సాహితీ పద్మాక్షి.. రాజ్యలక్ష్మి

Dr. Veluolu Rajyalakshmi Sahitya Prasthanam

Update: 2023-11-02 23:15 GMT

ఒక చిన్న గ్రామంలో, విద్యాగంధం లేని ఓ సాధారణ కుటుంబంలో పుట్టినా, తన పెద్దల నుండి దైవభక్తిని, దేశభక్తిని మెండుగా పుణికిపుచ్చుకున్నారు రాజ్యలక్ష్మి. వీటికి తోడు విద్యా పరిమళాలను ఆస్వాదించాలనే పట్టుదలతో విద్యాభ్యాసం సాగించి డాక్టరేట్ పొందారు ఈ విదుషీమణి. అంతేకాదు విద్యారంగంలో ప్రాచార్య పదవిని చేపట్టి సమర్థంగా నిర్వహించారు. చక్కగా పాఠాలు చెప్పి ఉత్తమ అధ్యాపక పురస్కారం పొందారు. అనేక సాహితీ రూపకాలను రచించి, సాహిత్యాభి నివేశంగల కొంతమంది మహిళలను చేర్చుకుని వాటిని ప్రదర్శించి సెహబాష్ అనిపించుకున్నారు.. ఒక జీవన శకలం వీరి అక్షర యాత్రకు నాంది. ‘బడి నుండి ఇంటికి వెళ్తూ తుఫానులో చిక్కుకున్నప్పుడు తన చీర కొంగు కప్పి నన్ను పొదవుకుని పదిలంగా ఇంటికి చేర్చిన పాలమ్ముకునే పడతి గుండెలోని ఆర్ద్రత నా కవన సుందరికి ఆభరణం’ అంటారీమె. ఆమె మనసును చలింపచేసిన జీవనగమనంలోని సాధారణ దృశ్యాలు ఆమె కవిత్వానికి ప్రేరణనే కాక, వస్తువునూ ఇచ్చాయి.

నేడు డాక్టర్ వెలువోలు నాగ రాజ్యలక్ష్మి పేరు సాహితీ రూపకాలకు పర్యాయ పదమైంది. కిందటి శతాబ్దిలో నాటి శ్రీ కృష్ణ దేవరాయల భువనవిజయాన్ని అనుకరిస్తూ సాహితీ రూపకాలను తయారుచేసి సాహితీ దిగ్దంతులైన దివాకర్ల వేంకటావధాని, యస్వీ జోగారావు, డాక్టర్ ప్రసాదరాయ కులపతి ప్రభృతులు కవుల పాత్రలను పోషిస్తూ లబ్ద ప్రతిష్టులయ్యారు. ప్రేక్షకులను రసజగత్తులో విహరింపచేసి పరవశులను చేశారు. ఎందరో ప్రతిభామూర్తులు దీనిలో పాల్గొని తమ పాండిత్యాన్ని తళుకులీనేటట్టు చేసారు. ఆ సాహితీమూర్తులు, ఆ సాహితీరూపకాల గురించి విని, సమకాలీనులైన కొందరివి ప్రత్యక్షంగా తిలకించి పరవశియైన రాజ్యలక్ష్మిగారి మదిలో తనెప్పటికైనా అటువంటి సాహితీ రూపకాలలో పాల్గొనగలిగితే బావుంటుందన్న ఊహ జనించింది. అది సాకారం కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆమె పటిష్టమైన ప్రాచీన సాహిత్య నేపథ్యం, మక్కువ, పట్టు ఆమెను సాహితి రూపక రంగాగ్రేటం చేయించి భువన విజయాది సాహిత్య రూపకాలలో మొల్ల, తరిగొండ వెంగమాంబ, మధురవాణి, కనపర్తి వరలక్ష్మమ్మ మొదలైన పాత్రలను పోషించేటట్టు చేసింది. ఈ వెన్నుదన్ను, పరిణతితో తానే సాహితీ రూపకాలను రచించి ఎందుకు ప్రదర్శించ కూడదన్న ఆలోచనా బీజం ఆమె మనోక్షేత్రంలో అంకురించింది. అది మొక్కై, చెట్టయై అనేక సాహితీ రూపక శాఖోపశాఖలై సాహిత్యాభిమానులను, పండితులను ఆనంద పరుస్తోంది. ఇదొక విశేషం.

మరొక ముఖ్య విశేషం... ఈ సాహిత్యరూపకంలో పాల్గొనే వారందరూ మహిళలే కావటం. అంతేకాదు. వారు తమపాత్రలను అద్భుతంగా పోషిస్తూ ప్రత్యక్షంగా ప్రేక్షకులను వేదికల ద్వారా, ప్రసారమాధ్యమాల ద్వారా శ్రోతలను ఆనంద పారవశ్యాంబుదిలో ఓలలాడిస్తున్నారు. గొప్ప విశేషమేమిటంటే వీటిని రచించి, సమర్ధులైన వారిని ఎంపిక చేసుకుని, దర్శకత్వం వహిస్తూ, తాను ఒక ముఖ్యపాత్రను అద్భుతంగా పోషిస్తూ ఆ సాహితీ సభను అత్యంత సమర్థతతో రాజ్యలక్ష్మి గారు నిర్వహించటం. ప్రశాంత చిత్తంతో ఆమె వాటిని నిర్వహించే తీరు 'ఔరా!' అనిపిస్తోంది. ఒకింత ఈర్ష్యనూ కలిగించక మానదు. వాటిని అనేకచోట్ల ప్రదర్శించి పండిత, పామరుల మెప్పుపొందిన ‘ప్రకృతి విలాసం’ అన్న పేరుతో గ్రంథస్తం చేశారు. దీనిలో అయిదు రూపకాలు ఉన్నాయి.

