదటి 10 రోస్టర్ పాయింట్లలో మహిళా రోస్టర్ పాయింట్లు ఎక్కువగా ఇచ్చారు. కాబట్టి మొదటి వరుసలో రోస్టర్ పాయింట్లు ఉన్న మహిళా అభ్యర్థులకు ఎక్కువ స్థానాలు రిజర్వు అవుతున్నాయి. వాస్తవంగా వారి రిజర్వేషన్లు సమాంతర రిజర్వేషన్లు. మహిళలు ఓపెన్ జనరల్ మినహా ఎట్టి పరిస్థితుల్లో కూడా 33 శాతం కంటే ఎక్కువ సెలెక్ట్ కారాదు. వారి రిజర్వేషన్లు నిలువు రిజర్వేషన్లు గా భావించడం, రోస్టర్ లో మొదటి పాయింట్లు వారికే కేటాయించడం వల్ల పురుష అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్, బీసీ-డి వారికి 100 రోస్టర్ పాయింట్లలో ఇరువర్గాలకు చెరో 10 రోస్టర్ పాయింట్లు దక్కినప్పటికి మొదటి పది,ఇరవై రోస్టర్ పాయింట్లలో సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు. ప్రారంభంలో రోస్టర్ పాయింట్లు కేటాయించక పోవడం,కేటాయించిన కూడా మహిళలకే కేటాయించడం వల్ల వారి వాటా ప్రకారం పోస్టులు కేటాయించబడలేవు.అందుకే వారికి కొన్ని పోస్టులే వస్తున్నాయి.
ఆ విధానంలో నియామకాలు చేపట్టాలి
కొత్త రోస్టర్ రూల్స్ తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం కాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలులో ఉంది. ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లకు 10 రోస్టర్ పాయింట్లు మాత్రమే ఓపెన్ పాయింట్ల స్థానంలో కేటాయించారు. ఈ పద్దతిపై ఇప్పటికే కొందరు హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ 100 రోస్టర్ పాయింట్ల విధానం (వేకెన్సీ బేస్డ్) అశాస్త్రీయమని తీర్పు కూడా ఇచ్చింది. అది మన రాష్ట్రంలో అమలు కాకపోవడం విచారకరం.కేంద్ర ప్రభుత్వం 1997 నుంచి వేకెన్సీ బేస్డ్ విధానంలో కాకుండా పోస్ట్ బేస్డ్ విధానంలో నియామకాలు జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 2016 నుంచే ఈ విధానం అనుసరిస్తున్నారు. స్వరాష్ట్రంలో కొత్త జోనల్ విధానంలో అందరికీ న్యాయం జరగాలంటే 100 పాయింట్లు రోస్టర్ లోనే 10 లేదా 20 పాయింట్లకు ఒక సైకిల్ వచ్చే విధంగా అదే 10 లేదా 20 పాయింట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వారి వారి కోట ప్రకారం రిజర్వేషన్లు అదేవిధంగా రోస్టర్ పాయింట్లు కేటాయిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. అంటే, వేకెన్సీ బేస్డ్ రిజర్వేషన్ కాకుండా పోస్ట్ బేస్డ్ రిజర్వేషన్ పాటించాలి. మహిళా, స్పోర్ట్స్ , ఎక్స్ సర్వీస్ కోటాను నిలువు రిజర్వేషన్లుగా కాకుండా సమాంతర రిజర్వేషన్లుగా అమలు చేసినట్లయితే అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది.
జుర్రు నారాయణ యాదవ్
టీటీ యూనియన్ అధ్యక్షుడు
మహబూబ్‌నగర్
94940 19270