ఉపశమనం కాదు.. రైతుకు భరోసా దక్కాలి!
Farmers are not relieved.. they need assurance!
పొలాలనన్నీ హలాల దున్నే రైతన్నలు తమ శ్రమనీ, బలాన్నే కాదు ప్రాణాలనూ నేల తల్లికే అర్పిస్తున్నారు. భారత దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో దాదాపు 18 శాతం పైగా ఆదాయం ఈ రంగం ద్వారా లభించడమే కాకుండా, వ్యవసాయం 58 శాతం ప్రజలకు జీవనాధారం. కరోనా సమయంలో కూడా సుస్థిరమైన అభివృద్ధి సాధించి 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీలో 20.2 శాతం ఆదాయం సమకూర్చిన శ్రమజీవులు మన కర్షకులు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయ రంగంలో వేగవంతమైన అభివృద్ధి సాధించడం దేశ ఆహార భద్రత కోసమే కాక, విలువైన విదేశీ మారక ద్రవ్య సంపాదనకు కూడా అవసరం.
ఆహార భద్రతను బలోపేతం చేయడం, సరైన ధర వచ్చే వరకు రైతులు పంటలను నిల్వ చేసుకునే వీలు కల్పించడం, ఆహారోత్పత్తుల నిల్వ నష్టాలను తగ్గించడం కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వాలు పని చేయాలి. కానీ మద్దతు ధర ప్రకటించి తమ బాధ్యత తీరినట్లు ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. కానీ వ్యవసాయ మార్కెటింగ్‌లో వేళ్లూనుకు పోయిన మధ్యవర్తులు, దళారీ వ్యవస్థ వలన అన్నదాతలు, వినియోగదారులు ఇరువురూ నష్టపోతున్నారు. రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు, సరసమైన ధరలకు ప్రజలకు సరుకులు లభించడం లేదు. అనేక పంటల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో నిలిచినా సాగు లాభసాటిగా లేక అప్పులపాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరం.
రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పిఓ)
రైతులు ఆరుగాలం కష్టపడి, తమ చెమట ధారపోసి , దుక్కి దున్ని పండించినా కూడా ప్రభుత్వాలు వ్యవసాయం, వ్యవసాయ మార్కెట్ల సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల, వారి లాభదాయకత ఎప్పుడూ పక్కదారి పడుతూనే ఉంది. అందుకే వ్యవసాయ రంగంలో కూడా ఇతర రంగాల వలెనే రైతు అనుకూల సంస్కరణలు ప్రవేశపెట్టి వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో ఆలోచించి కేంద్ర ప్రభుత్వం వేసిన కీలకమైన ముందడుగు 2018-19 బడ్జెట్ లో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పిఓ) ఏర్పాటుకు పలు ప్రోత్సాహాలను ప్రకటించడం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, నాబార్డ్, ఇతర సంస్థల ప్రోత్సాహంతో ఇవి ఏర్పాటు చేస్తున్నారు. పంట సేకరణ నుండి మార్కెటింగ్ వరకు వివిధ దశలలో తమ కార్యకలాపాల ద్వారా ఎఫ్‌పిఓలు రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. కేంద్ర ప్రభుత్వం 2021 జులై నాటికి 10000 ఎఫ్‌పిఓలను ఆమోదించి, ప్రారంభించడమే కాకుండా 2027-28 నాటికి మరో 10000 ఎఫ్‌పిఓలను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటివరకు 2014 ఎఫ్‌పిఓలకు కేంద్రం ఆమోదం తెలుపగా, ఇంకా 1534 ఆమోదం పొందాల్సి ఉంది. కొత్తగా ఏర్పాటైన ఎఫ్‌పిఓలకు కొన్నేళ్లపాటు పన్ను మినహాయింపుతో సహా పలు ప్రోత్సహకాలు అమలు చేయడం కోసం బడ్జెట్లో రూ. 6865 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
కర్షకులు తమ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఎగుమతుల కోసం ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వంత రైతు ఉత్పత్తి కంపెనీ (ఎఫ్‌పిసి) లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి స్వంతంగా శీతల గిడ్డంగులు సైతం నిర్మించుకోవచ్చు. పంటల సాగు దశలో సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు, సాగులో ఆర్థిక ఇబ్బంది వంటి సమస్యలను ఎఫ్‌పిఓల ద్వారా పరిష్కరించుకోవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల్లో సభ్యత్వం ఉన్న కర్షకులకు పంట రుణాలు, పురుగు మందులు, ఎరువులు, యంత్రాల కొనుగోలుకు ఆర్థిక సాయం, పంటల బీమా, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్ వంటి సేవలు లభిస్తాయి. నాబార్డ్ అనుబంధ సంస్థ నాబ్ కిసాన్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎఫ్‌పిఓల రుణ అవసరాలు తీర్చడం కోసం ఏర్పాటైంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుండి కూడా రుణాలు పొందవచ్చు. వాటికి మద్దతు ఇవ్వడం కోసం కేంద్రం ఈక్విటీ గ్రాంట్ ఫండ్, క్రెడిట్ గ్యారంటీ ఫండ్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ తదితర పథకాలు అమలు చేస్తోంది.