ప్రకృతి విలాసం అనే నామం ఔచిత్యవంతంగా ఉంది. ఈ ప్రకృతిలోని ఋతువుల మార్పు వృక్ష సంపదకు, ఫలసంపదకు, ఆహార ఉత్పత్తికి, వాతావరణ సమతుల్యతకు అనివార్యం. ప్రకృతి తన ధర్మాన్ని నెరవేరుస్తూ ఒక ఋతువు నుండి మరొకదానికి మారటం ఒక క్రీడతో పోల్చారు. ప్రతి ఋతువు దాని ధర్మాన్ని పాటించినప్పుడే ఈ భూతలం మీద మన ఉనికి సాధ్యం. మనం ప్రకృతిని రక్షించుకుంటేనే మనకు రక్ష. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఆమె విలాసం విలయంగా మారుతుంది. ఈ సందేశాన్ని ఋతువులను పాత్రధారులుగా చేసి వాటి సొబగులను, స్నిగ్ధతను, రామణీయకతను, రామాయణ, భారతాది కావ్యాలనుండి, ఉపనిష త్తులనుండి, వేదమంత్రాల నుండి అద్భుతంగా ఆవిష్కరింపజేశారు.

రెండవ రూపకం మన పుణ్య నదులు అన్న శీర్షికతో నదుల కలుషితమవుతున్న తీరు, దానివల్ల జరుగుతున్న హానిని వివరిస్తూ, వాటిని పరిరక్షించు కోవలసిన మన బాధ్యతను నదులు తమ ఆవేదనను వెల్లడి చేసే వినూత్న రూపకమిది. 'దేవీ విజయం' అన్న నామంతో మహాలక్ష్మీ, మహాసరస్వతి, మహాకాళి ఈ ముగురమ్మల వైభవాలను వివరిస్తూ ఆ జగజ్జనని లలితాదేవిని కీర్తిస్తూ సుమధురగానంతో సాగే ఈ భక్తి సాహిత్య సంగీత రూపకం మూడవదిగా మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. తల్లి తరువాతే తండ్రికి, గురువుకు స్థానమిచ్చిన గొప్ప సంస్కృతి మనది. పురాణతి హాసాలలో మాతృమూర్తి అండదండలతో మహోన్నత విజయాలు సాధించి సుప్రసిద్ధులైన ప్రహ్లాదుడు, ధ్రువుడు, లక్ష్మణుడు వంటివారి గురించి నేటి యువతలో స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగించేటందుకు రచించిన రూపకమే 'మాతృదేవోభవ'. తదనుగుణంగానే దీనిలో యువతీ యువకులను భాగస్వాములను చేయటం నాగరాజ్య లక్ష్మీగారి వివేచనకు నిదర్శనం.

ఇక ఈ పుస్తకంలోని చివరిది అయిదవది 'వనితా వైభవం'. మన పురాణ, ఇతిహాసాలలో సాహస మూర్తులుగా నిలిచిన దమయంతి, సత్యభామ, సీతాదేవి, ద్రౌపది మొదలైన సాధ్వీమణులు తమ కష్టాలను ఎంత సహనంతో, మానసిక స్థైర్యంతో భరించి చివరకు వాటిని అధిగమించి జీవితంలో ఆనందాన్ని పొందారో తెలిపే రూపకమిది. మానసిక దౌర్భల్యంతో జీవన సమరాన్ని సాగించలేక జీవితాన్ని అంతం చేసుకునే యువతకు విచక్షణా, వివేచనలు అలవరచుకోమని ఉద్బోధించే అద్భుత ఆలోచనాత్మక సాహితీ రూపకం. ఈ అయిదు సాహితీ రూపకాలతో పరిమితం కాలేదు వెలువోలు రాజ్యలక్ష్మి గారి సాహితి రూపక రచనోత్సాహం, ప్రదర్శన. మన నవలా నాయకలు, గురజాడ చిత్రించిన స్త్రీలు, మన కవయిత్రులు, మహాభారతంలోని నవరసాలు, హనుమద్వైభవము, రమణి - రామాయణం మొదలైన మరో ఆరు సాహితీ రూపకాలను ప్రదర్శించారు. ఇవి గ్రంథస్తం కావాలి. డాక్టర్ వెలువోలు రాజ్యలక్ష్మి,ఆమె బృంద సాహిత్య ప్రస్థానం మరింత ప్రకాశమానం కావాలని ఆశిద్దాం.

- బొడ్డపాటి చంద్రశేఖర్

ఆంగ్లోపన్యాసకులు

63003 46502

Tags:    

Similar News