అద్భుతం.. ఏడు బావుల జలపాతం

అద్భుతం.. ఏడు బావుల జలపాతం... editorial on tourist spot edu bavulu waterfalls in telangana

Update: 2022-12-09 18:30 GMT

ఈ జలపాతం గురించి తెలిసిన పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో రావడంతో గతంలో కొన్ని ప్రమాదాలు జరిగాయి దీంతో అక్కడ పర్యటించడానికి అనుమతి లేదని పోలీసు, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరించినా పర్యాటకుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. అందుకే టూరిజం అధికారులు ఏడు బావుల జలపాతం వద్ద కనీస ఏర్పాటు చేసి ప్రజా సందర్శనకు అనుమతించాలని ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని పర్యాటకులు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో గల బొగత జలపాతం వద్ద పర్యాటక ఏర్పాట్లు కల్పిస్తున్నట్లుగానే ఏడు బావుల జలపాతం వద్ద కూడా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

కప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా బయ్యారం మండలం పరిధిలో ఉన్న పాండవుల గుట్ట ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పరధికి చేరింది. దట్టమైన అడవులలోని ఎత్తయిన పర్వత ప్రాంతం ఇది. ఇక్కడ ఏడు వరుసలలో అమరిన ఏడు బావుల జలపాతం ఉంది. ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఒకదానిపై ఒకటి వరుసగా పరచినట్లు బావులు అమరి ఉండటంతో 'ఏడు బావులు'(edubavula) అనే పేరుతో ప్రాచుర్యం పొందింది. ఈ బావులలో నీరు ఒక బావి నుంచి మరో బావిలోకి దూకుతుంది. ఏ వన కన్య స్నానం కోసం నీరు తరళి వెళ్తుందా? అన్నట్లుగా, అరకు అందాలను తలపిస్తున్న పాండవుల గుట్ట సోయగాలు అత్యద్భుతం. వర్షాకాలం వచ్చిందంటే ఆ ప్రాంతంలో పర్యాటకులు సుదూర ప్రాంతాల నుండి అక్కడికి విచ్చేసి సందడి చేస్తారు.

దీని వెనకున్న చరిత్ర

ఈ ప్రాంతం అపార వృక్ష సంపద కలిగిన అడవి. ఇల్లందు నుండి ప్రైవేటు వాహనాల ద్వారా వెళితే 18 కిలోమీటర్ల దూరంలో మిర్యాలపెంట(miryalapenta) చేరుకోవచ్చు. అక్కడి నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల అటవీ మార్గంలో కాలిబాటన ప్రయాణిస్తే ఈ జలపాతానికి చేరుకోవచ్చు. ఇక్కడి జలపాతం సుమారు 900 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీనిని ఆస్వాదించడానికి పర్యాటకులు గుట్టను అధిరోహించాలి. జూలై నుంచి ఫిబ్రవరి అనువైన సమయం. ఇక్కడికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోయినా, కనీస ఏర్పాట్లు కానరాకున్నా, అధికారులు ప్రమాదమని హెచ్చరించినా ఈ జలపాతం విశేషాలు చెవిన పడిన పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. ఇక్కడి జలపాతం ఏర్పడటానికి ఆసక్తికర చరిత్ర ఉంది.

పాండవులు వనవాసం చేయడానికి ఈ గుట్టను అనువైన ప్రాంతంగా ఎంచుకొని అక్కడ ఏడుబావులు నిర్మించారని చెబుతారు. అందుకు అనుగుణంగానే ఏడు కొండలపైన ఏడు జలపాతాలు ఒకదానికొకటి అనుసంధానించి కనిపిస్తాయి. మొదటి కొండ నుంచి దూకే నీళ్లు రెండో కొండపై, రెండవది నిండగానే మూడవ కొండపై బావిలో అలా చివరి కొండపై పడిన నీళ్లు అక్కడే ఇంకిపోయి అదృశ్యమవడం వింతగా అనిపిస్తుంది. ఇలా ఇక్కడ పాండవులు అరణ్యవాసం చేయడంతో అది పాండవుల గుట్టగా(pandavula gattu) మారింది. పాండవులు ఇక్కడే అరణ్యవాసం చేసారని ఆదివాసీ జానపద కథనాలు తెలుపుతున్నాయి.

పర్యాటక ప్రాంతంగా చేయాలని

ఈ జలపాతం(tourist spot in mahabubabad) గురించి తెలిసిన పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో రావడంతో గతంలో కొన్ని ప్రమాదాలు జరిగాయి దీంతో అక్కడ పర్యటించడానికి అనుమతి లేదని పోలీసు, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరించినా పర్యాటకుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. అందుకే టూరిజం అధికారులు ఏడు బావుల జలపాతం వద్ద కనీస ఏర్పాటు చేసి ప్రజా సందర్శనకు అనుమతించాలని ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని పర్యాటకులు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో గల బొగత జలపాతం వద్ద పర్యాటక ఏర్పాట్లు కల్పిస్తున్నట్లుగానే ఏడు బావుల జలపాతం వద్ద కూడా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.


గుమ్మడి లక్ష్మీ నారాయణ

సామాజిక రచయిత,

9491318409

Tags:    

Similar News