‘నాతో రా... నీకు కొడుకును కనిస్తా’

Update: 2024-07-01 01:00 GMT

‘‘అజోమ తోనా బేటా దూన్చు!’’..‘నాతో రా... నీకు కొడుకును కనిస్తా’ అంటూ చాంద్ బాయ్ తలమీద కొట్టుకుంటోంది. జుట్టంతా రేగిపోయి, ముఖమంతా దు:ఖంతో ఎర్రబడిపోయింది. రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో యుగాలుగా బంజారా స్త్రీల గొంతుల్లోంచి వినిపించే పాట. అన్న భూక్యా ఆమె భుజాలు తట్టి ‘‘భెన్..ఛాల్’’ ‘చెల్లీ పద’’ అంటున్నాడు. ‘‘హే చాందీ బాయి ఊట్ కాయి కర్రోచు..ఊట్..ఊట్..’’ అంటోంది వదిన పద్మ. ‘‘మొగనితో జగడమైనప్పటి కెల్లి పాగల్ అయ్యింది. ఇట్లా ఎవరన్నా మొగోళ్లు కనిపిస్తే తన మొగుడనుకుని ఎంటపడతది. లగ్గమయి పదేండ్లయినా పిల్లలు గాలె. ఆమె బాధంతా అదే.’’ అంటూ ఆమె అన్న సంజాయిషీ ఇచ్చుకుంటున్నాడు. వెనక్కి వెనక్కి చూస్తూ, కళ్లనిండా నీళ్లతో, తన పొత్తి కడుపు పైన గుద్దుకుంటూ తరలిపోతోంది చాంద్ బాయ్.

త్వరలో ఆవిష్కరణ జరగనున్న గీతాంజలి ‘‘ఈ మోహన్రావున్నాడు చూడండి’’ కథా సంపుటిలో ‘అజోమ తోనా బేటా దూన్చు’ కథ కదిలించేస్తుంది. బంజారాల భాషతో ఆ మహిళల ఆత్మ ఘోషను గీతాంజలి సజీవంగా దృశ్యమానం చేశారు. అందుకోసం నెలల తరబడి వారితో తిరిగి, వారి భాషను రికార్డు చేసి రాసిన కథ ఇది.

భార్యను కంచానికి, మంచానికి పరిమితం చేస్తే

‘‘నువు నాతో మాట్లాడు, ఈ ప్రపంచాన్నంతా పక్కకు నెట్టేసి వింటాను. ఈ ప్రపంచాన్నంతా నీలోనే చూసుకుంటాను. స్నేహితుడిలా.. ప్రేమికుడిలా..సహచరుడిలా రోజూ పలకరించే తోటలోని గువ్వలా మాట్లాడు..’’ అంటూ స్వర తన భర్త కార్తీక్‌కు మెసేజ్‌లు పెడుతుంది. కార్తీక్ మాత్రం ‘‘అబ్బా..హుష్ ..షటప్..’’ అంటాడు. బాల్య స్నేహితుడు అన్వేష్ మాటల ప్రవాహం..సంభాషణల సంగీతం. చాలాకాలానికి ఎదురుపడి ఇద్దరూ మళ్లీ పాత స్నేహాన్ని కొనసాగిస్తారు. ‘‘నమ్మక ద్రోహి’’ అంటాడు కార్తీక్. ‘‘అన్వేష్ ఏం చేయడు. నాతో మాట్లాడతాడు. నన్ను వింటాడు’’ అంటుంది స్వర. ‘‘గెటౌట్’’ అంటాడు కార్తీక్. ‘‘థాంక్స్’’ అంటుంది స్వర అన్వేష్ తో వెళ్ళిపోతూ. భార్యను ఒక మనిషిగా కాకుండా, కంచానికి, మంచానికి పరిమితం చేస్తే చెప్పే గుణపాఠమే ‘‘మాట్లాడు."

కారేది ఇక కన్నీళ్లే పాపా..!

‘‘నీవు పాలు తాగితే నా రొమ్ములు ముడుచుకుపోతాయట. కోరికతో నలిపేసే మీ నాన్న చేతులు నేనెలా భరించను? కళ్లల్లోంచి, రొమ్ముల్లోంచి కారేది ఇక కన్నీళ్లే పాపా..’’ అంటూ అమృత డైరీలో తన రొమ్ముల ఆత్మఘోష రాసుకుంటుంది. పాలను పిండేసి పారపోయిస్తాడు. రొమ్ములో గడ్డలు కట్టి, చీము నిండి, నిలువెల్లా జ్వరమే ! రొమ్ములను తీసేయాల్సి వస్తుంది. అమృత డైరీ నిండా రాసుకున్న కన్నీటి ధారలే ‘‘బ్రెస్ట్ టాక్’’

రాక్షస రతి క్రీడ

పందిరి మంచం అంటే వత్సలకు పీడకల. తనను నలిపేస్తూ, వత్తేస్తూ, తోసేస్తూ, కొట్టేస్తూ, ఒద్దంటే పిడిగుద్దులు, తొడపాశాలు. మంచం మీద పడేసి కానిచ్చే రాక్షస క్రీడ గుర్తుకొస్తుంది. పట్టెమంచాన్ని భోగిమంటల్లో వేసి కాల్చేస్తుంది ఆద్య. వదినె ఛాతీ మీద చాలా చోట్ల తన అన్న పళ్లతో కొరికిన గాయాలను చూసి ఆమె, ఆమె తల్లి బాధపడితే, తండ్రి కొడుకును గదిలోకి లారీ లాక్కెళ్లి చావ కొడతాడు. చాలా అరుదైన సంఘటనలతో సాగే ‘అనగనగా..ఒక మంచం.'

