విద్యార్థులూ దేశ భవిష్యత్ మీదే

విద్యార్థులూ దేశ భవిష్యత్ మీదే... editorial on international students day

Update: 2022-11-16 18:45 GMT

నేడు విద్యార్థులు ఎక్కువగా సినిమాలు, షికారులతో కాలం వెళ్లదీస్తున్నారు. నిత్యం వాట్సాప్, పేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌లో ఉంటూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఆరోగ్యాలనూ పాడు చేసుకుంటున్నారు. దేశభక్తి సన్నగిల్లింది. విదేశీ సంస్కృతిని అలవాటైంది. పార్కులు, పబ్బులు అంటూ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం, తల్లిదండ్రులను దూషించడం పరిపాటిగా మారింది. జల్సాలకు అలవాటు పడి పార్టీలు చేసుకోవడం, తాగడం, తినడం,పేకాడడం, బెట్టింగ్ లాంటివి ఎక్కువవుతున్నాయి. నాయకత్వ లక్షణాలు లేకుండా పోతున్నాయి. దేశమంటే మట్టి కాదు మనుషులు. తోటివారిని ప్రేమగా, గౌరవంగా చూడాలి. ఒక లక్ష్యం ఏర్పరచుకుని దానిని చేరుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. స్వామీ వివేకానంద బోధనలను అధ్యయనం చేయాలి. మహనీయుల గాథలను చదవాలి. సేవ చేయడం అలవాటు చేసుకోవాలి.

ప్రతి ఒక్కరూ నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారు. కావున ప్రతి ఒక్కరిని విద్యార్థిలాగే భావించాలి. కానీ, నేడు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో చదివేవారినే విద్యార్థులని పిలుస్తున్నారు. పూర్వ కాలంలో బాలలకు ఐదేళ్లు నిండితేనే పాఠశాలలో వేసేవారు. ఇప్పుడు పట్టుమని రెండేళ్లు కూడా నిండకుండానే బచ్పన్, కిండర్ గార్డెన్, ప్లేవే లాంటి బడులలో వేస్తున్నారు. వారు చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమవుతున్నారు. బుడిబుడి అడుగులు కూడా వేయలేని వయసులో బడి బాట పట్టి విద్యార్థులుగా మారుతున్నారు. పలకా బలపం పట్టి అ,ఆ,ఇ,ఈ రాయవలసిన చేతులు పెన్ను, పేపర్ పట్టి ఎ,బి,సి,డి రాస్తున్నాయి. యేటా నవంబరు 17న అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం జరుపుకుంటారు.

జర్మనీ నియంత హిట్లర్ సామ్రాజ్య విస్తరణ కాంక్షతో పొరుగు దేశాల మీద దాడి చేసేవాడు. జెకోస్లోవేకియాలోని ప్రెగ్ నగరంలో ఉన్న విశ్వవిద్యాలయంలోనికి నాజీ సేనల ప్రవేశాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో నాజీలు అక్కడ మారణకాండను సృష్టించి పది మంది విద్యార్థి నాయకులను పొట్టనబెట్టుకున్నారు. మరో 1,200 మంది విద్యార్థులను 'కాన్సంట్రేషన్ క్యాంప్'కు తరలించినారు. ఆ దుర్ఘటన జరిగింది 1939 నవంబరు 17న. ఆ తర్వాత మూడేళ్లకు లండన్‌లో సమావేశమైన అంతర్జాతీయ విద్యార్థుల సమైక్య మండలి విద్యార్థుల బలిదానానికి గుర్తుగా నవంబరు 17ను అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరపాలని తీర్మానించింది. అప్పటి నుంచి సోవియట్ యూనియన్ దీనిని యేటేటా ఘనంగా నిర్వహించింది.

విజ్ఞానం కోసం తపించేవారంతా నిజమైన విద్యార్థులని నేడు ప్రపంచమంతా అంగీకరిస్తోంది. విద్యకు వయసుతో సంబంధం లేదు. మన దేశములో పురాతన శాసనాల గురించి, ప్రాచీన గ్రంథాల గురించి, చరిత్ర, ఆర్కియాలజీ అంశాలలో కృషి చేసి పేరెన్నికగన్న చాలామందికి డిగ్రీలు లేవు. అయినప్పటికీ, వారు ఆయా అంశాలలో నిష్ణాతులు. నిత్య విద్యార్థులుగా శ్రమిస్తూనే ఉంటారు. వయోజన విద్య, యువ విద్య, బాలల విద్య, మహిళా విద్య పేరిట అనేక పథకాలు అమలులో ఉన్నాయి. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ప్రతి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు. పెద్దలను గౌరవించడం, సమాజం పట్ల అవగాహన కలిగి ఉండడం, నేర్చుకోవాలనే జిజ్ఞాస అదనపు లక్షణాలు. విద్యతో పాటు సాంస్కృతిక, కళారంగాలలోనూ రాణించాలి. నేడు విద్యార్థులు ఎక్కువగా సినిమాలు, షికారులతో కాలం వెళ్లదీస్తున్నారు. నిత్యం వాట్సాప్, పేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌లో ఉంటూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఆరోగ్యాలనూ పాడు చేసుకుంటున్నారు.

దేశభక్తి సన్నగిల్లింది. విదేశీ సంస్కృతిని అలవాటైంది. పార్కులు, పబ్బులు అంటూ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం, తల్లిదండ్రులను దూషించడం పరిపాటిగా మారింది. జల్సాలకు అలవాటు పడి పార్టీలు చేసుకోవడం, తాగడం, తినడం,పేకాడడం, బెట్టింగ్ లాంటివి ఎక్కువవుతున్నాయి. నాయకత్వ లక్షణాలు లేకుండా పోతున్నాయి. దేశమంటే మట్టి కాదు మనుషులు. తోటివారిని ప్రేమగా, గౌరవంగా చూడాలి. ఒక లక్ష్యం ఏర్పరచుకుని దానిని చేరుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. స్వామీ వివేకానంద బోధనలను అధ్యయనం చేయాలి. మహనీయుల గాథలను చదవాలి. సేవ చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు విడుదల చేస్తోంది. ప్రతీ సెకను విలువైనదిగా భావించండి. విజయం సాధించండి. ఈ దేశ భవిష్యత్ మీ మీదనే ఉందని గుర్తించండి.

(నేడు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం)


కామిడి సతీశ్‌రెడ్డి

జడలపేట, జయశంకర్ భూపాలపల్లి

98484 45134

Tags:    

Similar News