పరిశోధనా శ్రామికుడు.. డా. ముత్యం సార్
ఆయన పేరు ముత్యం. సత్యాన్వేషణే అతని తత్త్వం. ఏ ముహూ ర్తంలో పరిశోధనా రంగంలో అడుగులు వేశాడో కానీ ఎప్పటికి అతని ఆలోచనలు
ఆయన పేరు ముత్యం. సత్యాన్వేషణే అతని తత్త్వం. ఏ ముహూ ర్తంలో పరిశోధనా రంగంలో అడుగులు వేశాడో కానీ ఎప్పటికి అతని ఆలోచనలు, మాటలు, రాతలు, ఉపన్యాసాలు, స్నేహాలు అన్నీ పరిశోధనతో ముడిపడినవై ఉంటాయి. యూనివర్సిటీలు చెయ్యాల్సిన పని, రాష్ట్ర ప్రభుత్వం పురమాయించాల్సిన పరిశోధనను ఒక్కడే, సైనికుడిలా చేశాడు. ఏ సహాయం లేనప్పటికీ దాదాపు 25 పరిశోధనా పుస్తకాలను వేశారు.
ముత్యం సార్ శాతవాహన యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్ మాత్రమే, అందుకే తనకి కొన్ని సో కాల్డ్ సభల ఆహ్వానం అందకపోవడం మన భావదారిద్ర్యం. విషయం కన్నా ఉద్యోగ స్థానానికి మన సమాజం ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తుందో అర్థం అవుతుంది. ఆయా యూనివర్సిటీల్లో పొజీషన్‌లో ఉన్నవాళ్లు బయటకి చెప్పకుండా మమ అనిపించిన పరిశోధనలు, ఎన్నో లక్షల ఫండ్స్‌ను వాటికి మంజూరు చేయించుకున్నారు. అలాంటి దారులు ముత్యం సార్‌కి తెలువవు. అతను గెస్ట్ ఫ్యాకల్టీ అందుకే తనకి అధికారికంగా ఎటువంటి ఫండ్స్ ఇవ్వరని ఎప్పుడూ కనిపించని ఒక నిట్టూర్పు విడిచేవారు. ఇలాంటి పరిస్థితిలో కూడా ఆయన తన శోధనను ఆపలేదు..
అనితరసాధ్య పరిశోధన!
పీహెచ్‌డీ పరిశోధక విద్యార్థిగా శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం మీద అనితరసాధ్యమైన పరిశోధనా వ్యాసాన్ని రాశాడు. ఆ పరిశోధన కొనసాగిస్తూనే అనుబంధంగా ఎదురైన మరికొన్ని పరిశోధనాంశాలను కూడా తరువాతి కాలంలో తీసుకువచ్చారు. అలా వచ్చినవే సునాముది జీవధార. రైతుల ప్రతిఘటన-చరిత్ర- కథనం రైతుల ఆర్థిక శాస్త్రం. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి జీవిత దృశ్యం. పుల్లెల శ్యామ సుందరరావు జీవిత చరిత్ర, కష్టాల కొలిమి- త్యాగాల శిఖరం. సర్వదేవభట్ల రామనాథం జీవితం వంటివి.
చిందు ఎల్లమ్మపై ఉత్తమ గ్రంథం
ముఖ్యంగా నేను చిందు ఎల్లమ్మను అనే ఉత్తమ గ్రంథం ద్వారా చిందు ఎల్లమ్మ జీవితం వెలుగులోకి రావడానికి సార్ పడిన తపన, కష్టాలు, పెట్టిన ఖర్చు ఇంకెవ్వరూ పడలేదు. నిజామాబాద్ లోని ఆర్మూర్‌లో ఉంటున్న ఎల్లమ్మను, ఎల్లమ్మ జీవితాన్ని ప్రపంచానికీ ఎరుక చెయ్యాలని ఆ కళాకారిణి దగ్గరికి వీలుచేసుకొని తరచూ వెళ్లెందుకూ నానా అవస్థలు పడ్డారు. అయినా ఏనాడు ఆ శ్రమని, ఒత్తిడిని పరిశోధన మీద కనపడనివ్వలేదు. సహజ సిద్ధమైన భాషా, రసాత్మకమైన సంఘటనల కూర్పు, ఎల్లమ్మ కష్టాలు, వాస్తవ పరిస్థితులు మట్టిమీద, వృత్తిమీద మమకారం అన్నీ కలబోసిన గొప్ప గ్రంథం అది. తెలుగులో చిందు ఎల్లమ్మ ఆత్మకథ కొత్త ప్రయోగం. వేుధావి వెంకన్నతో కలసి స్మారక సంచికను తీసుకువచ్చారు. జీవిత చరిత్రలో సుబ్బారావు పాణిగ్రాహి జీవిత చరిత్రను కూడా తీసుకువచ్చారు. తెలంగాణ శాస్త్రాలు పేరుతో ఉత్తర తెలంగాణలోని సామెతలు తీసుకువచ్చారు. ఈ సామెతల సేకరణ కోసం ఒకరిద్దరు సేకరణ కర్తలను కూడా తన సొంత డబ్బు కేటాయించి పెట్టుకున్నారు. అందుకే అందులో ఉన్న సామెతలు ఇప్పటికి సజీవంగా మన ముందు మెదులుతుంటాయి.
తగిన గుర్తింపు రాలేదు..
తెలంగాణ భాష మీద పట్టు సాధించడానికి గొప్ప ఉపకరణం ఈ పుస్తకం. జాతీయ సెమినార్ నిర్వహణలో సార్ పడిన శ్రమ మాములుగా ఉండదు. మహామహులను కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయానికి రప్పించి గొప్ప పరిశోధనా పత్రాలను స్వీకరించి తదనుగుణంగా గొప్ప చారిత్రక గ్రంథాన్ని తీసుకువచ్చారు. ఆ పుస్తకమే తెలంగాణలో అలభ్య శాసనాలు- సాహిత్య గ్రంథాలు. మేర కులంలో పుట్టి పొలిమేరలు లేని సీరియస్ పరిశోధకుడిగా ఎన్నో అద్భుతాలు చేసినా తనకి రావలసినంత గుర్తింపు ఇంకా రాకపోవడం మన వెనకబాటుతనానికి నిదర్శనం. కన్న తల్లిని, పుట్టిన ఊరుని, ఇష్టపడిన భార్యని, పిల్లలను, నమ్ముకున్న సిద్ధాంతాన్ని, తెలుగు భాషని, పరిశోధనా తత్వాన్ని ఏనాడూ నిర్లక్ష్యం చెయ్యని నిఖార్సైన మహా మనిషి, కడిగిన ముత్యం మా ముత్యం సార్. మీకు కన్నీటి నివాళులు సార్..
-డా. మల్లెగోడ గంగా ప్రసాద్
డిగ్రీ అధ్యాపకుడు
73863 87249