కరోనా అంటించి మరీ చంపి..!

ఆమెపై తొలి రాత్రి జరిగిన అత్యాచారం ప్రతి రాత్రీ జరుగుతుంది. జ్వరం వచ్చినా, నెలసరయినా, గర్భం వచ్చినా, గర్భస్రావం జరిగినా పాక్కుంటూ, దేక్కుంటూ అతని అవసరాలు తీర్చాల్సిందే. అతనికి కరోనా వచ్చింది. ఎంత వద్దన్నా ఒక రాత్రి భల్లూకంలా మీద పడ్డాడు. అతను బతికిపోయాడు. ఆమె చచ్చిపోయింది. భర్త వల్ల అంటిన కరోనాతో మరణించిన ఆమె ఆత్మఘోషే ‘ఈ మోహన్రావున్నాడు చూడండి’

వంటిల్లు.. నడకే జీవితం..

ఒకామె టన్నుల కొద్దీ సాంబార్లు, పులుసులు చేస్తుంది. మరొకామె లక్షల్లో చపాతీలు ఒత్తుతుంది. అమ్మమ్మ, నానమ్మ, ముత్తమ్మ, అమ్మ, పిన్ని, అక్క, అత్త, కోడళ్లు, కూతుళ్లు, భార్యలు ఇలా పనులు చేస్తూనే ‘ఇరవై నాలుగు గంటలు-పదిమైళ్లు’ ఇంట్లోనే నడుస్తుంటారు.

తిండిలేకపోయినా సెక్స్ యావే!

దేవయానికి చీలమండ నుజ్జు నుజ్జు అయిపోయింది. సర్జరీ అయిన కాలు నడుము నుంచి పాదం వరకు ఎంత సలుపుతోందో! వదిన శశిరేఖ గొణుగుడు, కూతురు మాధుర్య సెల్‌లో మునిగి తిప్పేసుకునే మొహం, పనులన్నింటినీ దేవయాని మంచం దగ్గరకే తెచ్చింది వదిన శశిరేఖ. కాలు తగ్గకపోయినా నిదానంగా పనులు మొదలయ్యాయి. భర్త జగన్‌కు తిండిలేకపోయినా సెక్స్ కావాలి. ఒకసారి తిరస్కరించింది. డాక్టర్ రెస్ట్ తీసుకోవాలన్నాడు. అయినా దేవయాని వంటింటికి, బెడ్ రూంకి వాకింగ్. ఒక రాత్రి జగన్ తాగొచ్చి నిద్రలోనే దేవయానిని ఆక్రమించాడు. పెనుగులాటలో అతన్ని తోసేసి తప్పించుకుంది. జగన్ తూలి కిందపడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. దేవయాని స్నేహితురాలు ఫర్హానా వచ్చింది. అందరూ చూస్తుండగానే ‘లాంగ్ సిక్ లీవ్ పెట్టి వెళ్లిపొతున్నా’ అంటూ దేవయాని ఫర్హానా కారెక్కేస్తుంది ‘ఫ్రాక్చర్’ కథలో. ఇలా ఒక్కో కథ వెల్లడి కాని ఒక్కో విషాదం.

ఇప్పుడు పవిత్రమైపోయావ్ అంటూ..

దాదీమా, ఇంకో స్త్రీ ఇద్దరూ తన కాళ్లను వెడల్పు చేసి పట్టుకున్నారు. తన చెడ్డీ విప్పుతుంటే..‘‘నక్కో..క్యొం..’’అని అడిగింది. కాళ్లు వెడల్పు చేస్తుంటే భయంతో గింజుకుంది. మగ డాక్టరు, ఆయా కల్సి తన కాళ్ల మధ్య బ్లేడుతో కోసేశారు. గుండెలు మెలితిప్పే పెను నెప్పితో ‘‘అమ్మీ నక్కో..’’ అని అరిచింది. ‘‘చుప్ హోజా బేటీ.. నువ్విప్పుడు శుభ్రమైపోయిన ఆడదానివి, పవిత్రమై పోయావు.’’ దాదీమా చెవుల దగ్గర గుసగుసలాడింది. తల్లి ఇంట్లో లేని సమయంలో యాస్మిన్‌కు ఖత్నా జరిగిపోయింది. ఒక చిన్న రంధ్రం పెట్టి, కాళ్ల మధ్య ఉన్న రెండు మడతల్నీ కలిపి కుట్లు వేసేస్తారు. నరకయాతన. శోభనానికి ముందు ఆపరేషన్‌తో గాయం చేసి కుట్లు విప్పుతారు. ప్రసవం అయ్యాక మళ్లీ కుట్లు. దావూదీ బోహ్రా వర్గంలో స్త్రీలకు అన్ని అనుభూతులను శాశ్వతంగా దూరం చేసే దారుణమైన సంప్రదాయం. తన కూతురు మసూమాకు ఇలా జరగకూడదనుకుని యాస్మిన్‌ తల్లితో కలిసి రక్షించుకుంటుంది. ‘ఖత్నా’ కథ చదివే వరకు ఈ దారుణం ఒకటి ఉందని నాకు తెలియదు. చదువుతుంటే గుండెను పిండేసింది. మొహమంతా వేడెక్కిపోయింది. గీతాంజలి రాసినవి కథలు కావు. వెల్లడి కాని చేదైన పచ్చి నిజాలు.

పుస్తకం: ఈ మోహన్రావున్నాడు చూడండి

రచన: గీతాంజలి (డాక్టర్ భారతి)

పేజీలు: 135

వెల : రూ. 200

ప్రతులకు : గీతాంజలి

88977 91964


పరిచయకర్త

రాఘవ

94932 26180

Tags:    

Similar News

అమరత్వంపై