బీఆర్ఎస్ విస్తరణ ఆంధ్రప్రదేశ్ లో తేలికేనా? ముఖ్యపాత్ర ఎవరిది

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుతున్నట్టు ఎంతో అట్టహాసంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక

Update: 2022-10-07 09:15 GMT

కొందరు తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య నేతలతో దగ్గరి బంధుత్వాలు ఉన్నాయి. కేసీఆర్ పాత మిత్రులు కొందరు టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అనేక మంది నేతలు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇప్పటికీ అనేక రకాల పనులు చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో బీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అంశాలు. ఉద్యమ నేతగా కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించిన వైనం ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ప్రధాని మోదీతో పాటూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవన నిర్మాణ శంకుస్థాపనకు వచ్చినపుడు కేసీఆర్ స్టేజ్‌పై కనిపించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పందించిన తీరే దీనికి నిదర్శనం. అందుకే ఆంధ్రప్రదేశ్లో బీఆర్‌ఎస్ మనుగడ నల్లేరుమీద నడకగానే భావింపవచ్చు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుతున్నట్టు ఎంతో అట్టహాసంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సహా తమిళనాడుకు చెందిన పలువురు నేతలు హాజరు కావడం విశేషం. పక్కా ప్రణాళికతోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను అనుకున్నది సాధించేంత వరకు ఆయన కదనరంగం నుంచి నిష్క్రమించరని కచ్చితంగా చెప్పవచ్చు.

తెలంగాణ ఉద్యమ నేపథ్యం పరిశీలిస్తే ఈ విషయం సునాయసంగానే అర్థమవుతుంది. సహజంగా ప్రతి నాయకుడు అవకాశాల కొరకు ఎదురు చూస్తూ రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కేసీఆర్ మాత్రం అవకాశాలను తానే సృష్టించుకుని తాను అనుకున్నదానిని అంది పుచ్చుకుంటారని ఆయన రాజకీయ చతురత పలుమార్లు తేటతెల్లం చేసింది.

ఏపీలో ఎలా ఉంటుంది?

దేశ రాజకీయాలలో బీఆర్‌ఎస్ ప్రభావం ఎలా ఉండబోతోందోగానీ, కేసీఆర్ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించబోయే వ్యూహం ఆ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కులాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. కొద్దికాలం మినహాయించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నుంచి నేటి నవ్యాంధ్రప్రదేశ్ వరకు రాష్ట్రాన్ని రెడ్డి, కమ్మ సామాజికవర్గాల నేతలే పరిపాలించారు. ఆ రెండు సామాజికవర్గాలే రాష్ట్రంపై పెత్తనం చేస్తున్నాయి.

ఈ రెండు సామాజిక వర్గాలకు లోపాయికారీ ఒప్పందం ఉన్నట్లుగా, రాజకీయాలలో ఇతర సామాజిక వర్గాలను ఎదగనీయకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుంటాయి. అభిమానుల బలం మెండుగా ఉండి, అత్యధిక జనాకర్షణ కలిగి, రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపు కులానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో 2009 లో ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీ కనుమరుగైన వైనమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 52 శాతం పైగా ఉన్న వెనుకబడిన తరగతులకు చెందినవారు దశాబ్దాలుగా అన్నిరకాలుగా నష్టపోతున్నారనేది నిర్వివాదాంశం.

ఎదుగుదల లేని బీసీలు

ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు జీవన ప్రమాణాలలో నామమాత్ర ఎదుగుదల లేని జాతులు ఏవైనా ఉన్నాయంటే అవి రాష్ట్రంలోని 136 బీసీ కులాలే అని కచ్చితంగా చెప్పవచ్చు. బీసీలను అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికలలో ఉపయోగపడే ఓటర్లుగానే చూస్తున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా బీసీల ఓట్లతో మనుగడ సాగిస్తున్న తెలుగుదేశం పార్టీ వలన కూడా వారి జీవన ప్రమాణాలు పెరగకపోవడం శోచనీయం.

తెలుగుదేశం పార్టీ వలన కేవలం మూడు కుటుంబాలే బీసీలలో బాగుపడ్డాయి. అందుకే 2019 ఎన్నికలలో బీసీలు అధికంగా వైఎస్ఆర్ సీపీ వైపు మొగ్గు చూపారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రాజకీయంగా కొన్ని నామినేటెడ్ పదవులైతే కేటాయించారు. కానీ, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగలేదు. దీంతో ఖంగుతిన్న బీసీలు రాజ్యాధికారంతోనే తమ బతుకులు బాగుపడతాయనే నిర్ణయానికి వచ్చారు. ఐక్యత లేకపోవడం వలననే రాజ్యాధికారం ఆనే వారి చిరకాల వాంఛ నెరవేరడం లేదు. బీసీలను ఏకతాటిపై నడిపే నాయకత్వం లేకపోవడం కూడా మరో ప్రధాన కారణంగా భావింపవచ్చు.

అన్నీ తెలిసే అడుగులు

నాలుగు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు క్షుణ్ణంగా తెలిసిన కేసీఆర్ బీసీల ప్రాధాన్యంతోనే జాతీయ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో విస్తరింప చేయాలని భావిస్తున్నారని సమాచారం. పార్టీ రాష్ట్ర బాధ్యతలను బీసీకి అప్పగించడమే కాకుండా తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాలని అనుకుంటున్నారని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు ఇటీవల కొందరు జర్నలిస్టులతో జరిపిన ఇష్టాగోష్టిలో వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న బీసీ వెలమ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చలకు తెరదీశారని అంటున్నారు. కోస్తా, ఉత్తరాంధ్రలో వెలమలు బీసీలుగా మనుగడ సాగిస్తున్నారు. అందుకే మొదట వీరితోనే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ బీసీ నేత పార్టీలోకి వస్తే నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

15 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీల కొరకు ప్రముఖ దిన పత్రికను నడుపుతున్న పత్రికాధిపతి సలహాలు కూడా తీసుకుంటున్నారని అంటున్నారు. కొందరు తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య నేతలతో దగ్గరి బంధుత్వాలు ఉన్నాయి. కేసీఆర్ పాత మిత్రులు కొందరు టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అనేక మంది నేతలు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇప్పటికీ అనేక రకాల పనులు చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో బీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అంశాలు. ఉద్యమ నేతగా కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించిన వైనం ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ప్రధాని మోదీతో పాటూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవన నిర్మాణ శంకుస్థాపనకు వచ్చినపుడు కేసీఆర్ స్టేజ్‌పై కనిపించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పందించిన తీరే దీనికి నిదర్శనం. అందుకే ఆంధ్రప్రదేశ్లో బీఆర్‌ఎస్ మనుగడ నల్లేరుమీద నడకగానే భావింపవచ్చు.

ALSO READ : బీఆర్ఎస్ కు జాతీయ పార్టీ హోదా శాశ్వతమేనా?


కైలసాని శివప్రసాద్

సీనియర్ జర్నలిస్ట్

హైదరాబాద్, 94402 03999

Tags:    

Similar News