వార్తాచానళ్ళ వాలకంలో రాజకీయ లోలకం
Effect of political pendulum in establishing news channels
నాలుగు దశాబ్దాల క్రితం చొక్కా ముందు భాగపు చివరలు తీసుకుని ముడి వేసుకోవడం పెద్ద ఫ్యాషన్ గా చలామణి అయ్యేది. టైలర్ చక్కగా సిద్ధం చేసిన షర్ట్ ను అలా ధరించి కొసలు గంటు వేసుకోవడమనేదానికి హిందీ సినిమా 'దీవార్' కారణమట. ఆ సినిమా షూటింగ్ సమయంలో చొక్కా కాస్త పొడవుండే సరికి ఆ సినిమాలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ అలా ముడి వేసుకున్నాడట! ఇంకేముంది బొంబాయి నుంచి కలకత్తా దాకా, ఇటు కన్యాకుమారి దాకా అలాగే వేలం వెర్రిగా ముళ్ళు వేసుకుంటూపోయారు. అయితే ఎంత వేగంగా ఆ వ్యవహారం చలామణిలోకి వచ్చిందో, అంతే వేగంగా అది సమసిపోవడం కూడా మొదలైంది. కొన్ని పోకడలు అలా వుంటాయేమో!
ఎందుకు మొదలై ఎక్కడికెళ్తున్నట్లు?
న్యూస్ మీడియా వాలకం చూస్తే ముఖ్యంగా టీవీ చానళ్లను పరిశీలిస్తే ఇలాగే అనుకోక తప్పదు. ఎందుకు మొదలయ్యాయో, ఎక్కడికెడుతున్నాయో చెప్పలేకున్నాం. భారతదేశంలోకి న్యూస్ టెలివిజన్ 1998 ఫిబ్రవరిలో ప్రవేశిస్తే, తెలుగులో న్యూస్ చానళ్ళు ఐదేళ్ల తర్వాత అంటే 2003 డిసెంబర్ చివరలో రంగ ప్రవేశం చేశాయి. కేవలం మూడు నెలలపాటు ఎన్నికల కోసం ప్రారంభిస్తున్నాం, తర్వాత మార్కెట్ బావుంటే కొనసాగిస్తామని దానిని ప్రారంభించిన స్టార్ టీవీ చెప్పుకుంది. 'స్టార్ న్యూస్' లో పెట్టుబడి రూపర్ట్ మర్దోక్‌దే అయినా, కంటెంట్ జనరేషన్ బాధ్యత పూర్తిగా ప్రణయ్ రాయ్ సొంత సంస్థ అయిన ఎన్‌డీటీవీది. అలా న్యూస్ టీవీ భారతదేశంలో ప్రవేశించి ఏదో వార్తల వ్యవహారంగా కాకుండా నిత్య సామూహిక కుటుంబ వ్యసనంలా మారిపోయింది. దేశంలో అన్ని భాషలలో కూడా వార్తలు ఇచ్చే చానళ్ళే సగానికి పైగా ఉన్నాయి. మిగతా అన్ని రకాలు కలిసి వీటిసంఖ్య కంటే తక్కువ. న్యూస్ చానళ్ళు నిర్వహించడం లాభదాయకమైన వ్యవహారం కాకపోయినా, వాటి సంఖ్య పెరగడం ప్రపంచంలో పదహారో వింత. పత్రికలకు మించి టీవీ చానళ్ళు ప్రకటనలను పొందడం వాస్తవమే అయినా ఆ రెవెన్యూ అంతా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ చానళ్ళకే వెడుతోంది. మత సంస్థలు, ధార్మిక సంస్థలు కొన్ని ప్రత్యేక చానళ్ళు నిర్వహిస్తున్నట్లే ఈ న్యూస్ చానళ్ళను ప్రత్యక్షంగా కొంతమంది, పరోక్షంగా ఎంతోమంది ఆదుకుంటున్నారు. తమ ప్రయోజనాలను తద్వారా చేదుకొంటున్నారు!