ఉపశమనం కాదు భరోసా ముఖ్యం
రైతులకు భరోసా కలిపించాలనే ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు కేవలం తాత్కాలిక ఉపశమనమే తప్ప రైతుకు సిసలైన భరోసా కల్పించలేక పోతున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సిఆర్‌బి) ఇటీవలి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. దేశంలోనే మన రాష్ట్రం కౌలు రైతుల ఆత్మహత్యలలో రెండవ స్థానం, రైతు ఆత్మహత్యలలో మూడవ స్థానంలో నిలవడం విచారకరం. ఈ పరిస్థితికి కారణం రైతుకు పండించిన పంటకు నిల్వ చేసే వీలు లేకపోవడం, సరైన గిట్టుబాటు ధర లభించకపోవడమే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతు భరోసా ''కేంద్రాల ద్వారా పండించిన ధాన్యం మొత్తం కొనకపోగా, అమ్మిన ధాన్యానికి రవాణా చార్జీలు చెల్లించడం లేదని, మిల్లర్లు ఒక్కో బస్తాకు 2-3 కిలోల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని రైతు భరోసా కేంద్రాల తనిఖీ సందర్భంగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ ధరల నిర్ణాయక కమిటి ( సిఏసిపి) ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఒక మెట్రిక్ టన్నుపై ఎంఎస్‌పి కన్నా రూ. 230 తక్కువకు ధాన్యం అమ్ముకున్నారని తెలిపింది. ఈ విధానాల వలన రాష్ట్ర రైతాంగానికి వేల కోట్లు నష్టం వాటిల్లింది. అమ్మిన ధాన్యానికి కూడా సకాలంలో సొమ్ము రైతులకు జమ పడటం లేదు. ప్రస్తుతం వ్యవసాయరంగం, చిన్న సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ముఖ్యమైన పరిష్కారం రైతులు సంఘటితం అవ్వడం, ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం. విస్తరణ, ఆర్థిక, మార్కెటింగ్ లాంటి సేవలు గ్రామస్థాయి వరకు అందించి, పంట ఉత్పత్తులను గ్రామ స్థాయిలో సేకరించి అమ్మడం లాంటి ప్రధాన సేవలు ఉత్పత్తిదారుల సంఘాలు అందించడం ద్వారా రైతులకు మంచి ధరలు లభించేలా చేయవచ్చు.
మహారాష్ట్ర లోని అగ్రికల్చర్ కాంపిటీటివ్ నెస్ ప్రాజెక్ట్ (MACP)కు సంబంధించి ప్రైస్ వాటర్ కూపర్ సంస్థ చేసిన అధ్యయనంలో రైతు ఉత్పత్తి కంపెనీ (ఎఫ్‌పిసి)ల ద్వారా రైతులు ఉత్పత్తులను అమ్మడం వలన 22 శాతం అధిక ధర లభించడమే కాక మార్కెటింగ్ ఖర్చు 31 శాతం తగ్గిందని, సాగు ఖర్చు ఎకరానికి రూ.1384 లు తగ్గిందని వెల్లడైంది. ఎఫ్‌పిఓలపై రైతులకు అవగాహన కలిపించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాలలో రైతులను సంఘటిత పరచి ఏర్పాటు చేసిన రైతుమిత్ర గ్రూపులను ఎఫ్‌పిఓలుగా మార్చవచ్చు.
నైపుణ్యం మార్కెటింగ్ కీలకం
పంట దిగుబడి సమయంలో వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేయడానికి అవసరమైన గిడ్డంగులు, శీతల గిడ్డంగుల కొరత వలన రైతులు తమ ఉత్పత్తులను నిలువ చేసుకునే సౌకర్యం లేక అయినకాడికి అమ్ముకుంటున్నారు. కర్షకులే రైతు ఉత్పత్తి కంపెనీ (ఎఫ్‌పిసి) లను ఏర్పాటు చేసుకుని నాబ్ కిసాన్ వంటి సంస్థల ఆర్థిక సాయంతో కనీసం ఆరు నెలలు వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేయడానికి అవసరమైన గిడ్డంగులు, శీతల గిడ్డంగులు నిర్మించుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. దేశంలో ఆహార ధాన్యాల నిల్వల సామర్థ్యాన్ని లక్ష కోట్లు వెచ్చించి ప్రస్తుతం ఉన్న 1,450 లక్షల టన్నుల నుంచి 2,150 లక్షల టన్నులకు రాబోయే ఐదేళ్లలో పెంచేందుకు కేంద్ర మంత్రి మండలి మొన్నటి రోజు ఆమోదించడం శుభపరిణామం. గిడ్డంగుల్లో ఆహార ధాన్యాల నిల్వ బాధ్యతను స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు నిర్వహిస్తాయి. పెద్ద రిటైలర్లు, వ్యాపారులతో రైతు ఉత్పత్తి సంస్థలు నేరుగా అనుసంధానం అయ్యి మార్కెటింగ్ ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా దళారీ వ్యవస్థను నివారించి తమ ఉత్పత్తులకు లాభదాయక ధరలు పొందవచ్చు. రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను అవలంభించి అధికోత్పత్తి సాధించాలి. ప్రభుత్వం ఆధునిక శాస్త్రీయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి. సమర్థవంతంగా పని చేస్తే రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి, వ్యవసాయ రంగ వృద్ధికి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు దోహదపడతాయనేది నిస్సందేహం. ఎక్కువ మంది రైతులు ఇటువంటి సంస్థలలో భాగస్వాములయ్యేలా ప్రభుత్వాలు కృషి చేయాలి. వ్యవసాయాన్ని, వ్యవసాయ ఆధారిత రంగాలను పరిపుష్టి చేసి సాగును లాభసాటిగా మార్చి, రైతే రాజు అనే నానుడిని నిజం చేయాలంటే ఎఫ్‌పిఓలు, ఎఫ్‌పిసిల ఏర్పాటు, వాటి సమర్ధ నిర్వహణ అత్యంత కీలకం!
లింగమనేని శివరామ ప్రసాద్
7981320543