కో- ఆపరేటివ్ సొసైటీలో అవకతవకలు
చిత్రపురి కాలనీ సొసైటీలో జరిగిన అవినీతి అవకతవకలకు మించి హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, మణికొండ
చిత్రపురి కాలనీ సొసైటీలో జరిగిన అవినీతి అవకతవకలకు మించి హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, మణికొండ జాగీర్ ( రి.నెం 146/58)లో జరిగిన అవకతవకలు. ఈ అవినీతి గత ప్రభుత్వంలోనే వెలుగులోకి వచ్చినప్పటికీ అప్పటి ప్రజాప్రతినిధులు ఉద్యోగ సంఘ నాయకుల ఒత్తిడితో తొక్కిపెట్టడం జరిగింది. జీవిత చరమాకంలో ప్రభుత్వం కేటాయించిన ప్లాట్‌లపై తమ ఉద్యోగ విరమణ డబ్బులతో నిర్మించుకున్న వయో వృద్ధులైన వారు ప్రశాంతంగా జీవనం గడిపే విధంగా, పూర్వ మేనేజింగ్ కమిటీ చేస్తున్న ప్రలోభాలకు లొంగకుండా తగు విచారణ జరిపి వారిపై తగు చర్యలు తీసుకుంటారని, సొసైటీ సభ్యులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు.
వివరాలలోకి వెళితే, ప్రస్తుతం గండిపేట (మం)లోని మణికొండ జాగీర్ (గ్రా)లో సర్వె నెం 203/1/3/1, 204 to 209, 210/1/3 లో సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం నిమిత్తం 2003లో hyd dist public servants co-op housing society ltd లో కేటాయించడం జరిగింది. 2011లో HMDA నుండి లే అవుట్ అనుమతి పొంది సుమారు 600 ప్లాట్లను లాటరీ ద్వారా అర్హులైన ఉద్యోగులకు కేటాయించడం, అందులో చాలామంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగింది. 2018లో సొసైటీని నడిపిన పూర్వ మేనేజింగ్ కమిటీ సభ్యులు ప్లాట్‌ల కేటాయింపులో అనేక అవకతవకలకు పాల్పడటమే గాకుండా, అనర్హులకు ప్లాట్స్ కేటాయించడం, సొసైటి ఫండ్స్‌ను దుర్వినియోగం చెయ్యడం ప్లాట్లకు నంబర్ వేసి కొత్తగా ప్లాట్లను సృష్టించడం, వాణిజ్య భూమిని లీజుకు ఇవ్వడం, తమకు వ్యతిరేకంగా ఉన్న అర్హులైన సభ్యులను తొలగించడం మొదలైన ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారు. కమిటీలో ఒక ముఖ్య సభ్యుడు అప్పటి సొసైటీ పాలకవర్గ అధ్యక్షుడు కార్యదర్శి అండలతో సుమారు 200 కోట్ల రూపాయలను ఆర్జించడం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. పూర్వ మేనేజింగ్ కమిటీ స్థానంలో గౌ. హైకోర్టు ఆదేశాల మేరకు జాయింట్ రిజిస్టార్ కేడర్‌లో పర్సనల్ ఇన్‌చార్జిని 2019లో నియమించడం జరిగింది.
బినామీ పేర్లతో ప్లాట్ల కేటాయింపు
అయితే 2014 నుండి 2018 వరకు సొసైటీ కార్యకలపాలు జరిపిన మేనేజింగ్ కమిటీ, చేసిన అవినీతి, అవకతవకలపై విచారణ జరిపి ఇచ్చిన నివేదికపై అప్పటి జిల్లా కలెక్టర్ తగు విచారణ నిమిత్తం ఏసీబీ గాని విజిలెన్స్ గానీ లేదా సీబీసీఐడీలకు అప్పగించమని ప్రభుత్వానికి నివేదిక పంపినప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల అండతో ముఖ్యంగా అప్పటి ఉద్యోగ సంఘ నాయకుల అండతో అట్టి ఫైలును తొక్కి పెట్టడమే గాకుండా, అప్పటి ఉద్యోగ నాయకులకు, ప్రజాప్రతినిధులకు బినామీ పేర్లతో ప్లాట్లను కేటాయించడం జరిగింది. ఇంతవరకు సొసైటీ రికార్డులను పర్సనల్ ఇంచార్జికి అప్పగించకుండా ఇప్పటికీ పూర్వ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుని కార్యదర్శుల సంతకాలతో ప్లాట్స్ 50 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. అప్పటి మేనేజింగ్ కమిటీ తమకు వ్యతిరేకంగా ఉన్న సభ్యులకు, ఇళ్లు నిర్మాణం చేసేటప్పుడు, విద్యుత్ వీటి కనెక్షన్ విషయంలో అనేక బాధలకు గురి చేయడమే కాకుండా, బోగస్ మినిట్స్ ఆఫ్ సొసైటీ మీటింగ్స్ ద్వారా అర్హులైన వారి ప్లాట్ అలాట్ మెంట్ సర్టిఫికేట్స్ సొసైటీ మెంబర్‌షిప్ నుండి తొలగించడమే కాకుండా వేరే వారికి కేటాయించడం, అంతేగాక గౌ. హైకోర్టులో కేసులు వేయడం జరిగింది.
