మరణానికీ ప్రణాళిక అవసరం
పుట్టినవాడెల్ల గిట్టక మానడు, గిట్టినవాడెల్ల మల్ల పుట్టకమానడు, అనివార్యం అగు దానికి, శోకించడం తగదు, అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు.
పుట్టినవాడెల్ల గిట్టక మానడు, గిట్టినవాడెల్ల మల్ల పుట్టకమానడు, అనివార్యం అగు దానికి, శోకించడం తగదు, అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. మన ఘంటసాల వీనుల విందుగా మనకు అందించాడు. కానీ ఈ యథార్థాన్ని కేవలం అంతిమ సంస్కారం సమయంలోనే అందరు వింటారు, కానీ అసలు వినవలసినవాడు శవంగా మారి వినలేడు. వినవలసి వాడు బతికిఉండగా వినడు లేదా ఆచరించడు. చాలా మందికి మరణం కంటే, తన మరణంతో కుటుంబం ఏమౌతుందో అనే భయం లేదా అసలు చావు అనేది తమ దరిదాపుల్లో రాదనే అవివేకంతో జీవిస్తారు. ముఖ్యంగా కుటుంబ ప్రణాళిక చాల అవసరం. కార్ల్ మార్క్ చెప్పినట్లు ”మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే” అనేది అనుభవించినోడికి అక్షరాలా నిజం అని తెలుస్తుంది.
ప్రతి మనిషిలోని జీవన కాలచక్రంలో అష్ట జీవన దశలు అయినా గర్భాశయ, బాల్య, విద్య, వివాహ ,ఆర్జిత, విరామ, విముక్త చివరి నిర్యాణ (మరణ) దశలలో బాధలు, కన్నీళ్లు, సుఖాలు, దుఃఖం, క్రోధం, ఆవేశం వీటన్నినీ జయించాలంటే, కేవలం కర్మనే కార్యంగా జీవించాలంటే, స్థితప్రజ్ఞుడిగా ఉండాలంటే జాతస్య..అనే ఈ ఒక్క శ్లోకం లోని మర్మాన్ని అర్ధం చేసుకుంటే చాలు. జీవితం ఒడుదుడుకులు లేకుండా కార్యోన్ముఖంగా సాగుతుంది. ఇక కర్మ అంటే తలరాత కాదు, మనం చేసే పని, ప్రతిజ్ఞ, కార్యాన్ని కర్మ అంటారు. ”కర్మ సిద్ధాంతం అంటే తన లక్ష్యాన్ని తానే ఎంచుకొని, శ్రమించి సాధించేవాడు లేదా పోరాటం చేసేవాడు”.
మరణంపై కుటుంబంలో చర్చ:
విద్య, ఉద్యోగం, ఆస్తి, అంతస్తులు, ఆరోగ్యం, భీమా ఇలా అన్నింటిపై చర్చ జరుగుతుంది కానీ, అనివార్యం అయిన మరణం గురించి ఆలోచించడానికి బయపడతాం లేదా అపశకునం లాగ భావిస్తాం. ఆ చర్చ జరిగినప్పుడే, అందరికీ వాస్తవాలు తెలుస్తాయి. జీవన లక్ష్యం, మానసిక, ఆర్థిక, అంతిమ సంస్కార, అనంత సంస్కార ప్రణాళిక రచనకు సిద్ధమవుతారు. క్షణం క్షణం చనిపోతూనే ఉంటారు. కానీ బతికి ఉన్నవారికి ఒక రోజు మేమూ మరణిస్తాం అనే ఆలోచనే రాదు. ఈ వాస్తవాన్ని ఎప్పుడో కృష్ణ భగవానుడు చెప్పాడు, ఇప్పటికి మనం అర్థం చేసుకోలేదు.
మరణంపై చర్చ ఎందుకు జరగాలి?
మరణం అనివార్యం అని తెలిసినప్పుడు మనిషిలో భయం తగ్గుతుంది, లక్ష్య సాధనకు దైర్యం పెరుగుతుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ లాగ ”నిర్యాణ(మరణ) ప్లానింగ్ ద్వారా ఎంతకాలం, ఎలా బతకాలి, ఏమి చేయాలి, ఆరోగ్య ప్రణాళిక, ఆస్తుల పంపకం, కుటుంబ ప్రణాళిక, అలానే మరణం అనివార్యం అయినప్పుడు సంతోషంగా స్వీకరించి, పునఃప్రయాణానికి నాంది అని గమనించి “నిర్యాణ నిరంతర ప్రయాణ ఘటన” అని స్వీకరించటానికి దోహదపడుతుంది.
