రియల్ ఎస్టేట్ భూతంతో మనం కోల్పోతున్న సాగుభూములెన్నో తెలుసా?
రియల్ ఎస్టేట్ భూతంతో మనం కోల్పోతున్న సాగుభూములెన్నో తెలుసా?... Editorial on Real Estate Expanding in Farmlands
మన దేశం వ్యవసాయ దేశం. ఇక్కడ 60 శాతం జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయంతో మన దేశానికి విడదీయరాని అనుబంధం ఉంది. వ్యవసాయంతోనే పండుగలు ముడిపడి ఉంటాయి. ఒకప్పుడు వ్యవసాయ భూమి ఉంటే సంఘంలో ఎంతో గౌరవ మర్యాదలుండేవి. వ్యవసాయ భూమిలో మన దేశం పదవ స్థానంలో ఉంది. ఆహార ఉత్పత్తులు అధికంగా ఎగుమతి చేస్తున్న మొదటి దేశాలలో ఒకటిగా ఉంది. ప్రపంచంలోనే ఎక్కువగా పప్పు దినుసులు, మసాలాలు, జనపనార, మామిడి అరటి పండిస్తున్న దేశం మనది. వరి, గోధుమ, పండ్లు, కూరగాయ, పత్తి, చెరుకు, నూనె గింజలు ఉత్పత్తి చేస్తున్న దేశాలలో రెండో స్థానంలో ఉంది. ఇంతటి ఘనత భూములు ఇప్పుడు వ్యవసాయేతరాలుగా మారుతుండటంతో దేశంలో ఆహార భద్రత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.
అప్పటికీ, ఇప్పటికీ
మన రాష్ట్రంలో దాదాపు 20 యేళ్ల కిందట ఊర్లలో రోడ్డుకు ఇరు పక్కలా ఆకు పచ్చ సాగు భూములే ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు ఇవన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు కూడా పాకింది. వేల సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు తయారవుతున్నాయి. లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ప్లాట్లుగా మారిపోతోంది. పారిశ్రామిక అభివృద్ధి, ఇతర ప్రగతి పనుల కోసం కొంత మేరకు వ్యవసాయ భూమి వ్యవసాయేతరంగా మారిపోతోంది. దీని ద్వారా కొంత అభివృద్ధి కలిగి, జీవనోపాధి లభించినా, మిగతా భూములన్నీ బీడుగా మారిపోయి దేశ వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాలు ఉన్న సాగు భూమిలో 22.23 లక్షల ఎకరాలు వ్యవసాయేతరంగా మారిపోయింది.
గత పదేండ్లలోనే 11.95 లక్ష ఎకరాల సాగు భూమి వ్యవసాయేతర భూమిగా మారిందంటే ఎంత వేగంగా వ్యవసాయం తగ్గుతున్నదో అర్థం చేసుకోవచ్చు. గతంలో హైదరాబాద్ శివారు లేదా జిల్లా కేంద్రాలకే రియల్ ఎస్టేట్ పరిమితమయ్యేది. ఇప్పుడు హైదరాబాద్‌కు అన్ని వైపులా దాదాపు 70 కిలోమీటర్ల వరకు ఏర్పడ్డాయి. హైవే నుంచి పది కిలోమీటర్ల లోపలి వరకు విస్తరిస్తున్నాయి. రియల్ వ్యాపారులు అధిక ధరలు ఇవ్వడంతో రైతులు భూములు అమ్మడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు వారి ఆర్థిక పరిస్థితులు, అవసరాలు, సాగులో నష్టాలు కారణమవుతున్నాయి. ఈ భూములను కొనుగోలు చేసి పత్రికలలో, టీవీలలో ప్రచారం చేసి అమ్ముతున్నారు. ప్రజలు సైతం దీనిని పెట్టుబడిగా భావించి ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. రైతు, రైతుకూలీలు ఉపాధికి దూరమవుతారు.
నిబంధనలు కఠినతరం చేయాలి
సాగు భూములు తగ్గిపోవడాన్ని తీవ్రంగా భావిస్తున్న ప్రభుత్వాలు దానిని నివారించడానికి కొన్ని కఠిన నిబంధనలు తీసుకుంటున్నాయి. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో వ్యవసాయ భూములు రైతు మాత్రమే కొనుగోలు చేసేలా చట్టాలు ఉన్నాయి. కేరళలో 'పాడీ ఆండ్ వెట్ ల్యాండ్ కన్జర్వేషన్ యాక్ట్- 2008'(paddy and wetland conservation act) ప్రకారం వ్యవసాయేతర అవసరాల కోసం గరిష్ఠంగా పది ఎకరాలు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇందులోనూ నాలుగు ఎకరాలో మాత్రమే నిర్మాణం చేపట్టేందుకు అనుమతి ఉంది. ఇలాంటి పటిష్ట చట్టాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాలి.
ప్రజల ఆహార భద్రతకు, పర్యావరణానికి, ప్రజల జీవనోపాధికి ముప్పుగా మారిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఇష్టారాజ్యముగా భూములు లేఅవుట్లుగా మారకుండా అవసరమైనంత వరకే అనుమతులు ఇవ్వాలి. అక్రమ లేఅవుట్లను పూర్తిగా అరికట్టాలి. నివాస యోగ్యత ఉన్న ప్రాంతాలలోనే లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాలి. వ్యవసాయ భూమిని ఇతర అవసరాల కోసం మార్చే సమయంలో నిబంధనలు కఠినతరం చేయాలి. పరిశ్రమ ఏర్పాటుకు వ్యవసాయ భూమిని మార్పు చేయించుకుంటే కాలపరిమితిని విధించాలి. కాలపరిమితిని దాటిపోతే ఆ భూమిని మళ్లీ వ్యవసాయ భూమిగా మార్చేలా నిబంధనలు ఉండాలి.
దండంరాజు రాంచందర్ రావు
హైదరాబాద్, 98495 92958
Also Read...