ప్రస్తుతం అక్కడ ఇళ్లు నిర్మించుకున్న సభ్యులలో చాలామంది, తమ ఉద్యోగ విరమణ ద్వారా పొందిన డబ్బులతో ఇళ్లని నిర్మించుకున్నారు. అయితే జీవిత చరమాకంలో ప్రభుత్వం ద్వారా పొందిన లబ్దితో ప్రశాంత జీవనం గడుపుకోవాలన్న వారు, గత ఎక్స్ మేనేజింగ్ కమిటీ వారి కక్ష సాధింపు చర్యలతో ప్రశాంత జీవనం లేకుండాపోతోంది.
సొసైటీని సొంత జాగీరుగా చేసుకుని...
సుమారు 600 మంది సభ్యులకు సభ్యత్వం ఉన్న ఇలాంటి సొసైటీలో ఒకే ఒక వ్యక్తి గత మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు, సెక్రటరీల అండతో సొసైటీలో జరిగిన అవకతవకల ద్వారా సంపాదించిన డబ్బులతో ఇప్పటికీ ఇష్టారాజ్యంగా సొసైటీ భూమిని తన సొంత జాగీర్‌గా చెప్పుకుంటున్నారు. అయితే ఎక్స్ మేనేజింగ్ కమిటీ చేసిన అవకతవకలపై ఏసీబీ/సీబీసీఐడీ విజిలెన్స్‌ల ద్వారా విచారణ జరపమని గత రిజిస్టార్ కోపరేటివ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సాక్ష్యాలతో సహా నివేదిక పంపడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల అండతో, అట్టి నివేదికను తొక్కి పెట్టడం జరిగినది. ఇప్పటికీ ప్రభుత్వం తమపై చర్యలు తీసుకోకుండా డబ్బులతో ప్లాట్ల అలాట్‌మెంట్ ఎరతో అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. అందుకు ప్రస్తుత ప్రభుత్వంలోని కొందరు ప్రజాప్రతినిధులు వత్తాసు పలుకుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
గంపెడాశలతో సొసైటీ సభ్యులు
ఇప్పటికైనా, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత మేనేజింగ్ కమిటీ చేసిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ కో ఆపరేషన్ రిజిస్టార్ పంపిన నివేదికల ఆధారంగా తగు విచారణ జరిపి, వారిపై క్రిమినల్ యాక్షన్‌తో పాటు తగు చర్యలు తీసుకొని జీవిత చరమాకంలో ప్రభుత్వం కేటాయించిన ప్లాట్‌లపై తమ ఉద్యోగ విరమణ డబ్బులతో నిర్మించుకున్న వయో వృద్ధులయిన వారు ప్రశాంతంగా జీవనం గడిపే విధంగా పూర్వ మేనేజింగ్ కమిటీ సభ్యులు చేసిన, చేస్తున్న బాధల నుండి విముక్తి కలిగించాలని, ఆ క్రమంలో ఎక్స్ మేనేజింగ్ కమిటీ చేస్తున్న ప్రలోభాలకు లొంగకుండా తగు విచారణ జరిపి వారిపై తగు చర్యలు తీసుకుంటారని ముఖ్యంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి సొసైటీలో జరిగిన అవకతవకలపై దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకుంటారని సొసైటీ సభ్యులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు.
సురేష్ పొద్దార్
సొసైటీ బాధితుడు
80080 63605