మానసిక దృఢత్వం:
చావు అంటే భయం, అది చాల మందిని పిరికివాళ్ళను చేస్తుంది, లక్ష్య సాధనకు అవరోధంగా మారుతుంది. మరణం అనివార్యం అని అర్ధం చేసుకున్నప్పుడు, లక్ష్య సాధనలో మరణం కూడా ఒక ఆయుధంలా మారుతుంది. అందుకే విజయమో - వీరస్వర్గమో అనే స్ఫూర్తితో మన స్వతంత్ర సేనానులు అయిన భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్ లాంటి వారు ప్రాణాలను పణంగా పెట్టారు. అహింస అనేది పాటించవలసిన ధర్మం, కానీ ధర్మాన్ని కాపాడటానికి హింస కూడా పవిత్ర ధర్మమే”. మరణం నుండి భయం తొలిగినప్పుడు మనిషి మహానుభావుడు అవుతాడు. చావు అంటే బయపడేవాడు అనుక్షణం పిరికిపందలా బతుకుతాడు.
కుటుంబ, ఆర్థిక ప్రణాళిక:
చాల మందికి మరణం కంటే, తన మరణంతో కుటుంబం ఏమౌతుందో అనే భయం లేదా అసలు చావు అనేది తమ దరిదాపుల్లో రాదనే అవివేకంతో జీవిస్తారు. ముఖ్యంగా కుటుంబ ప్రణాళిక చాల అవసరం. కార్ల్ మార్క్ చెప్పినట్లు ”మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే” అనే వాస్తవం అనుభవించినోడికి అక్షరాలా నిజం అని తెలుస్తుంది. ఆస్తిపాస్తుల పత్రాలు అన్నీ ఒక్క దగ్గర ఉంచడం, దానికి సంబందించిన వివరాలు అన్ని నీ సన్నిహిత కుటుంబ సభ్యులతో పంచుకోవడం. నీ వయసును బట్టి వ్యాపార, వాణిజ్య లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం. ఉన్నవాటిని భద్రపరచుకోవడం. రిజిస్టర్డ్ వీలునామా ద్వారా నీ తదనంతరం నీ ఆస్తులు ఎవరికీ ఎంత చెందాలో వివరంగా రాసి, వాటిని అమలు చేసే అధికారం కూడా వ్యక్తపరుస్తూ పొందుపరిస్తే మంచిది. జీవించి ఉండగానే ఆస్తుల పంపిణి చేసినప్పుడు నీ సంతానానికి లేదా సన్నిహితులకు ప్రేమతో ఏది ఆశించకుండా ఇచ్చినట్లు భావించాలి.
అంతిమ సంస్కారం : మరణంలో కూడా సంస్కారం, గౌరవ ప్రదంగా , ప్రణాళిక ముందే ఉంటే మంచిది. అంతిమ సంస్కారం ఎలా జరగాలి, ఎక్కడ జరగాలి, ఎవరు చేయాలి అనే స్పష్టత ఉండాలి. పార్థివ శరీరాన్ని గౌరవంగా చూడాలి. ఇంటి బయట పెట్టడం లేదా నేల మీద పెట్టడం సంస్కార హీనం. ఒక దేహ పిటక మీద ఉంచాలి. దేహాన్ని ఆనాథగా చూడొద్దు. దశదిన కర్మ, సంతాప సభ రూపంలో కాకుండా “జీవన కాల చక్ర” సమావేశం ఏర్పాటు చేసి అందులో బంధు మిత్రులు తమ తమ భావాలూ, గత స్మృతులను పంచుకునే విధంగా ఉండాలి కానీ కేవలం శోక సభ లాగ ఉండకూడదు. జీవితంలో జన్మ ఎంత శ్రేష్టమో, మరణం కూడా ఒక శ్రేష్ఠమైన ఘట్టం. జన్మ, కర్మ, మరణం, పునర్జన్మ అనివార్యం అని గమనించాలి.
ఒక వ్యక్తి వేసుకున్న వస్త్రాలు విడిచి, కొత్తవి ఎలా ధరిస్తారో, అలానే ఆత్మ ఒక శరీరాన్ని విడిచి కొత్త శరీరంలోకి వెళుతుంది. ఇది అనునిత్యం జరుగుతున్న ప్రక్రియ, అందుకోసం సుదీర్ఘంగా చింతించవద్దని దాని అర్థం. శరీరం ధాతు సమ్మేళనం, మరణించిన తర్వాత ఆ ధాతువులు పంచభూతాలలో కలుస్తాయి. ప్రకృతిలో(పరమాత్మ) విలీనం అవుతుంది. అందుకే అందరూ మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, కుటుంబ, సమాజ శ్రేయస్సు కోరేవారు “మరణానికి ప్రణాళిక” వేసుకోవడం అత్యంత అవసరం. అండ, పిండ, బ్రహ్మాండ తత్ ఏఖం అని గమనించాలి.
డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మాజీ ఎంపీ
95505 55400