న్యూస్ చానళ్ల తెరవెనుక....
అన్నా డిఎమ్‌కే, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, కేరళలో సీపీఐ.ఎమ్ మొదలైన పార్టీలు నేరుగా న్యూస్ చానళ్ళలో పెట్టుబడి పెట్టి ప్రకటించుకొని వార్తా ప్రసారాలు చేస్తే ఎన్నో చానళ్ళు పైకి చెప్పుకోకుండా అంతర్గత స్ఫూర్తితో, అకుంఠితంగా కొందరు వ్యక్తుల, పార్టీల కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి. మరోవైపు తెలుగునాట సీపీఐ, సీపీఐఎమ్ చానళ్ళు ప్రారంభించి కొంత కాలానికి త్యజించుకున్నాయి. ఇంకోవైపు ప్రణయ్‌రాయ్ పలు చానళ్ళతో వేగంగా విస్తరించి చివరికి పారిశ్రామికవేత్త అదానీకి అమ్మివేశారు. దూరదర్శన్‌లో 80వ దశకంలో 'ది వరల్డ్ దిస్ వీక్', 'న్యూస్ నైట్' వంటి వార్త ధారిత కార్యక్రమాలతో రాణించి, చివరకు చానళ్ళ యజమానిగా మారారు. ఏషియా నెట్ మొదలుపెట్టిన కేర్ వాసి శశికుమార్ నేపథ్యం కూడా అలాంటిదే, ఇప్పుడు ఆ సంస్థ కూడా ఓ కర్ణాటక రాజకీయ నాయకుడి చేతిలో ఉంది. స్టార్ న్యూస్ కారణంగా ఢిల్లీ కేంద్రంగా చక్కగా మాట్లాడగలిగే యువతరం రాజకీయ నాయకులుగా పరిణమించారు. ఈ పోకడకు చాలామందిని ఉదాహరణగా చూపవచ్చు. వారిలో ఒకరు మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.
న్యూస్ చానళ్ల పూనకం చూసి పత్రికారంగంలో పెద్ద లాభాలు గడిస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, ఆనంద్ బజార్ పత్రిక, మళయాళ మనోరమ వంటి సంస్థలు ప్రవేశించి వార్తా సామ్రాజ్యాలను, ప్రాభవాల ప్రభాచక్రాలను ఎంతో కొంత విస్తరింప చేస్తున్నాయి. ఎన్‌డీటీవి తొలి దశలో సృజనాత్మకంగా ఆయా భాషలలో చానళ్ళు నిర్వహించే స్థాయిలో సిద్ధం కావాలని అడుగులు వేసింది, కానీ చివరికి విజయం సాధించలేకపోయింది. ప్రణయ్ రాయ్ అంతర్థానం పట్ల ఎంతోమంది సానుభూతి కలిగి ఉన్నా ఆర్థికపరమైన లావాదేవీల్లో పారదర్శకత లేని వైఖరి పట్ల అంతే స్థాయిలో సానుభూతి ఇవ్వలేకపోయారు. ఒక రకంగా చెప్పాలంటే న్యూస్ స్పిరిట్‌లో కానీ, న్యూస్ బిజినెస్‌లో కానీ చెప్పడానికి, చేయడానికి అంతరం ఉంది అని అందరికీ అర్థమయ్యింది!
