త్రిశంకు స్వర్గంలో డిండి లిఫ్ట్ స్కీమ్

Even after years, the Dindi Lift Irrigation project was not completed

Update: 2024-01-24 00:45 GMT

కృష్ణా నది ఒడ్డున ఉన్న నల్లగొండ జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు, ఫ్లోరిన్ పీడిత గ్రామాలైన దేవరకొండ, మునుగోడు, నల్గొండతో పాటు నకిరేకల్ నియోజకవర్గాలలోని కొన్ని గ్రామాలకు సాగు, తాగునీరు అందించాలని చేపట్టిన ప్రాజెక్టే డిండి లిఫ్ట్ స్కీమ్. ఇది సంవత్సరాలు గడుస్తున్నా పునాదులలోనే కొనసాగుతున్నది.

నల్లగొండ జిల్లా ప్రజలు నిర్వహించిన పోరాటాల ఫలితంగా శ్రీశైలం ఎడమ గట్టు నుండి సొరంగం ద్వారా కృష్ణా జలాలు అందించే పథకాన్ని నాలుగు దశాబ్దాల క్రితం రూపొందించి 1981లో ఎస్‌ఎల్‌బీసీని చేపట్టడం జరిగింది. దీనికి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు 1983 మే 4న ఎడమ గట్టు సొరంగ పథకానికి, కుడిగట్టు పథకానికి శంకుస్థాపన చేశారు.

గత 20 ఏళ్లుగా..

51 కి మీ పొడవున్న టన్నెల్ ద్వారా నల్గొండలోని కరువు, ఫ్లోరైడ్ బాధిత 212 గ్రామాలకు నీరు అందించాలని రూ.482 కోట్ల అంచనాలతో రూపొందించారు. ఈ నిర్మాణం పనులు ఆలస్యం కావడం, ప్రజలు ఉద్యమించడంతో 1995లో నాగార్జునసాగర్ లోతట్టు పుట్టం గండి(ఏఎంఆర్) నుండి ఎత్తిపోతల ద్వారా 2001 నుండి తాగు, సాగునీరు అందిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఈ సొరంగ మార్గాన్ని పూర్తి చేయాలని ఉద్యమాలు చేయడంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్‌ఎల్‌బీసీలో భాగంగా, నక్కలగండి రిజర్వాయర్ నుండి డిండి ఎత్తిపోతలకు పథకాన్ని రూపొందించాలని జి. ఓ నెం.159ను తేది 7-7-2007న రూ.1.31 కోట్లు కేటాయిస్తూ సర్వేకు ఆదేశించారు. ఈ సర్వేలు చేసి నల్లగొండ జిల్లాలో 14 మండలాల్లోని 3,09,950 ఎకరాలకు, మహబూబ్‌నగర్ జిల్లాలో 5 మండలాల్లోని 31,550 ఎకరాలకు నీరందించటానికి, 32 టీఎంసీల నీటిని స్టోరేజి చేసుకోవడానికి 5 రిజర్వాయర్లను ప్రతిపాదించారు. దీనికోసం రూ.5 వేల కోట్లతో డీపీఆర్‌ను రూపొందించారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్ చనిపోవడం, తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం అందరికీ తెలిసిందే, 2015లో కేసీఆర్ వైఎస్ఆర్ ప్రతిపాదించిన డిండి ఎత్తిపోతల పథకాన్ని పక్కకు నెట్టి, పాలమూర్ - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో డిండిని చేర్చారు. దీని ద్వారా రోజుకు 0.5 టీఎంసీల నీరు చొప్పున 60 రోజులలో 30 టీఎంసీల నీరు ఎత్తిపోయడానికి 2015 జూన్ 11 న జీవో నెం. 107 జారీ చేశారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలతో పాటు అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు కలిపి 3.14 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేందుకు రూ. 6,190 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చారు.

ఏడుసార్లు సర్వే చేసినా...

దీని ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలతో పాటు అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు కలిపి 3.14 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేందుకు రూ. 6,190 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చారు. 2015 జూన్ 12 న చేర్లగూడెం రిజర్వాయర్ (శివన్నగూడెం,మునుగోడు నియోజక వర్గం) వద్ద కెసిఆర్ శంకుస్థాపన చేశాస్తు"నేను కుర్చీవేసుకొని 3 సం. రాలలో పూర్తి చేస్తామని హామీ" ఇచ్చారు. దానికి అతీగతీ లేకుండా పోయింది. మరోసారి 2016 వ సం.లో అసెంబ్లీ సాక్షిగా, పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్ స్కీంకి శ్రీశైలంలో వేర్వేరు పంపు హౌస్‌లు ఏర్పాటు చేసి నీటిని తరలిస్తామని సీఎం హోదాలో రెండోసారి హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకుని, పాలమూరు- డిండి ఎత్తిపోతలపై దృష్టి సారించలేదు. దీనిని అనుకూలంగా మలుచుకున్న ఇరిగేషన్ అధికారులు సర్వేల మాయకు తెరతీసి కాలం గడుపుతూ వస్తున్నారు. స్వరాష్ట్రంలో శంకుస్థాపన చేసిన రెండో ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీరు తీసుకోవాలనే అంశంపై ఇప్పటికీ ఏడుసార్లు సర్వే చేశారు. గత ఎన్నికలకు ముందు ఎనిమిదోసారి కూడా సర్వే కోసం టెండర్లు పిలిచి గతంలో ఏడుసార్లు సర్వేచేసిన ఏజెన్సీకే ఎనిమిదోసారి కట్టబెట్టారు. కేవలం రూ.50 లక్షలతో పూర్తయ్యే సర్వేకు ఏకంగా రూ.16.50 కోట్లు కట్టబెట్టారు. అయినా ఈ స్కీం ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది.

త్వరగా పూర్తిచేసి..

తరచుగా కరువు కాటకాలకు గురి అవుతున్న నల్లగొండ జిల్లా పశ్చిమ ప్రాంతానికి యుద్ధ ప్రాతిపధికన నీరందించటానికి కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలి. నూతన ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరినప్పటికీ, వారు ‘ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన’ కింద నిధులు 60:40 శాతం నిధులతో ప్రాజెక్టు పూర్తిచేసేందుకు సహకరిస్తామని వాగ్దానం చేయటం స్వాగతిస్తూనే.. తక్షణమే జరుగుతున్న పనులపై సమీక్షించి.. ఇంకా కావలసిన అనుమతులను పొంది 2024-25లో పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించి.. ఆర్థిక వనరులను సమీకరించి.. గత రెండు దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతూ ఎదురుచూస్తున్న జిల్లా ప్రజలకు సాగు తాగునీరు అందించాలని జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు..

-ఉజ్జిని రత్నాకర్ రావు

సీపీఐ సీనియర్ నాయకులు

94909 52646

Tags:    

Similar News