తెలుగులో టీవీ న్యూస్ చానల్ శకం
ఇక తెలుగు విషయానికి వస్తే తొలుత టీవీ రంగంలోకి సినిమాతో సంబంధ బాంధవ్యాలున్న జెమిని, ఈటీవీ ప్రవేశించాయి. అయితే తెలుగులో న్యూస్ టెలివిజన్ రంగ ప్రవేశం చేయడానికి మళ్ళీ ఎన్నికలు కావలసి వచ్చింది. ఎన్నికల ముందు ఇదివరకు అయితే కొత్త పత్రికలు పెద్ద ఎత్తున వచ్చేవి. తర్వాతి కాలంలో న్యూస్ చానళ్ళు ఆ పని చేస్తున్నాయి. స్టార్ న్యూస్‌ను, ప్రణయ్ రాయ్ వ్యవహారాలను గమనించిన ఒక సబ్ ఎడిటర్ స్థాయి రవిప్రకాష్ తెలుగులో టీవీ న్యూస్ చానల్ శకం శ్రీకారం చుట్టుకోవడానికి కారణమయ్యాడు. 2004 ఎన్నికల ప్రచార నేపథ్యంగా 2003 డిసెంబర్‌లో తెలుగు న్యూస్ చానళ్ళు మొదలయ్యాయి. సొంత బాణీలో సాగే రామోజీరావు టెస్ట్ ట్రాన్స్‌మిషన్ అని ఈటీవీ న్యూస్ అనౌన్స్ చేస్తే, టీవీ 9 ప్రారంభం అంటూ రవిప్రకాష్ పనిచేసే టీవీ 9 ముందుకు వచ్చింది. ట్రాన్స్ మిషన్, టెస్ట్ ట్రాన్స్ మిషన్ - ఈ మాటల ఆధారంగా తమదే మొదటి చానల్ అని ఎవరికి వారు ప్రకటించుకునే వెసులుబాటు కలుగుతూ వుంటుంది. ఒక దశలో ఆరోగ్యం, మహిళలు వ్యవసాయం, భక్తి, భాష, గుళ్ళు గోపురాలు వంటి (వార్తలు కానీ) కార్యక్రమాలు ఇస్తున్నారని ఈటీవీ వారిది న్యూస్ చానల్ కాదని చెప్పుకునే స్థాయిలో తెంపరితనం, గెరిల్లా పోరాటం నడిచింది. అయితే తమాషా ఏమిటంటే 2004 ఎన్నికల తర్వాత అదే టీవీ 9 చానెల్ వార్తల కార్యక్రమాలను 50 శాతానికి మించి తగ్గించుకున్నది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించుకున్నారు కూడా. 9 నెలల లోపే ఏ నిర్వచనాల ఆధారంగా తమ ప్రచారాన్ని చేసుకున్నారో అవే తిరగబడడం గమనార్హం.
న్యూస్ చానళ్ల గుత్తాధిపత్యం
ఈ రెండు దశాబ్దాల తెలుగు టీవీ న్యూస్ చానళ్ళ చరిత్రలో మరెన్నో మలుపులున్నాయి. వాటిని ముందు ముందు సందర్భం అవసరం అయినప్పుడు చెప్పుకుందాం. అయితే విషాదమేమిటంటే సిసలైన టీవీ మీడియా వ్యక్తిగా చెప్పుకుంటూ ప్రవేశించి, విస్తరించి భారత్ వర్ష్ చానల్ ప్రారంభంలో భారత ప్రధానితో కలిసి కూచున్న రవిప్రకాష్ తరువాతి దశలో అండర్ గ్రౌండ్‌కు వెళ్ళే పరిస్థితి రావడం ఏమిటో? టీవీ 9 చానెళ్ళన్నీ మరొక యజమాని చేతిలోకి వెళ్ళడం ఒక ధోరణి కాగా, ఎంతో అనుభవం ఉన్న కుటిల వ్యాపార వేత్త అనే ప్రచారం కూడా ఉన్న రామోజీరావు పలు ఇతర భాషా చానళ్ళను రిలయన్స్ చేతికి అందజేయాల్సి వచ్చింది. తెలుగు టీవీ న్యూస్ చానళ్ళు తొలిదశలో సినిమాలకు దాసోహం అంటే తరువాత తర్వాత దశలో న్యూస్ సెన్స్ పోగొట్టుకుని పొలిటికల్ సౌండ్‌తో సాగి ఇప్పుడు సోషల్ మీడియాకు తలవంచుతున్నాయి. చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా చేదు విషయాలను కూడా గత చరిత్రగా మననం చేసుకోవాల్సిందే!
- డా నాగసూరి వేణుగోపాల్
9440732392